కమ్మగా.. కరకరగా.. !


Thu,December 20, 2018 01:53 AM

సాయంకాలాన..చలి పుట్టే సమయాన.. వెచ్చగా చలి కాచుకోవాలనిపిస్తుంటుంది.. పంటి కిందకి వేడి వేడిగా ఏమైనా పడితే.. ఆ సమయంలో ఇంకేం గుర్తుకు రావు.. చలి మరీ వణికిస్తున్న ఈ తరుణంలో.. కచ్చితంగా కరకరలాడే వంటకాలు కావాల్సిందే!
అందుకే క్రంచీగా ఉండే స్పెషల్ ఐటమ్స్ మీకోసం..

అప్పడం కోడి వేపుడు

appadam-kodi

కావాల్సినవి :

చికెన్ : 250 గ్రా.
ఉల్లి పేస్ట్ : చిన్న కప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 1/2 టీస్పూన్స్
పసుపు : పావు టీస్పూన్
అప్పడాలు : 2
ధనియాల పొడి : పావు టీస్పూన్
జీలకర్ర పొడి : పావు టీస్పూన్
గరం మసాలా : అర టీస్పూన్
పచ్చిమిరపకాయలు : 3
కరివేపాకు : ఒక రెమ్మ
కొత్తిమీర : చిన్న కట్ట
కారం, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

చికెన్ శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి ఉల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపాలి. దీంట్లో పచ్చిమిర్చి, పసుపు వేసి దోరగా వేయించాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం ఆగి చికెన్ వేసి కలుపాలి. ఇందులో నుంచి నీళ్లు ఇగిరేంత వరకూ ఉడికించాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కలుపాలి. ఒక నిమిషం ఆగి కారం, కరివేపాకు, ఉప్పు వేసి కలుపాలి. ఈలోపు అప్పడాలను చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ముక్కలుగా చేసుకున్న అప్పడాలను వేసి కలిపి ఒక నిమిషం ఉంచి దించి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. దీన్ని అలా లాగించినా.. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది.

పల్లి కోడి పకోడి

palli-kodi

కావాల్సినవి :

చికెన్ : 200గ్రా. (బోన్‌లెస్), పల్లీలు : ఒక కప్పు
శనగపిండి : 2 టీస్పూన్, కార్న్‌ఫ్లోర్ : ఒక టీస్పూన్
కరివేపాకు : ఒక రెమ్మ, పచ్చిమిర్చి పేస్ట్: ఒక టీస్పూన్
కారం : పావు టేబుల్‌స్పూన్,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
ఉప్పు : తగినంత

తయారీ :

పల్లీలు వేయించుకోవాలి. చికెన్ శుభ్రం చేసుకోవాలి. దాంట్లో ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కార్న్‌ఫ్లోర్, కరివేపాకు, పల్లీలు వేసి పకోడి పిండిలా కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి బాగా వేడి చేసి పకోడిల్లా నూనెలో వేసి దోరగా వేయించాలి. వీటితో ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ రసం వేసి తింటే రుచి అదిరిపోతుంది.

కోడి జంతికలు

kodi-janthikalu

కావాల్సినవి :

చికెన్ కీమా : 250 గ్రా., అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, కరివేపాకు : ఒక రెమ్మ, చాట్ మసాలా : పావు టీస్పూన్, పచ్చిమిరపకాయలు : 3, శనగపిండి : 2 టేబుల్‌స్పూన్స్,కార్న్‌ఫ్లోర్ : ఒక టేబుల్‌స్పూన్, మిరియాల పొడి : పావు టీస్పూన్, కొత్తిమీర : చిన్న కట్ట, నూనె, ఉప్పు :తగినంత

తయారీ :

చికెన్ కీమాలో అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి మిక్సీ పట్టాలి. దీంట్లో కార్న్‌ఫ్లోర్, శనగపిండి, కొద్దిగా నీళ్లు పోసి మరీ వదులుగా కుండా కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. మడుగుల పావులో ఈ మిశ్రమాన్ని పెట్టి నూనె పైన పెట్టి ఒత్తాలి. రెండు వైపులా రంగు మారే వరకు కాల్చుకోవాలి. ఇలా మిశ్రమం మొత్తం చేసుకోవాలి. పై నుంచి చాట్‌మసాలా చల్లుకొని లాగిస్తే ఆ టేస్టే వేరు.

మష్రూమ్ చిప్స్

mushroom-chips

కావాల్సినవి :

మష్రూమ్స్ : 250 గ్రా., కార్న్‌ఫ్లోర్ : ఒక కప్పు
కార్న్‌ఫ్లేక్స్ : 2 కప్పులు, కారం : పావు టీస్పూన్
చాట్‌మసాలా : పావు టీస్పూన్
నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

మష్రూమ్స్‌లో ఉప్పు, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటిని ైస్లెస్‌ల్లాగా కట్ చేసుకోవాలి. మరో గిన్నెలో కార్న్‌ఫ్లోర్, ఉప్పు, కొంచెం నీళ్లు పోసి మరీ వదులుగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. మష్రూమ్స్‌ని తీసుకొని కార్న్‌ఫ్లోర్‌లో ముంచి, కార్న్‌ఫ్లేక్స్‌లో అద్ది నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇలా మష్రూమ్స్ అన్నిటినీ వేయించాలి. ఆ తర్వాత వాటిపై కారం, కొంచెం చాట్‌మసాలా చల్లుకొని వేడిగా లాగించేయాలి.

ఉసిరి పన్నీర్ వేపుడు

panner-usiri

కావాల్సినవి :

ఉసిరికాయలు : 3, పన్నీర్ : 200 గ్రా., శనగపిండి : పావు కప్పు, బియ్యం పిండి : అర కప్పు, పచ్చిమిరపకాయలు : 2, కరివేపాకు : ఒక రెమ్మ, ఉల్లిగడ్డ : 1, అల్లం : చిన్న ముక్క, వెల్లుల్లి : 3 రెబ్బలు, కారం : 2 టేబుల్‌స్పూన్స్ , నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

ఉసిరికాయ గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా మిక్సి పట్టి పక్కన పెట్టాలి. పన్నీర్‌ని సన్నగా, పొడువుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమంలో పన్నీర్ ముక్కలని ముంచి నూనెలో వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఉల్లిపాయను పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె పోసి ఉల్లి పేస్ట్, పచ్చిమిరప కాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి పాయ ముక్కలు వేయాలి. ఇందులో ముందుగా చేసిన ఉసిరికాయ పేస్ట్ వేసి దోరగా వేయించాలి. ఇది కాస్త వేగాక వేయించుకున్న పన్నీర్ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, కారం వేసి కలుపాలి. అంతే.. రుచికరమైన ఉసిరి పన్నీర్ వేపుడు మీ ముందుంటుంది.

జి.యాదగిరి
కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
పార్క్‌లైన్, సికింద్రాబాద్

1079
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles