కథలతో వ్యక్తిత్వ వికాసాన్ని నింపుతున్నఅపర్ణ ఆత్రేయ


Mon,February 11, 2019 01:18 AM

ప్రపంచ కార్పొరేట్ రంగంలో టాప్ పొజిషన్లో ఉన్నవారిలో చాలామంది భారతీయులున్నారు. కానీ మన దేశంలో విద్యారంగం సృజనాత్మకను ప్రోత్సహించే విధంగా లేదన్నది ఆమె ఆలోచన. చిన్న పిల్లల్లో పెరిగే ఆలోచనలకు ప్రోత్సాహ మిచ్చేదిగా ఉండాల్సిన విద్యా వ్యవస్థ అందుకు భిన్నంగా ఉందన్నది ఆమె ఆరోపణ. ప్రస్తుతం పెద్దవారిలో ఎంతమందికి తమ ఆలోచనలను బైటకి చెప్పగలిగే ధైర్యం ఉంది ? ఎంతమంది భయపడకుండా మాట్లాడగలరు ? ఎంతమందికి కొత్తవాటిని సష్టించగలిగే నమ్మకం ఉంది ? అందుకు తగిన స్వేచ్ఛ లభించిందా?అన్నది ఆమె ప్రశ్న. దీనికి ప్రధాన కారణం ఇప్పుడున్న విద్యావ్యవస్తే అంటారామె. చిన్నారులు, తల్లిదండ్రులకు వ్యక్తిత్వ వికాసాన్ని నింపాలనే లక్ష్యంతో కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్ స్థాపించిన అపర్ణ ఆత్రేయ సక్సెస్‌మంత్ర.
aparna
ప్రస్తుతమున్న విద్యావ్యవస్థ సరైనదేనా? అది మన పిల్లలకు ఏం నేర్పుతుంది? భయమా? భరోసానా? అసలు పిల్లల మనసుల్లో ఏం నిండాలి? ఇలాంటి సమాధానం దొరకని ప్రశ్నలెన్నింటికో సమాధానాలను కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్ ద్వారా చెప్తానంటున్నారు అపర్ణ ఆత్రేయ.

ఏం చేస్తుంది?

ఈ ఫౌండేషన్ పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్ల కోసం వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో ఉన్న క్రియేటివ్ ప్రొఫెషనల్స్ ఒక్కో కాన్సెప్ట్‌పై బోధిస్తారు. ఆయా రంగాల్లో నిపుణులు, ఓ ప్రత్యేక విభాగంపై పట్టున్నవారు.. ఇలా పలురకాల వ్యక్తులు మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్, థియేటర్, యాక్టివిటీ ఆధారిత కార్యక్రమాలతో ట్రైనింగ్ ఇస్తారు. ఎ హోలిస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ (AHAM) ఈ ఫౌండేషన్ ప్రత్యేకమైన కార్యక్రమం. చిన్నారులకు అవసరమైన సామాజిక, మానసిక ఆలోచనల్లో పరిపక్వత కోసం దీన్ని రూపొందించారు. ఇది సీబీఎస్‌ఈ సిలబస్‌కు తగినట్లుగానే ఉంటుంది.

ప్రారంభ ఇబ్బందులు

కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్‌కు ప్రారంభంలో కష్టాలు తప్పలేదు. ఈ రంగంలో ఇప్పటికే కొన్ని సంస్థలు ఉండడంతో.. వినూత్న కార్యక్రమాలు రూపొందించాల్సి వచ్చింది. అలాగే ఇవి పాత విధానాల ఆధారంగా కాకుండా ప్రస్తుత తరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకున్నారు. విద్యాసంస్థల నిర్వాహకులకు స్వయంవృద్ధిపై ప్రతీ ఒక్కరూ పెట్టుబడి పెంచడం, అవగాహన పెంచుకోవాల్సిన అవసరంపై ఒప్పించడం పెద్ద సవాల్ అయింది మాకు అంటారు అపర్ణ. ఇప్పటి విద్యావ్యవస్థకు అనుగుణంగానే కొత్త విధమైన కరికులం తయారు చేయడం చాలెంజ్ అయినా.. దీని రూపకల్పనలో ఎంజాయ్ చేశామని చెబుతారామె. ఆలోచనల్లో మార్పుల విషయంలో పిల్లలకు తగిన శిక్షణ ఇవ్వాలనే అంశానికి పేరెంట్స్ కూడా ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు.

భిన్నమైన పద్ధతి

పిల్లలకు వారికేం నచ్చుతుందో చెప్పేందుకు కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్ అవకాశం కల్పిస్తుంది. బోర్ కొట్టేలా చేస్తుంది.. అలాగే దాన్ని అధిగమించడానికి ఏం చేయాలో నేర్పిస్తుంది. తప్పులు చేసేందుకూ అనుమతిస్తుంది, అలాగే వాటిని సరిదిద్దుకోవడాన్ని నేర్పిస్తుంది. స్వేచ్ఛ.. పిల్లల్లో సృజన పెరగడానికి తగిన సాధనం అంటుందీ సంస్థ. వ్యక్తిగత అభివృద్ధి అంటే మార్పులకు నిరోధం లాంటిది. కానీ క్రమమైన అభివృద్ధిలో తప్పనిసరి మార్పు ఉంటుంది. ఇప్పుడు పెద్దలుగా ఉన్నవారంతా.. చిన్నపిల్లలుగా ఉన్న సమయంలో అనేక నిబంధనలకు లోబడి ఉండాల్సి వచ్చింది. రిస్క్ చేసే మెంటాలిటీ చాలా మందికి నేర్పించేవారు కూడా కాదు. నేను చెప్పాను కాబట్టి చెయ్యాల్సిందే అనే వ్యక్తిత్వాన్ని.. అప్పటి పెద్దలంతా కలిసి రుద్దేవారు. ఇలాంటి వ్యవస్థలో మార్పులు రావాలంటే మూలాల నుంచి కదలిక రావాల్సిందే అంటారు అపర్ణ. అందుకే మార్పుపైనే ప్రయోగం మొదలుపెట్టానంటారు.

ఒక ఆలోచన..

aparna2
సాంప్రదాయ విద్యావ్యవస్థ తన పిల్లలపై చూపుతున్న ప్రభావాన్ని చూసిన తర్వాత అపర్ణ ఆత్రేయకు వచ్చిన ఆలోచనే కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్. ఆమె వృత్తిరీత్యా సైకాలజిస్ట్, రచయిత కూడా. తానే స్వయంగా నిధులు సమకూర్చుకుని కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు అపర్ణ. ఇప్పటి విద్యారంగం పిల్లలకు ఏం నేర్పలేకపోతుందనేది ఆమె అభిప్రాయం. వారిని మరింత చైతన్యవంతులను చేయడానికి, అలాగే తల్లిదండ్రుల్లో సానుకూల ఆలోచనలు పెంపొందించే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఫౌండేషన్. ప్రతీవారిలోనూ బాల్యాన్ని కాపాడుకోవడం, సక్సెస్‌కు చిరునామాగా మార్చడం చాలా ముఖ్యమని ఆమె విశ్వసించింది. కథలు పిల్లలపై కీలక ప్రభావాన్ని చూపుతాయని ఆమె గుర్తించింది. ఈ ఆలోచనే ఫౌండేషన్ వైపు నడిపించింది.

మార్పు సాధ్యమేనా?

స్టోరీ టెల్లింగ్.. మానసిక పరిపక్వత సాధించడం కోసం మనకు తెలిసిన ప్రాచీన విద్య ఇది. సమాచారాన్ని పెంపొందించుకోవడం, తరతరాలకు చరిత్ర అందించడంలో దీని ప్రభావం చాలానే ఉంది. యుగాలు గడిచినా దీనికి మించిన సాధనం ఇంకా రాలేదనే చెప్పుకోవాలి. ఈ సకల చరాచర సృష్టిపైనా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్. పార్వతీదేవికి శివుడు ఏ విధంగా సృష్టి గురించి బోధించాడో.. ఆ సమాచారాన్ని చెప్పేందుకు కూడా ఈ సంస్థ ప్రయత్నిస్తున్నది. చరిత్రకు సంబంధించినవో, ఇతరమైనవో.. ఏవో కొన్నింటిని తీసుకుని పాఠాలుగా చేసి నేర్పించినంత మాత్రాన సరిపోదు. దీనితో మన మెదడు ఒకోసారి స్తంభించిపోతుంటుంది. అదే సమయంలో ఒక కథగా దాన్ని వింటే అందులో చాలా మార్పు కనిపిస్తుంది. మనం అర్ధం చేసుకోవడం, గుర్తు పెట్టుకోవడంలోనూ చాలా తేడా ఉంటుంది. మనకు అదో అనుభవం మాదిరిగా ఉంటుంది. అందుకే కథకు మన జీవితంలో చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఒక కథ చెప్పేటప్పుడు.. చెప్పే వ్యక్తి, వినే వ్యక్తి ఇద్దరూ దానికి కనెక్ట్ అవుతారు. అందులో పాత్రధారులుగా భావింపచేసే శక్తి కథకి మాత్రమే ఉంటుంది. అందుకే స్టోరీ చాలా పవర్‌ఫుల్ సాధనం అంటారు అపర్ణ.

aparna3
ఏదైనా కొత్తది ప్రారంభించినపుడు నీలో ఉన్న చిన్నారిని ఎప్పటికీ మర్చిపోకు అని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సలహా ఇస్తున్నారు అపర్ణ. విజయాలు, పరాజయాలను చిన్నప్పటి మాదిరిగానే తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలంటున్నారు. వ్యక్తిగత వృద్ధి కోసం నేను నేర్పించే మంత్రం 3సీ ప్రాసెస్ (కనెక్ట్, చేంజ్, కాన్సీక్వెన్స్), 3ఆర్ ప్రాసెస్ (రీడ్, రీఇన్వెంట్, రెస్పాన్సిబిలిటీ). నీకు నువ్వు చదువుకుంటూ ఉండు. ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టడమో, ఉన్నదాన్ని కొత్తగా రూపొందించాలనే ఆలోచనో ఉండాలి. నిన్ను నువ్వు మార్చుకునే బాధ్యత నీకే ఉంటుంది అని చెబుతున్నారు అపర్ణ ఆత్రేయ.

1110
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles