కలాం శాట్ వీరులు!


Sun,February 3, 2019 12:38 AM

పిల్లలూ మీకు రాకెట్ తయారీ గురించి తెలుసా? పెద్ద పెద్ద రాకెట్‌లు నింగిలోకి రయ్‌మంటూ దూసుకెళ్తుంటాయి. ఆకాశంలో వాటి నుంచి వచ్చే పొగ మాత్రమే మనకు కనిపిస్తుంది. అయితే, ఆ రాకెట్లలో శాటిలైట్ వ్యవస్థను అమర్చుతారు. అది వేరే గ్రహాలకు వెళ్లి అక్కడి సమాచారాన్ని మనకు చేరవేస్తుంది. అయితే.. ప్రపంచంలోనే అతిచిన్న శాటిలైట్‌ను తయారు చేశారు ఈ విద్యార్థులు. అది ఇటీవలే గగనతలంలోకి వెళ్లింది కూడా..!
team
తమిళనాడులోని పల్లపట్టికి చెందిన ఈ విద్యార్థులు ప్రపంచంలోనే అతిచిన్న శాటిలైట్ తయారు చేశారు. వీరంతా స్థానిక ఇండియన్ హైస్కూల్లో చదువుతున్నారు. వీరు తయారు చేసిన ఉపగ్రహానికి కలాం శాట్ అని పేరు పెట్టారు. జనవరి 24 రాత్రి 11.40 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీశ్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-44 ద్వారా గగనతలంలోకి వెళ్లింది కూడా. దీనికి ఇస్రో యాజమాన్యం ఒక నయా పైసా కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఈ విద్యార్థులు చెన్నైలోని స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. ఈ అతి చిన్న శాటిలైట్ ధర రూ.12 లక్షలు. బరువు కేవలం 1.26 కిలోలు. దీనిపై ఆరేండ్ల నుంచి పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు.. అంతా సవ్యంగా జరగడంతో కేవలం ఆరు రోజుల్లోనే తయారు చేశారు. ఈ విద్యార్థులందరికీ శ్రీమతి కేసన్ సలహాదారు గా వ్యవహరించారు.

9 యేండ్ల విద్యార్థులతో వర్క్‌షాపులు..

నాసా స్పేస్ క్యాంప్ అంబాసిడర్‌గా కేసన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె 15 మంది విద్యార్థులకు గురువు. వారిలో కొంతమంది కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. తొమ్మిదేండ్ల వయసు నుంచే విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు వర్క్‌షాపులు నిర్వహిస్తుంటారు కేసన్. వారితో చిన్న పరికరాలు తయారు చేయిస్తుండేది. ఈ క్రమంలో విద్యార్థులకు వచ్చే అన్ని సందేహాలను నివృత్తి చేసేవారు కేసన్. 2012లో జరిగిన యంగ్ సైంటిస్ట్ పోటీల్లో రిఫత్ షారూఖ్‌ని ఎంపిక చేసి, అతడితో పలు ప్రయోగాలు చేయించారు. అలా తయారైన రిఫత్ షారూఖ్ కలాం శాట్ తయారీలో కీలకంగా వ్యవహరించాడు. గతంలో పేపర్ మాఖె శాటిలైట్ తయారు చేశాడు.
team1

రిఫత్ నేతృత్వంలో కలాం శాట్..

స్పేస్ కిడ్స్ టీమ్‌లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో 18 యేండ్ల రిఫత్ షారూఖ్ లీడర్‌గా ఉండేవాడు. ఈ విద్యార్థులంతా ఆరేండ్ల కిందట శాటిలైట్‌ను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. చివరి ఆరు రోజుల్లో.. ప్రతిరోజూ 20 గంటలు పని చేసి.. విజయవంతంగా శాటిలైట్‌ను రూపొందించారు. ఈ శాటిలైట్ రెండు నెలల వరకు భూమి చుట్టూ తిరుగుతుంది. త్రీడీ ప్రింట్ కార్బన్ ఫైబర్ పనితీరును తెలుసుకునేందుకు దీనిని ప్రయోగించారు. దీనిని పిల్లలే వారి ఆసక్తి కొద్దీ రూపొందించారు.

మా పరిశోధన వృథా కాలేదు..

sharook
దీని తయారీకి మేము కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టాం. అయితే ఈ శాటిలైట్ లాంచింగ్‌కు ఇస్రో మమ్మల్ని బాగా ప్రోత్సహించింది. మా దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు. ఇందుకు చాలా సంతోషంగా ఉన్నాం. అందరికీ ఆదర్శమైన అబ్దుల్ కలాం పేరుతో ఉపగ్రహానికి కలాం శాట్ అని నామకరణం చేశాం. దీని తయారీకి సాయపడిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. మా అంచనాలకు తగ్గట్లుగానే ఉపగ్రహం కక్ష్యలోకి దూసుకుపోయింది.
- రిఫాత్ షారూఖ్


-వనజ వనిపెంట

1029
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles