కర్మబంధ విముక్తితోనే మోక్షం!


Sat,January 12, 2019 01:39 AM

-సుగుణాల పాయసం సేవింపజేసిన గోదాదేవి
ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతం చేయడం ద్వారా తాను ఏమి ఆశిస్తున్నది? ఎందుకోసం తలపెట్టింది? అనే ప్రశ్నలను శ్రీకృష్ణుని సన్నిధానంలో ఆయనకే విన్నవిస్తుంది. గోదాదేవితోపాటు ఉన్న గోపికలందరూ కలిసి తమకు ఆరు వస్తువులు కావాలని భగవంతుణ్ణి కోరుకుంటారు. 27వ పాశురంలో ఆండాళ్ తల్లి మానవ జీవన సార్థకతకు కావలసిన, అందరూ అనుసరించదగిన మార్గాలను మనకు అందించింది అని చిన జీయర్ స్వామి అన్నారు. నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు నివాసంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారంతో ఈ ధనుర్మాసోత్సవం 27వ రోజుకు చేరుకున్నది.

swamy
ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 9:30గంటల వరకు తిరుప్పావై పఠనం, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి ప్రవచనం, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల వరకూ విష్ణు సహస్రనామ పఠనం, అనంతరం చిన జీయర్ స్వామివారి ప్రవచనం ఉంటున్నాయి. ఈ ఉత్సవాలు జనవరి 14వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి ధనుర్మాస వ్రత మహత్తును సోదాహరణలతో భక్తులకు తెలియజేశారు. ఈనాటి కార్యక్రమంలో జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుటుంబసభ్యులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.మానవ శరీరస్థితిలో పలు దశలుంటాయి. దేహం మన నుంచి పోయిన తర్వాత ఒక స్థితి ఉంటుంది. అదే గొప్ప ఆనందాన్ని ఇస్తుందని వేదాలు చెబుతున్నాయి.

మంచి గుణాలుంటేనే మంచి జరుగుతుంది. అదే విధంగా, మంచి ఎరువులు వేస్తేనే కదా, చెట్లు లేదా మొక్కలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇష్టం కలిగించే ఆకారం, రంగు, అందులో ఉండే ఇతర ప్రవృత్తులకు గుణములు అని పేరు. వీటినే కామములు అని కూడా అంటారని స్వామి తెలిపారు. మనిషి అటువంటి గుణాలనే కోరుకుంటాడు. అన్ని మంచి గుణాలనూ అందరూ కలిసి అనుభవిస్తారు. దేహం వదిలిన తర్వాత ఆత్మ ఆ గుణాలను బ్రహ్మతో కలిసి అనుభవించాల్సి ఉంటుందని చిన జీయర్ స్వామి చెప్పారు. పూర్వీకులు వేదాల ద్వారా దీనినే మనకు తెలియపరిచారని ఆయన అన్నారు. పాలు, నేతిలో వేయించిన జీడిపప్పు, యాలకులు, బెల్లం వంటి వాటితో రుచికరమైన పాయసాన్ని తయారు చేస్తారని, దానిని అన్ని ఇంద్రియాలకు ఆనందం కలిగించేలా అందరూ కలిసి సేవిస్తారని ఆయన అన్నారు. దీనినే కూడారై పాయసం అని, ధనుర్మాస వ్రతంలో భాగంగా 27వ రోజున ఈ పాయసాన్ని తీసుకుంటారని చిన జీయర్ స్వామి సోదాహరణలతో వివరించారు.

అందరం కలిసి ఈ పాయసం స్వీకరించాలని, అది తీసుకోవడం వల్ల మనకున్న కర్మబంధాలన్నీ తొలగిపోవాలని గోదాదేవి కన్నయ్యకు విన్నవించింది. శ్రీ కృష్ణునిలోని మంచి గుణాలతో పోలుస్తూ, ఆ పాయసం ప్రాధాన్యాన్ని స్వామి తెలిపారు. మంచి గుణాలు విడదీయలేని విధంగా పోషకాలతో ఉండే పదార్థాలతో పాయసాన్ని రూపొందిస్తారు. ఈ పాయసం తయారీకి ఉపయోగించే పదార్థాలను, మంచి గుణాలున్న వారందరికీ ఉదాహరణగా ఆండాళ్ తల్లి మనకు చెప్పిందని, భగవంతుని అనుగ్రహం కోసం అందరూ కలిసి ఆయన్ను తమ పాపాలను తొలగించమని వేడుకుంటారని స్వామి పేర్కొన్నారు.

ఆండాళ్ తల్లి వ్రతానికి ఫలితంగా కోరుకున్న ఉత్తమమైన పురుషార్థాన్ని 27వ పాశురంలో వెల్లడించిందని చిన జీయర్ స్వామి చెప్పారు. జీవుడికి కర్మబంధం తొలగితేనే లభించే మోక్షాన్ని మన వేద పండితులు నాలుగు రకాలుగా అభివర్ణించారు. అందులో ఒకటి సాలోక్యము, రెండవది సారూప్యము, మూడవది సామీప్యము, నాల్గవది సాయుజ్జీయము. ఇలా, నాలుగు అంచెలుగా మోక్షం ఉంటుందని స్వామి వారు చెప్పారు. మొట్టమొదట ఈ జీవుడు కర్మకృతమైన లోకాన్ని పూర్తిగా వదిలి, కర్మ సంపర్కం లేని లోకానికి చేరుతాడు. భగవంతుడు ఎక్కడైతే ఒక స్వరూపాన్ని ధరించి ఉంటాడో ఆ లోకానికే ఈ జీవుడు చేరుతాడు. దానిని సాలోక్యము అంటారు. దీనినే, సమానలోక గతుడవడంగా చెబుతారు. అక్కడ భగవంతునికీ, జీవునికీ ఏ మాత్రం తేడా లేకుండా కనిపించదు. ఏ జీవుడు అక్కడకు వెళ్లినా అటువంటి రూపం వస్తుందని అటువంటి రూపాన్నే సారూప్యము అని, లేదా సాదర్మియము అని అంటారని చిన జీయర్ స్వామివారు పేర్కొన్నారు.

దేవుని వద్దకు జీవుని ప్రయాణం ఇలా!

swamy1
ఉపాసనా బలంతో నేను ఎటువంటి ధర్మాలను కలిగి ఉంటానో అటువంటి ధర్మాలనే జీవుడూ పొందవచ్చని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వెల్లడించాడని చిన జీయర్ స్వామి వారు ఉద్ఘాటించారు. ఆ లోకంలో రెండు రకాల జీవరాశి ఉంటుంది. ఎప్పుడూ ఉండే జీవరాశికి నిత్య శూరులు అని, అప్పుడప్పుడు కర్మబంధాలను తొలగించుకుని అక్కడకు చేరే వారిని ముక్తులు అంటారని స్వామి వెల్లడించారు. అక్కడ ఉండే వారందరి రూపంలోగానీ, కలిగే ఆనందంలోగానీ, ఇతర అంశాల్లోగానీ ఎలాంటి భేదం ఉండదని, అంతా సమానంగా ఉంటారని ఉపనిషత్తుల ద్వారా తెలుస్తుంది. సారూప్యం ఏర్పడిన తర్వాత ఆయన సమీపానికే జీవుడు చేరుతాడు. ఇదే జీవ సామీప్యము. మోక్షం కోరుకునే వ్యక్తికి మూడోస్థితి ఇది. ఇందులో భగవంతుడు జీవుడిని రకరకాల కుశల ప్రశ్నలు వేసి తన ఒడిలోకి తీసుకుని, ఒకరికి ఒకరు సేవలందించుకుంటూ ఆనందంగా గడుపుతారని చిన జీయర్ స్వామి వివరించారు. జ్ఞానదశలో ఎవరి నియమంలో వారే ఉంటారు. ఇది పండిన జ్ఞానం కనుక నియమాలు ఇక్కడ ఉండవని, ప్రేమ కూడా పెరుగుతుందని స్వామి వారు తెలిపారు.

-పసుపులేటి వెంకటేశ్వరరావు

-జి. చిన్న యాదగిరిగౌడ్

840
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles