క్యాన్సర్‌ను జయించి..విజయాన్ని సాధించిన కనికా టెక్రీవాల్


Mon,March 11, 2019 05:42 AM

సాధారణంగా మధ్యతరగతి వారు కూడా చేతిలో కొంత మొత్తం ఉంటే కారు కొనుక్కొంటున్నరోజులివి. అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం లేదంటే క్యాబ్‌లా అద్దెకు తిప్పి ఆదాయాన్ని సమకూర్చుకోవడం సాధారణం. అదే ఓ విమానం కొనుక్కుంటే? విమానమా? కొనుక్కొని ఏం చేస్తాం. రోడ్డుమీదా తిప్పుతామా? లేదంటే మలిచి.. అంటారా? ఆగండి ఆగండి. విమానాన్ని కూడా అద్దెకు తిప్పొచ్చు. అవును కోట్ల రూపాయాలు వెచ్చించి ప్రీమియం కార్లు కొనే కస్టమర్లు మనదేశంలో ఎంతోమంది ఉన్నారు. అలాగని డబ్బులు ఉన్నవారే కానవసరం లేదు. నలుగురైదుగురు స్నేహితులు కలిసిన సరే సుమారు రూ.5కోట్లు వెచ్చిస్తే నాలుగు సీట్ల చిన్న విమానమొస్తుంది. దాన్ని మీరు కొని మాకిస్తే అద్దెకు తిప్పి ఆదాయాన్ని తెచ్చిపెడుతాం పూర్తి నిర్వహణ బాధ్యత మాదే అంటున్న జెట్ సెట్ గో వ్యవస్థాపకురాలు కనికా టేక్రివాల్ సక్సెస్‌మంత్ర.
KanikaTekriwal
కనికా టెక్రీవాల్ 2014లో జెట్ సెట్ గో పేరుతో ప్రైవేట్ విమానయాన సంస్థను ప్రారంభించారు. తమ సంస్థ ద్వారా క్యాబ్ వంటి ప్రైవేట్ విమాన సేవలందిస్తున్న కనికా భవిష్యత్‌లో ప్రతీ ఒక్కరికి చిన్న విమానాలు అవసరమవుతాయని, వాటిని క్యాబ్‌లా ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందని అత్యంత దీమాగా చెబుతున్నది.


అందరికీ అందుబాటులో..

కనికా టెక్రీవాల్ విమానయాన రంగంలో చాలా యేండ్లుగా పని చేస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే పదేండ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి. మనదేశంలో ప్రైవేట్ జెట్లు చాలా తక్కు వ గాను, అంతగా అందుబాటులో లేని రోజుల నుంచి ఆమె కు విమానయాన రంగం గురించి తెలుసు. భారత్‌తో పాటు విదేశీ సంస్థలలో కూడా ఈ రంగానికి సంబంధించి ఆమె పని చేసింది. ఎన్నో సంవత్సరాలుపాటు పనిచేసిన అనుభవం జెట్ సెట్ గో ఏర్పాటుకు దారి తీసింది. గత కొన్నేండ్లుగా ఈ రంగానికి చెందిన కస్టమర్లలో తెలియని విసుగు, చికాకు కనిపిస్తోందనేది ఆమె భావన. ముఖ్యంగా చార్టర్ బ్రోకర్లను, ఆపరేటర్లను కలిసినప్పుడు ఇది మరీ స్పష్టంగా తెలుస్తుందని చెప్తారు. ప్రైవేట్ జెట్ కావాలనుకున్న కస్టమర్ సంబంధిత బ్రోకరునో, ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్‌నో కలవాలి.


బ్రోకర్లు సూచించే చాపర్ల విషయానికొస్తే వారికి కమీషన్ ఎక్కువగా వచ్చే వాటినే వారు చెబుతుంటారు. కస్టమర్ అవసరాల కన్నా వారి కొచ్చే కమిషన్ ముఖ్యమన్నట్లు ప్రవర్తిస్తుంటారు బ్రోకర్లు. పారదర్శకత లోపించడం, చాపర్లు అందుబాటులో లేకపోవడంతో కస్టమర్లు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము చాలా ఎక్కువగా ఉంటున్నది. ఇటువంటి సమస్యల నేపథ్యంలో అనుకూలమైన చార్టర్లను అందించే సంస్థలు, పారద్శర్శకంగా చార్జీలు వసూలు చేసే సంస్థలు వస్తే బాగుంటుందన్న ఆలోచన వారికి ఉంది. బ్రోకర్లకు లాభం చేకూర్చే చాపర్‌లను వినియోగదారులకు సూచించేవారే ఎక్కువ. దీనికి చెక్ పెట్టేందుకే జెట్ సెట్ గోను తీసుకువచ్చేందుకు కృషి చేశాం. జెట్ సెట్ గో అందరికీ అందుబాటులో ఉందని టెక్రీ చెప్పారు.


అవాంతరాలు..

జెట్ సెట్ గో ప్రారంభించిన తర్వాత సుమారు 18 నుంచి 20 నెలల పాటు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంటుంది. అయినా వాటిని అధిగమించింది కనికా. ప్రైవేట్ జెట్ హెలికాఫ్టర్ చాపర్‌లను భారతదేశంలో మొట్టమొదటి ఆన్‌లైన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది మా సంస్థే అని కనిక టెక్రీ గర్వంగా చెప్పారు. జెట్ సెట్ గో ప్రారంభానికి ముందు ప్రణాళికలు అంతా సిద్ధం చేసుకొని రంగంలోకి దిగుదామనుకున్న సమయంలోనే నేను క్యాన్సర్ బారిన పడ్డాను. దీంతో కొంత ఆలస్యం జరిగింది. అదృష్టవశాత్తు మేం ప్రవేశపెడదామనున్న జెట్ సెట్ గోవిధానాన్ని దేశంలో మరెవరు ప్రారంభించలేదు. జెట్ సెట్ గో అనేది ఇంటరాక్టివేట్ టెక్నాలజీతో నడిచేది. దేశవ్యాప్తంగా దీని సేవలు అందుబాటులో ఉంటాయి అంటున్నది కనికా.


ప్రపంచ వ్యాప్తంగా సేవలు

భారత్‌కు చెందిన 80 శాతం ప్రైవేట్ జెట్లు తమ సంస్థలో ఉన్నాయని టెక్రీ వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 400 పైగా విమానాశ్రయాలకు సర్వీసులందిస్తున్నాం. భారత్‌లో 190 విమానాశ్రయాల్లో అడుగు పెట్టాం. జెట్ సెట్ గో ద్వారా బుకింగుకు 100 విమానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 20 కంపెనీలు, వ్యక్తులకు చెందిన 32 విమానాల్ని మేం నిర్వహిస్తున్నాం. పైలట్లతో సహా కంపెనీ సిబ్బంది 160 మంది ఉన్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేశాం. విమానం ఎగిరే ముందు ప్రతీసారి 29 రకాల భద్రతా పరీక్షలు నిర్వహిస్తామని కనికా చెబుతున్నారు.


రుణలిప్పిస్తాం.

ఆసక్తి ఉన్నవారు విమానాలు కొనుగోలు చేస్తామంటే బ్యాంక్ రుణాలు కూడా ఇప్పిస్తామని కనికా అంటున్నారు. విమానం కొనుగోలుకు ముందుకొచ్చిన వ్యక్తులకు ఇతరత్రా అంశాలతో పాటు బ్యాంకు రుణాల్లోనూ సహకరిస్తాం. నాలుగు సీట్ల విమానానికి కనీసం రూ.5 కోట్లు అవుతుంది. ప్రైవేట్ జెట్ సేవలకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నది. భవిష్యత్‌లో డిమాండ్ మరింత పెరుగుతుంది. అందుకే ప్రైవేట్ విమానాలు కొనుగోలు చేయాలనుకునేవారికి సహకరిస్తామని ఆమె అంటున్నారు. హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో జెట్ సెట్ గో సంస్థకు ఎనిమిది ఆఫీసులున్నాయి. కంపెనీలో క్రికెటర్ యువరాజ్ సింగ్, వ్యాపారవేత్త పునీత్ దాల్మియా పెట్టుబడి పెట్టారు.


భిన్నరంగాల కనికా..

ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించే కనిక మారథాన్ రన్నర్, పెయింటర్, ట్రావెలర్. అందుకే ఆమె ప్రతిరోజూ తన జీవితానికి కొత్త నిర్వచనం చెబుతూనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. క్యాన్సర్‌ను జయించి విజయం సాధించిన మహిళలు చాలామందే ఉండొచ్చు. కానీ తమ కాళ్లమీద తాము నిలబడడంతో పాటు వందలాది మందికి ఉపాధినిస్తున్న కనికా ది గ్రేట్.


KanikaTekriwal3

క్యాన్సర్‌ను జయించి..

కనికా టెక్రీవాల్ క్యాన్సర్ బాధితురాలు. అలా అని ఆమె డీలా పడిపోలేదు. అధైర్యానికి గురికాలేదు. నిరాశ చెందలేదు. ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్‌ను జయించి తాను విజయం సాధించాలనుకున్న రంగంలో జయకేతనం ఎగురవేసి అందరితో శభాష్ అనిపించుకుంది. మొట్టమొదటిసారిగా నేను కలిసిన డాక్టర్ నాతో ఏమి చెప్పిందంటే.. కనికా, నువ్వు చాలా తక్కువ రోజులు మాత్రమే బతుకుతావు అంది. అప్పుడు నా వయస్సు 22 సంవత్సరాలు. దిగులుపడలేదు. తాను చేసే వైద్యంపై, మరీ ముఖ్యంగా నాలో నమ్మకం కల్గించే, ఆశావద దృక్పథం ఉన్న ఒక వైద్యుడిని పట్టుకున్నాను. నేను, నా డాక్టరు.. ఒక టీం లాగా క్యాన్సర్‌పై పోరాడాం. ఏడాది పాటు కీమోథెరపి, రేడియేషన్ చికిత్సల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. నాకు అవసరమైన విషయాల గురించి ఆలోచించడానికి, ఒక ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్లడానికి అవసరమైన ఆలోచన చేయడానికి ఈ చికిత్స పొందుతున్న సమయంలో నాకు లభించింది. ఎటువంటి సవాలు అయినా సరే ఎదుర్కొనే సత్తా నాకు వచ్చింది. ముఖ్యంగా లక్ష్యం చేరే వరకు పోరాడే తత్త్వం అలవడిందంటారు కనికా.


KanikaTekriwal2
జెట్ సెట్ గో పనులు ప్రారంభించినప్పుడు ఏ పని సరిగ్గా జరగలేదు. అయినా నేను నిరాశ చెందలేదు. తర్వాత ఏమి చేయాలి, ఎలా సాధించాలనే దానిపై దృష్టి పెట్టాను. 6 నెలల సమయం, ఆదాయ మార్గం వంటివి చెప్పినా కూడా ఈ రోజున ఒక విమానాన్ని కూడా కస్టమర్‌కు అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం, కస్టమర్ల డిమాండ్ పెరగడం వంటి అంశాలే కారణం. అయినా నేను వెనుకంజ వేయలేదు. మరికొంత మంది కస్టమర్ల కోసం ఎదురుచూస్తాను. ఈ విమానాలు మరింత చౌకగా కస్టమర్లకు అందించేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. రాత్రి నిద్రపోయే ముందు ప్రతి రోజూ నాకు ఒకటే అనిపిస్తుంది. ప్రపంచంలో ప్రభావశీలురైన 100 మంది మహిళల స్థానంలో నేను చేరతానని, ఆరోజు దగ్గర్లోనే ఉందని నాకు అనిపిస్తుంది. అని తన గురించి చెప్పుకొన్నారు.

928
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles