ఐసీయూలో ఉంటే చనిపోకుండా ఉండేవాడా?


Sun,February 24, 2019 11:30 PM

నా మిత్రుడి వయసు 38, శ్వాసకోశ సమస్య కారణంగా అతన్ని ఆస్పత్రిలో చేర్పించాం. నాలుగు రోజుల దాకా క్రమంగా కోలుకోవడం కనిపించింది. అందుకే డాక్టర్లు ఐసీయూలో ఉంచాలని చెప్పినా మేం ఒప్పుకోలేదు. ఒక రోజు అర్ధర్రాతి హఠాత్తుగా పరిస్థితి విషమించింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అతను చనిపోయాడు. ఐసీయూలో ఉంచి ఉంటే ఇలా జరిగేది కాదని డాక్టర్లు అన్నారు. ఐసీయూలో జరిగే అంతటి ప్రత్యేక చికిత్సలు ఏముంటాయి?
- డి. ముకుందరావ్, ఆదిలాబాద్

ICU
శరీరం పలురకాల ఖనిజాలు, జీవరసాయనాల ఆధారంగా పని చేస్తుంది. వ్యాధిగ్రస్తుల్లో వీటి స్థితిగతుల్లో ఎన్నో తీవ్రమైన పరిణమాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. శరీర వివిధ భాగాలు చాలా వేగంగా దుష్పరిణామాలకు లోనవుతూ ఉంటాయి. శరీరంలో ఉండే సహజమైన సమత్యులత కూడా దెబ్బ తింటుంది. ఐసీయూలో ఉంచినప్పుడు ఎప్పటికప్పుడూ గమనిస్తూ వాటిని క్రమబద్ధంగా చేసే ఏర్పాట్లు ఉంటాయి. శరీరానికి తిరిగి కోలుకునేందుకు అవసరమైన వైద్య చికిత్సలన్నీ ఐసీయూలో అందుబాటులో ఉంటాయి. వ్యాధిగ్రస్తమైన శరీరానికి ఒక నిర్ణీత సమయంలో కోలుకునే శక్తి సహజంగానే ఉంటుంది. అయితే శరీరంలోని కీలకభాగాలైన మెదడు, గుండె, శ్వాసకోశాలు, కాలేయం, కిడ్నీలు, రక్తం దెబ్బతినే వేగాన్ని బట్టి రోగి విషయం చాలా వరకు ఆధారపడి ఉంటుంది. హఠాత్తుగా గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, గుండె సరిగా పని చేయకపోవడం, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్లు రావడం, కడుపులోగానీ, మొదడులో గాని రక్తస్రావం కావడం, వంటి సమస్యలు ఒక్కోసారి శరీరానికి కోలుకునే అవకాశం లేకుండా చేస్తాయి. ఇలాంటి సమయాల్లో రోగి పరిస్థితి చాలా వేగంగా క్షీణిస్తుంది. ఒక్కోసారి అప్పటి వరకూ వేసుకున్న మాత్రలే పడక రియాక్షన్ కావచ్చు. మామూలుగా అయితే ఇలాంటి పరిణామాలను ముందే ఊహించడం సాధ్యం కాదు. ఈ స్థితికన్న ముందే రోగి ఐసీయూలో ఉంటే వెంటనే స్పందించి తక్షణ వైద్య చికిత్సలు అందించడం సాధ్యమవుతుంది.


ప్రమాదాన్ని నిరోధించే అవకాశాలు ఉంటాయి. ఐసీయూలో వెంటిలేటర్లు, డయాలసిస్ యంత్రాలన్నీ అందుబాటులో ఉంటాయి. పైగా అందరూ మంచి నిపుణులు ఉంటారు. గుండె ఆగిపోయినప్పుడు లేదా గుండె లయలో తేడా వచ్చినప్పుడు ఈ స్థితిని నియంత్రించే డిఫెబిలేటర్లు ఉంటాయి. కాబట్టి తక్షణ సేవలు అందుతాయి. గుండెపనితనాన్ని పెంచడం, ఎప్పుడైనా గుండె ఆగిపోయినా తక్షణమే తిరిగి పని చేసేలా చేయడం ఐసీయూలో వీలవుతుంది. కిడ్నీలు పనిచేయనప్పుడు ఉపయోగించే రీనల్ రిప్లేస్‌మెంట్ థెరపీ, కాలేయం సరిగా పనిచేయనప్పుడు ఉపయోగించే మార్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే మందులను అనుకున్నంత సూక్ష్మ స్థాయిలో ఇచ్చే ఇన్‌ఫ్యూజన్ పంపులు ఉంటాయి. వీటికి తోడు నాడీ లోపలి నుంచి ప్రతి బీట్‌ను కొలిచే వీలుంటుంది. ఏ కొంచెం తేడా వచ్చినా తక్షణమే వైద్య చికిత్సలు మొదలవుతాయి. దీని వల్ల విషమ పరిస్థితిలోంచి కూడా రోగి బయటపడే అవకాశాలు ఐసీయూలో ఎక్కువ ఉంటాయి.

1323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles