కోలాహలంగా శ్రీగోదారంగనాథ కల్యాణం


Mon,January 14, 2019 01:37 AM

ధనుర్మాస మహోత్సవాలు భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు నివాసం ఈ మహోత్సవాలకు వేదికైంది. ఆదివారంతో ధనుర్మాసవ్రతం 29వ రోజుకు చేరుకున్నది. కార్యక్రమంలో భాగంగా శ్రీగోదారంగనాథ స్వాముల కల్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాల నడుమ ఆండాళ్ తల్లి వివాహ వేడుక అత్యంత కోలాహలంగా నిర్వహించారు.
Swamy
ఉదయం నుంచి పెండ్లి తంతు ప్రారంభమైంది. అనంతరం గోదాదేవిని పెండ్లి కుమార్తెగా అలంకరణ చేశారు. ఆదివారం రాత్రి శ్రీగోదా రంగనాథ స్వాములకు అత్యంత వైభవంగా కల్యాణాన్ని నిర్వహించారు. స్వామి వారి కల్యాణ వైభవం ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకున్నది. భోగి అంటే భోగము ఇచ్చే రోజు. పండుగ దినం. జీవుడు చేరడం వల్ల భగవంతునికి భోగం, భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల భక్తునికి భోగం అని ఆచార్యులు తెలిపారు. భోగి నాడు స్వామిని ఆశ్రయించి, అందరికీ ఆనందాన్ని అందించేందుకు గోదాదేవి కల్యాణం ఉపకరిస్తుంది. లోక కల్యాణం కలిగించడానికి శ్రీగోదా రంగనాథ స్వాముల వివాహ వేడుకను నిర్వహిస్తారని ఆయన వివరించారు. ప్రపంచమంతా ఈ కల్యాణ ఫలితం దక్కుతుందని స్వామి వారు పేర్కొన్నారు.

ధనుర్మాస వ్రత మహత్యాన్ని, ఆండాళ్ తల్లి తన పాశురాల ద్వారా మానవ జన్మకు అవసరమైన అంశాలను గురించి త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి భక్తులకు సోదాహరణలతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిష్ రావు, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణు గోపాలాచారి, హైదరాబాద్ సిటీ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షికా గోయల్, ఐబి జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ దంపతులు, శ్రీ జ్యువెలర్స్ అధినేత అనిల్, జూపల్లి రామేశ్వరరావు ఆయన సతీమణి శ్రీకుమారితోపాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డా.రంగరామానుజాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీరంగ నాథ స్వామి, గోదాదేవిలకు అత్యంత కనుల పండువగా కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన ఆచార్యులను శేష వస్ర్తాలతో జూపల్లి రామేశ్వరరావు దంపతులు ఘనంగా సన్మానించారు. తిరుప్పావై వ్రతం సోమవారంతో ముగియనుండడంతో నగరం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు చేరుకున్నారు.

ఉత్తమమైన పురుషార్థం ఇదే!

Swamy1
గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని చేస్తూ తాము కోరే ఉత్తమమైన పురుషార్థం ఇది అని స్వామి వారికి తెలియ చేసింది, అదే విషయాన్ని 29వ పాశురంలో 29వ రోజునే ఆ తల్లి భగవంతునికి వెల్లడించింది. పాశురాలను అనుసంధానం చేసిన వారికి కలిగే ఫలితాన్ని కూడా ఇదే పాశురంలో ఆండాళ్ తల్లి చెప్పింది. భక్తులందరూ ఒకరిని ఒకరు మేల్కొల్పుకుంటూ, అమ్మవారి అనుగ్రహాన్ని పొంది స్వామి వారి సన్నిధికి చేరుకుని తమ భక్తితో భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన్ను ప్రార్థించిన అనంతరం ఆండాళ్ తల్లితోపాటు గోపబాలికలందరూ స్వామి వారికి తమ కోరికలను ఏకరువు పెట్టలేదు. కానీ తామంతా భగవంతుని సేవలో తరించేలా తీర్చిదిద్దమని గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటుంది. తాము కోరుకునే ఉత్తమ పురుషార్థం ఇదేనని, భగవంతునితో బంధం తెగకుండా ఉంటే ఎల్లప్పుడూ మానవ జీవితాన్ని సుఖ, సంతోషాలతో ఉండవచ్చని ఆండాళ్ తల్లి పరమాత్ముణ్ణి కోరింది. తెల్లవారు జాము కంటే ముందే నిద్ర నుంచి మేల్కొని శ్రీకృష్ణుని వద్దకు చేరుకుని ఆయన పాద సేవలో వారంతా తరిస్తారు. అలా గోదాదేవి, గోపికలంతా భగవంతుని సేవలో మునిగిపోతారు.

భగవంతుడు ఎటువంటి పుణ్యం చేసుకోకుండానే మానవ జన్మ ఇచ్చాడు. అటువంటి జన్మను దేవుని సన్నిధిలోనూ, ఆయన స్మరణలోనూ ఉండడమే ఉత్తమ పురుషార్థంగా భావించాలి. చతుర్విధ పురుషార్థాల కంటే ఎంతో మేలైనది ఒక్కటే అదే భగవత్ సన్నిధి. అక్కడకు చేరుకుంటే భగవంతుని గుణములు, ప్రేమ,స్నేహం అన్ని పొందవచ్చు కనుక అన్నింటికంటే ఉత్తమ పురుషార్థమే గొప్పది. ఆండాళ్ తల్లి తన పాశురాల ద్వారా సమాజంలో ఎలా బ్రతకలా? ఎలా బ్రతికితే ఉన్నత స్థితికి చేరుకుంటారు? గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని తన పాశురాల ద్వారా రంగనాథ స్వామి అనుగ్రహాన్ని పొందింది. విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూల ద్రావిడంలో తాను రాసిన 30 పాశురాలను గానం చేసింది. తిరుప్పావై అంటే ముప్పై పాశురాల గీత మాలిక అని అర్థం. దీనిని పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధంలో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నది.

-పసుపులేటి వెంకటేశ్వరరావు
-చిన్న యాదగిరి గౌడ్


Swamy2

1101
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles