క్రెడిట్ మోసాలు..గుర్తింపు చౌర్యాలు కాపాడుకోవాలంటే..


Sat,March 9, 2019 12:20 AM

credit
కేంద్ర బడ్జెట్ కీలక ప్రకటనల్లో టెలికం రంగానికి సంబంధించి ఒకటి ఉంది. దేశంలో ఇంటర్‌నెట్ వాడుతున్న వాళ్ల సంఖ్య 50 కోట్లను దాటడంతో మొబైల్ డేటా వినియోగం బాగా పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2018లో డేటా వినియోగం 144 శాతం పెరిగిందని ప్రభుత్వం తేల్చింది. ఇంత పెద్ద ఎత్తున డేటా వినియోగం పెరుగడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు లభ్యం కావడం, అనువైన ధరకే మొబైల్ డేటా అందుబాటులోకి రావడం, పలు ప్రాంతీయ భాషల్లో టెలికం సేవల విస్తృతి పెరుగడం.

వినియోగదారుల కనెక్టివిటీ ఊహించని రీతిలో పెరుగుతున్న తరుణంలో మనం ఆన్‌లైన్ డేటాను భద్రంగా ఉంచుకోవడం, ఎవరితోనైనా ఫోను పంచుకునే సయయంలో అప్రమత్తంగా ఉండడం చాలా కీలకంగా మారింది. మన మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత విషయాలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఇంకా ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే వాళ్లు చూస్తున్నది కూడా ఇలాంటి సమాచారం కోసమే. అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానం ఆసరాతో ఫిషింగ్, విషింగ్, ఫార్మింగ్ వంటివి చేస్తూ మీ సమాచారం లేదా వివరాలను వాళ్లు సులువుగా దొంగిలిస్తారు(హ్యాక్). మన ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు పోయినప్పుడు లేదా పెద్ద మొత్తంలో బకాయి చెల్లించాల్సి ఉందని క్రెడిట్ కార్డ్ బిల్లు వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ విషయం తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో మన వ్యక్తిగత సమాచారం లేదా డేటా విషయంలో మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇలాంటి అక్రమాలకు ప్రధాన కారణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆర్థిక విషయాలను, క్రెడిట్ సమాచారాన్ని మరింత జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్ అక్రమాల బారిన పడకుండా ఉండడానికి, క్రెడిట్ చౌర్యానికి గురికాకుండా ఉండడానికి, మీ ఆన్‌లైన్ గుర్తింపు వివరాలను భద్రపరచుకోవడానికి కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి. అవి ఏమిటో చూద్దాం.

1 పబ్లిక్ వై-ఫైలో లావాదేవీలు జరుపొద్దు

ఏదైనా పబ్లిక్ ప్రదేశంలో ఉచితంగా అందుబాటులో ఉండే వై-ఫైని ఉపయోగిస్తూ ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరుపడం, డబ్బులు ఇంకొకరికి బదిలీ చేయడం వంటివి చేయకూడదు. వై-ఫైకు మీరు కనెక్ట్ అయినప్పుడు మీరు వాడే మొబైల్ కొన్ని వాయు తరంగాలను విడుదల చేస్తుందనే విషయం మీకు తెలిసే ఉంటుంది. మీ సమాచారాన్ని తస్కరించాలని చూసే హ్యాకర్ (అదే రూటర్‌కి కనెక్ట్ అయిన వాళ్లు) మీ మొబైల్ నుంచి విడుదలయ్యే వాయు తరంగాలను వినగలరు లేదా చూడగలరు. వాటి ఆధారంగా మీ వివరాలను లేదా డేటాను దొంగిలిస్తారు అందుకని అత్యవసర లావాదేవీలు ఏవైనా జరపాల్సి వస్తే మీ సెల్యూలార్ నెట్‌వర్క్ కనెక్టివిటీని మాత్రమే ఉపయోగించండి.
cibil-1

2 ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని తక్కువగా ఉంచండి

మీ వ్యక్తిగత డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే ముందు ఎప్పుడైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీ పాన్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్‌కార్డుల వివరాలను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడే వారు మీ పేరు మీద ఒక రుణాన్ని తీసుకునే అవకాశం కూడా ఉంది. తీసుకున్న రుణానికి సంబంధించి వాయిదాలను చెల్లించాలంటూ మీకు సందేశాలు వచ్చే వరకూ మీకు ఆ విషయం ఏమీ తెలియకుండా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత వివరాలను ఎలా పడితే అలా సోషల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో అందుబాటు లేకుండా సాధ్యమైనంత వరకూ చూసుకోండి. తెలివిగా వ్యవహరించండి. మీ వివరాలను ఎవరికీ తెలియకుండా కాపాడుకోండి.

3 ఎన్‌క్రిప్షన్, టోకనైజేషన్ సేవలు వాడండి

వీసా, మాస్టర్ కార్డు వంటి నెట్‌వర్క్ కంపెనీలు తమ కస్టమర్లకు టోకనైజేషన్ సేవలు అందించాలని రిజర్వ్ బ్యాంకు ఇటీవలే నిర్దేశించింది. మీ 16 అంకెల క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నెంబర్ ఎవరికీ తెలియకుండా ఎన్‌క్రిప్షన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు ఆ కార్డుతో లావాదేవీలు జరిపినప్పుడు దుకాణాల్లో క్యాషియర్, వ్యాపారులకు మీ కార్డు నెంబర్ తెలియకుండా ఉంటుంది. కేవలం మీకు కార్డు జారీ చేసిన సంస్థకు మాత్రమే మీ కార్డు నెంబర్ తెలుస్తుంది. ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు మీ గుర్తింపు ఎవరికీ తెలియకుండా చేసుకోవడానికి ఉన్న మరో మార్గం మొబైల్ వ్యాలెట్లు ఉపయోగించి లావాదేవీలు జరుపడం. మీ కార్డుతో పని లేకుండా దాన్ని దాచి పెట్టుకుని చెల్లింపు జరుపడానికి మొబైల్ వాలెట్లు ఉపయోగపడుతాయి.

4 క్రెడిట్ స్కోర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి

క్రెడిట్ స్కోర్, రిపోర్టులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం వల్ల మీ పేరు మీద ఉన్న రుణ ఖాతాల వివరాలు అన్నీ మీకు తెలిసిపోతాయి. క్రెడిట్ రిపోర్టులో అనేక విభాగాలు లేదా అంశాలు ఉంటాయి. మీ అకౌంట్ల సమాచారం విభాగంలో మీరు అప్పటివరకు తీసుకున్న రుణాల వివరాలు అన్నీ ఉంటాయి. అందులో వివరాలను, వాటి కచ్చితత్వాన్ని పోల్చి చూసుకోండి. మీరు తీసుకోని రుణం వివరాలు ఏవైనా కనిపిస్తే, మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా మీపై ఆర్థిక చౌర్యం జరిగినట్టు తేలిపోతుంది. ఏడాదికి ఒకసారి సిబిల్ ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ ఇస్తుంది. దాని ఆధారంగా మీ రుణ ఖాతాల పర్యవేక్షణ వెంటనే ప్రారంభించండి. సిబిల్ నివేదికను పొందడానికి సబ్‌స్ర్కైబ్ చేస్తే ఇంకా మంచిది.

మీ ఆర్థిక వివరాలు, ముఖ్యంగా రుణ సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. దానివల్ల స్పష్టమైన ప్రయోజనాలు ఉంటాయి. మెరుగైన సిబిల్ స్కోర్ ఆధారంగా మీకు అనువైన రుణాలను మీరు తక్కువ వడ్డీతో సత్వరమే పొందవచ్చు. మీ రుణాల చెల్లింపుల వివరాలు సరిగ్గా లేకపోతే, మీరు మరోసారి రుణం పొందడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా క్రెడిట్ మోసాల బారిన పడినా లేదా గుర్తింపు చౌర్యం బారిన పడినా వెంటనే ఈ కింది జాగ్రత్తలను తీసుకోవాలి.

1. రుణం ఇచ్చిన సంస్థకు వెంటనే మీరు మోసానికి గురైన విషయాన్ని తెలియచేయండి. దీనివల్ల భవిష్యత్తులో రిస్కు తగ్గుతుంది. ఒకవేళ అది క్రెడిట్ కార్డు అయితే, మరిన్ని లావాదేవీలు జరుగకుండా వెంటనే కార్డును బ్లాక్ చేయించండి.

2. పోలీసులకు ఫిర్యాదు చేసి, వెంటనే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయించండి.

3. రుణం ఇచ్చిన సంస్థతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆ మోసపు లావాదేవీని తొలగించేలా చూసుకోండి. క్రెడిట్ బ్యూరోకు కూడా సంబంధిత వివరాలన్నింటినీ తెలియచేయండి.

ఏ పద్ధతిలోనైనా సరే మోసపోకుండా తగిన జాగ్రత్తలను తీసుకోండి. ఎప్పటికప్పుడు మీ లావాదేవీలపై ఓ కన్నేసి ఉంచండి. మీరు మీ నిర్దేశిత ఆర్థిక లక్ష్యాలు అందుకోవాలంటే, ఏ మాత్రం మోసపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
suhatha

239
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles