కరెంటు ప్రభాకరుడు


Sat,February 9, 2019 11:42 PM

యాభై సంవత్సరాలు.. ఒక మనిషి జీవితంలోనైనా.. ఒక సంస్థ ఉన్నతిలోనైనా చాలా విలువైన కాలం. అంతటి విలువైన కాలం ఒకే వ్యక్తి.. ఒక సంస్థకు సేవలందిస్తున్నారంటే సాధారణ విషయం కాదు. ఈ అవకాశం అందరికీ రాదు. అలా ఐదు దశాబ్దాల పాటు ఒకే సంస్థలో విశిష్ఠ సేవలందిస్తున్న ఉన్నతాధికారి దేవులపల్లి ప్రభాకర్‌రావు. విద్యుత్ సంస్థలో చేరి నేటికి యాభై వసంతాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా కరెంటు ప్రభాకర్‌రావుకు అభినందనలు తెలుపుతూ ఈ ప్రత్యేక కథనం. 1969 ఫిబ్రవరి 10వ తేదీన.. వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ అకౌంట్స్ అధికారిగా విద్యుత్ సంస్థలో తన సేవలకు శ్రీకారం చుట్టారు దేవులపల్లి ప్రభాకర్‌రావు. విద్యుత్ రంగంలో.. అందులోనూ ఆర్థికపరమైన అంశాలపై ఆయనకున్న అశేషమైన అవగాహన, సమస్యల పరిష్కారంలో ఆయనది అందెవేసిన చేయి. ఆర్థిక విభాగం కావడంతో.. మిగతా విభాగాలన్నింటినీ అర్థం చేసుకునే అవకాశం.. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి ఇంజినీరింగు సబ్జెక్టులనుకూడా లోతుగా పరిశీలించే అవసరం ఉండటం.. ఆయనకు కలిసొచ్చిన అంశం.
prabhakar-rao


అది 1995లో ఒక రోజు ఉదయం..

అప్పటి సమైక్య రాష్ట్రంలోని ఎపీఎస్‌ఈబీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు) ఆర్థిక సలహాదారు కార్యాలయానికి ఒక ముఖ్యమైన, భారత రాజకీయ రంగంలోని కీలకమైన నేతకు అత్యంత దగ్గరి సంబంధీకుడొకరు వచ్చారు. వస్తూనే.. నీ ఫోనును బిజీగా పెట్టొదు.. పీఎంగారు నీకు ఫోన్ చేస్తారట.. అంటూ చెప్పడంతో ఆలర్ట్ అయ్యారు ఆర్థిక సలహాదారు. సుమారు ముప్పావు గంట గడిచిన తరువాత.. ఫోన్ రింగయ్యింది. సర్.. ప్రధాన మంత్రిగారు మీతో మాట్లాడతారట అంటూ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం సిబ్బంది చెప్పి.. వెంటనే ప్రధానికి కనెక్షన్ ఇచ్చారు.


ఏరా బాగున్నావా.. ఏంటీ నీవంటే అందరికీ భయమట. మనకు అవసరమైన వ్యక్తికి సంబంధించిన ఫైలు మీ దగ్గర ఉంది. వీలైతే.. ఆ పని చేసిపెట్టు అంటూ ప్రధానమంత్రి నుంచి వాకబు.. సరే చిన్నాన్న అనే మాట తప్ప ఇటువైపు నుంచి ఇంక వేరే చిన్న శబ్దంకూడా లేదు. ఆపై ప్రధాన మంత్రి చెప్పిన ఫైలును తెప్పించుకుని ఒకటికి రెండుసార్లు పరిశీలించారు.. కానీ కుదరని పని. ఆ ఫైలు అలాగే మూలనపడిపోయింది. ఆ కోరిన వ్యక్తి అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు కాగా.. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ఏపీఎస్‌ఈబీ ఆర్థిక సలహాదారు దేవులపల్లి ప్రభాకర్‌రావు. అత్యంత దగ్గరి బంధువులైనప్పటికీ.. సాక్షాత్తు భారత ప్రధాని ఫోన్ చేసి విషయం చెప్పినా నిబంధనల ప్రకారం అది కుదరదని ఫైలును పక్కనపెట్టిన నిజాయితీ అధికారి దేవులపల్లి ప్రభాకర్‌రావు.


2002 సంవత్సరం.. ఒకరోజు

హైదరాబాద్‌లో సీఎం కార్యాలయం.. విద్యుత్ రంగానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమావేశం జరుగుతున్నది. సీఎం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాను చెప్పిన పనులు సరిగ్గా చేయడం లేదనే ఆవేశం ఆయన మాటల్లో కనపడుతున్నది. అప్పటి ట్రాన్స్‌కో ఆర్థిక విభాగం డైరెక్టర్ దీనికి కారణమనే అపోహతో.. విరుచుకుపడ్డారు. అందరిముందు డైరెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పు తనది కాకున్నా అందరి ముందు తనను దోషిలా అనడం ఆ అధికారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పి.. రాజీనామాపత్రాన్ని అందించారు.. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని మళ్ళీ సేవలు అందించాలని పిలిచినా.. తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా.. తన వ్యక్తిత్వాన్ని, నిజాయితీని శంకించేలా సాక్షాత్తు సీఎం చేసిన ఆరోపణలు ఆయనను ససేమిరా అనేలా చేశాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. అప్పటి విద్యుత్ బోర్డు (ట్రాన్స్‌కో) ఆర్థిక విభాగం డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్‌రావు.


అది 1992 సంవత్సరం..

అప్పటి ఏపీఎస్‌ఈబీ చైర్మన్ చాంబర్. విద్యుత్ అకౌంట్స్ అధికారుల సంఘం అధ్యక్షుడిపై బోర్డు చైర్మన్ తీవ్ర ఆగ్రహంతో గట్టిగా అరుస్తున్నారు. తప్పు లేకున్నా ఇతర ఉన్నతాధికారులు చేసిన తప్పును తనదిగా భావించి బోర్డు చైర్మన్ చేసిన ఆరోపణలకు అక్కడికక్కడే సమాధానం చెప్పారు ఆ సంఘం ప్రతినిధి. తాను చెప్పేది వినకుండా.. గట్టిగా అందరి ముందు అరవడంతో.. అదే స్థాయిలో గట్టిగానే చెప్పారు ఆ సంఘం ప్రతినిధి. ఆ వెంటనే బోర్డులో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ మూడు నెలల నోటీసు ఇచ్చారు. రాజీనామా చేసిన విషయం చాలారోజుల తరువాత ఇతర ఉద్యోగులకు తెలిసింది. ఒక విజ్ఞాపన పత్రంపై అకౌంట్స్ విభాగంలో అటెండర్ నుంచి మొదలుకొని.. ఆ విభాగం డైరెక్టర్ వరకు అందరూ సంతకాలు చేసి.. సదరు అధికారి, సంఘం అధ్యక్షుడి రాజీనామాను ఆమోదించవద్దని కోరుతూ బోర్డు చైర్మన్‌తోపాటు.. ఏకంగా అప్పటి ముఖ్యమంత్రికి పంపించారు. అంతేకాదు.. అప్పటి విద్యుత్ సంస్థలో ఉన్న అన్ని రకాల ఉద్యోగ సంఘాలు, వాటి ప్రతినిధులందరూ కలిసి.. ఏకంగా బోర్డు ఛైర్మన్‌తో కొట్లాడిమరీ ఆ రాజీనామాను తిరస్కరించేలా చేశారు. బోర్డు చైర్మన్ వీవీ రెడి.. రాజీనామా చేసిన విద్యుత్ అకౌంట్స్ అధికారుల సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు.


కరెంటు లేని కాలంలో ..

స్వాతంత్య్రం వచ్చిన మరుసటి సంవత్సరం.. సరిగ్గా చెప్పాలంటే.. హైదరాబాద్ (నిజాం) రాష్ర్టానికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు. 1948 జూన్ 10.. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామం పల్లారిగూడ. అక్కడ పట్వారీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవులపల్లి పశుపతిరావు, మోహనబాయిలకు ప్రభాకర్‌రావు జన్మించారు. ప్రాథమిక విద్యను అక్కడే పూర్తిచేసుకున్న తరువాత.. హన్మకొండ సుబేదారిలో ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీకాం పూర్తిచేసి.. ఎంకాం చదువుతుండగానే.. విద్యుత్ సంస్థలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు.


prabhakar-rao9

విద్యుత్ రంగంలోకి అరంగేట్రం..

సరిగ్గా.. 1969 ఫిబ్రవరి 10 నాడు ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా విద్యుత్ సంస్థలో సేవలను మొదలుపెట్టారు ప్రభాకర్‌రావు. అంత భారీ విద్యుత్ సంస్థలోని అకౌంట్స్ విభాగంలో డైరెక్ట్‌గా నియామకం అయ్యే కిందిస్థాయి ఉద్యోగం అది. ఇక అక్కడి నుంచి ఏ మాత్రం వెనక్కి చూడలేదు. తన నిబద్ధత, నిజాయితీ, తోటి ఉద్యోగులు, అధికారులతో మర్యాద, మానవీయతతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే ఫైనాన్స్‌తోపాటు ఇంజినీరింగు అంశాలనుకూడా శ్రద్ధతో అవపోసన పట్టారు. దీనితో 1974లో చీఫ్ అకౌంట్స్ అధికారిగా పదోన్నతి పొందారు. ఆపై 1992లో ఫైనాన్స్ అడ్వైజర్‌గా, 1998లో మెంబర్ అకౌంట్స్‌గా, 2000 సంవత్సరంలో ట్రాన్స్‌కో డైరెక్టర్ (ఫైనాన్స్)గా, 2004లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతులు పొందారు.


prabhakar-rao10

చదువు కామర్స్.. నైపుణ్యం ఇంజినీరింగ్

ఆయన కామర్స్ చదివి ఏఏవోగా అడుగుపెట్టినా.. విద్యుత్ సంస్థలోని ఇతర విభాగాల గురించి క్షుణ్ణంగా అవగాహన పెంచుకున్నారు. సీఎండీ అనేది సీనియర్ ఐఏఎస్‌లు, ఇంజినీరింగులో మహామహులు లాంటివారికే అందుతుందనే అపోహను పోగొడుతూ కామర్స్ స్టూడెంట్ అయిన ప్రభాకర్‌రావు సీఎండీ పీఠాన్ని అధిష్టించారు. ఆయన సాధించిన విజయాలు ఆయనపై సీఎం కేసీఆర్‌కు ఉన్న నమ్మకాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రభాకర్‌రావు పనితీరుకు గీటురాయిగా చెప్పవచ్చు. ఇదే విషయంపై ఆయన్ను అడిగితే.. సంస్థలోని అన్ని విభాగాలకు ఆర్థిక విభాగంతో సంబంధం ఉంటుంది.. అకౌంట్స్ విషయంలో కొన్నిసార్లు.. ఇంజినీరింగు అంశాలనుకూడా తెలుసుకోవాలి. అయితే నాకున్న ఇంట్రస్ట్‌తో.. అన్ని విషయాలు, సబ్జెక్టులను లోతుగా తెలుసుకునేవాడిని.. అదే సీఎం కేసీఆర్‌కు నాపై నమ్మకం కలిగేలా చేసింది.. సీఎండీగా అవకాశం ఇచ్చేలా చేసింది అన్నారు.


prabhakar-rao7

కరెంటు ప్రభాకర్‌రావుగా..

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల సీఎండీగా ఆయన నిర్వహించిన పాత్ర అమోఘం.. అద్వితీయం. ఇటు విద్యుత్ సంస్థల ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక టీంలాగా అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తిచేసి సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా ముందుకు సాగడం కేవలం ఆయనకే సాధ్యం. కేవలం ఆరు నెలల్లోనే తెలంగాణను నిరంతర వెలుగుల్లోకి తీసుకురావడంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకానికి.. సీఎండీ ప్రభాకర్‌రావు సారథ్యం, నిరంతర శ్రమ, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంతో విజయాల పరంపర మొదలయ్యింది. కొత్తగూడెం లాంటి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను దేశంలో ఇంత వరకు ఎవరూ నిర్మించని విధంగా గడువుకన్నా ముందే పట్టుదలతో పూర్తిచేశారు.


prabhakar-rao4

24 గంటల కరెంటులో..

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా ప్రభాకర్‌రావు కాకుండా వేరే వ్యక్తి అయితే వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంటు అనేది సాధ్యమయ్యేది కాదేమో అనే అనుమానం మాత్రం రావడం ఖాయం. కానీ ప్రభాకర్‌రావుకు విద్యుత్ సంస్థలతో ఉన్న అనుభవం, ఇంజినీరింగు సబ్జెక్టుల్లో ఉన్న నైపుణ్యం కారణంగానే దేశం యావత్తూ ప్రశంసలు కురిపిస్తున్న వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అంశంలో ఘన విజయం సాధించగలిగాం. ఇందుకోసం ఆయన పడిన శ్రమ, పట్టుదల, అందరినీ ఒక టీం లాగా నడిపే నాయకత్వం ఎనలేనివి. అందుకే సీఎం కేసీఆర్‌కూడా ప్రభాకర్‌రావును ఎన్నుకుని, ఎంచుకుని ఉంటారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. తనకున్న నాయకత్వ లక్షణాలతో విద్యుత్ సంస్థల ఉద్యోగులందరినీ ఒక్క తాటిపై నడిపించి.. విజయాలను సాధిస్తూ.. ముందుకు నడుస్తున్నారు. అందుకే ఆయనను కరెంటు ప్రభాకర్‌రావు అనడంలో అతిశయోక్తి లేదు.


prabhakar-rao8

చరిత్రలో నిలుస్తారు

కుటుంబంతో ఇంటివద్ద ఎలా మెలగుతానో.. ఇంటికి ఎక్స్‌టెన్షన్ లాంటి ఆఫీసులో అలాగే మెలగుతానని ప్రభాకర్‌రావు అంటున్నారు. సంస్థ తన కుటుంబమని ఉద్యోగులంతా కుటుంబ సభ్యులని.. సాయంత్రం 5 తరువాత ఇంటికి వెళ్ళాలనేది తనలో ఉండదంటారు. అందుకే సమైక్యాంధ్రలో కరెంటు అనగానే.. నార్ల తాతారావు ఎలా గుర్తుకు వస్తారో.. తెలంగాణలో విద్యుత్ రంగం గురించి చెప్పుకోవాల్సి వస్తే.. కరెంట్ ప్రభాకర్‌రావుగా గుర్తుండిపోతారు.. చరిత్రలో నిలిచిపోతారు.


prabhakar-rao3

రాష్ట్రంలో తొలి జీవో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 5న మొట్టమొదటగా విడుదల చేసిన ఉత్తర్వులు (జీవో నెం.1) ప్రభాకర్‌రావును ట్రాన్స్‌కో, జెన్‌కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ వెలువడింది కావడం గమనార్హం. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌కు ఉన్న ప్రాధాన్యం.. రాష్ట్రంలో నెలకొన్న చీకట్లను తొలగించేందుకు అకుంఠిత దీక్షాదక్షతలు, అనుభవం, సమర్థ్ధత, శ్రమించే తత్వం, విద్యుత్ ఉద్యోగులను ఒక్కతాటిపై నడిపించే నాయకుడు కావాలని ఆలోచించిమరీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన అవకాశాన్ని వమ్ముచేయకుండా సమర్థమంతమైనదిగా ఆయన తీర్చిదిద్దారు. అసిస్టెంట్ అకౌంట్స్ అధికారిగా విద్యుత్ సంస్థలో అతి చిన్న ఉద్యోగిగా అడుగు పెట్టిన ప్రభాకర్‌రావు.. అదే సంస్థలో అత్యున్నత స్థాయిలోని ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గడిచిన ఐదు సంవత్సరాలుగా కొనసాగుతుండటం ఆయన శక్తిసామర్థ్యాలను తేటతెల్లం చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


prabhakar-rao6

సోషలిస్టు..

సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయనలో మానవీయత ముఖ్యమైన సుగుణం. ఉన్నతస్థాయి అధికారులతో ఎలా మెలగుతారో.. తన వద్ద పనిచేసే అటెండర్లతోకూడా అలాగే మసలుతారు. అందరికీ గౌరవం ఇస్తారు. తోటివారు కష్టాల్లో ఉంటే కరిగిపోతారు.. తనకు వీలైనంత సాయం చేసి వారికి భరోసా కల్గించేలా చేయడం ఆయనలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఈ రకంగా చూసుకుంటే ఆయన సోషలిస్టుగా చెప్పుకోవచ్చు. ఆయన సొంతూరు పల్లారిగూడలో ఇంటిని సాహెబ్ అలీ అనే దూదేకుల వ్యక్తికి ఇచ్చేశారు. తన భూమినికూడా సాగుచేసుకుంటున్న వారికే అప్పజెప్పారు. తన కూతురు కులాంతర వివాహానికి ఒప్పుకొని.. పెళ్లిచేయడం ఆయనలోని సోషలిస్టుతత్వానికి, పెద్దమనసుకు నిదర్శనం.


prabhakar-rao5

కుటుంబ విజయం

యాభై సంవత్సరాలపాటు ఒక సంస్థలో సేవలు అందించడమంటే.. అది కుటుంబ పరంగా ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొనే అవకాశం ఉండవచ్చనే అనుమానం రావచ్చు. కానీ ప్రభాకర్‌రావు మాత్రం ఇల్లు, ఆఫీసు రెంటింటినీ సమానంగా.. సమన్వయంతో నిర్వహించారు కనుకనే.. అధికారిగా ఎలా విజయవంతులయ్యారో.. కుటుంబం విషయంలోనూ అంతే విజయులయ్యారు. గణితంలో గ్రాడ్యుయేట్ అయిన లీలను 1974లో పెళ్ళి చేసుకున్న ఆయన.. ఇద్దరు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దారు. కుమారుడు సెల్‌ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ అందించే ఒక ప్రముఖ సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉద్యోగం చేస్తూ.. నెలలో కనీసం వారం, పది రోజులపాటు విదేశాల్లోనే పర్యటిస్తుంటారు. ఇక కూతురు కోయంబత్తూరులో ప్రముఖ డెంటల్ సర్జన్‌గా ఉంటున్నారు. కుమారుడికి ఇద్దరు పిల్లలు.. ఇంట్లో ఉన్నప్పుడు వారితో సరదాగా ఆడుతూ.. ఆడిస్తూ ఉంటారు.


-ఎక్కల్‌దేవి శ్రీనివాస్

2437
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles