కులం..మతం.. లేని మహిళ


Tue,February 19, 2019 12:31 AM

కులం, మతం మనిషికి ఎందుకు? వాటిపేరుతో అసమానతలు ఎందుకు? అవి లేకుండా బతకలేమా? అని ఎప్పుడైనా అనుకున్నారా? .. తమిళనాడు చెందిన ఓ మహిళ అనుకోవడమే కాదు, దాని కోసం పోరాడి విజయం సాధించింది.
sneha-casteless
పాఠశాలలో కులం, మతం లేదని నేర్చుకుని బయటకు వచ్చాక అవే కుల, మతాల పేరుతో జరిగే కొట్లాటలను చేస్తాం. అసలు ఈ కులంతో ఏం సాధించగలం? దీని అవసరం ఎంతవరకు ఉంది? ఈ అంశాలనే ఆమె లెక్కలేసుకుంది. చివరికి ఎలాంటి కులంతో, మంతంతో సంబంధం లేకుండా జీవించాలనుకుంది. దాని కోసం గుర్తింపు పత్రం కావాలని పోరాటం చేసింది. తొమ్మిది సంవత్సరాల సుధీర్ఘ ప్రయత్నాల తర్వాత ఆమె ఏ కులానికి, ఏ మతానికి చెందని వ్యక్తిగా భారతదేశంలో తొలిసారి అధికారిక ధృవీకరణ పత్రం పొందింది. తమిళనాడులోని వెల్లూర్ జిల్లా తిరుపత్తూర్ గ్రామానికి చెందిన ఆమె పేరు ఎంఏ స్నేహ.. కులం, మతం లేని మహిళగా సర్టిఫికెట్ పొంది ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. మీరు చేసింది భవిష్యత్ భారతదేశానికి మార్గదర్శకంగా ఉంది అని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ స్నేహను ఉద్దేశించి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. స్నేహ ఒక లాయర్.. చిన్నప్పటి నుంచి ఆమెకు కులం, మతం గురించి తెలియదు.


ఆమె తల్లిదండ్రులు వాటిని చెప్పకుండా ఆమెను పెంచారు. స్కూళ్లలో, కాలేజీల్లో కులాన్ని చెప్పకుండా పేరు నమోదు చేయించారు. దీంతో స్నేహ కుల, మతాలకు అతీతంగా పెరిగింది. కానీ దీనికి ఓ ఐడెంటిటీ కావాలనుకుంది. తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అధికారులు అలా సర్టిఫికెట్ ఇవ్వటం కుదరదు అన్నారు. న్యాయశాస్త్రం చదివిన ఆమె దీనిపై మరింత స్పందించి కలెక్టర్ వరకూ వెళ్లింది. మీరు కులం, మతం లేకుండానే పెరిగారు కదా.. అలాగే ఉండండి, దానికి సర్టిఫికెట్ ఎందుకు? అని అధికారులు సమాధానం ఇచ్చారు. అయినా సరే నాకు కులమతాల పేరుతో ఎలాంటి ఉపయోగం లేదు, వాటి వల్ల వచ్చే లబ్ది నాకు అనవసరం కానీ దానికి గుర్తింపు కావాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలని పోరాడింది. చివరకూ తహసిల్దార్ చేతుల మీదుగా కులం, మతం లేని మహిళగా సర్టిఫికెట్ పొంది దేశంలో తొలి రికార్డు సృష్టించింది. అంతకు ముందే స్నేహతో సమానమైన ఆలోచనా దృక్పథం ఉన్న ప్రతిభరాజాతో వివాహమైంది. ఈ సర్టిఫికెట్ పొందడానికి రాజా కృషి ఉందని ఆమె వివరించింది.

890
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles