ఐష్టెశ్వర్యాలకంటే ఎక్కువగా వ్యక్తిత్వానికే విలువిస్తాను


Sun,February 3, 2019 01:26 AM

పాటంటే కేవలం పదాల కూర్పు కాదు. అక్షరాలకు ఆత్మను ఆవహింపజేసి, భావసుగంధాల్ని రంగరించి దానికి అందమైన వర్ణాలను అద్ది మనోప్రపంచంలో రససిద్ధిని కలిగించడమే సిసలైన పాట లక్షణం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాలన్నీ శ్రోతల్లో ఇదే రకమైన రసానుభూతిని కలిగిస్తాయి. లలిత గీతాలు, ప్రణయసంవేదనలు,అభ్యుదయ భావగీతికలు..ఇలా సమస్త భావోద్వేగాలు ఆయన పాటల్లో లక్షణంగా ఒదిగిపోతాయి. ఆయన పాట నిశీధిలో కాంతిధారల్ని ప్రసరింపజేసి చైతన్యగీతమై జ్వలిస్తుంది. వలపుగేయమై ప్రేమామృతాన్ని పంచుతుంది. విఫల హృదయాల్ని అనునయిస్తుంది. మొత్తంగా విరించి విపంచి గానమై ఈ జగత్తును పులకింపజేస్తుంది. 30ఏళ్లుగా తెలుగు పాటకు అందమైన సొబగుల్ని అద్దుతున్న సిరివెన్నెల పాండిత్యప్రకర్షకు సముచిత గౌరవంగా ఇటీవలే కేంద్రప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పాత్రికేయులతో తన మనోభావాల్ని పంచుకున్నారు.
SirivennelaSitaramasastri

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు

పద్మశ్రీ అవార్డు కోసం నా పేరును సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి, నాకు పురస్కారాన్ని ఇవ్వాలని స్వచ్ఛందంగా తమ అభ్యర్థనలను పంపి ఆకాంక్షను వెలిబుచ్చిన లక్షలాది తెలుగు ప్రజలకు వినమ్రంగా శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. ఇది తెలుగు గీతానికి వచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. ఆత్రేయ, వేటూరి వారసుడిగా వారి దివ్యాశీస్సుల ఫలితంగా ఈ పురస్కారం దక్కిందని విశ్వసిస్తున్నాను. ముఫ్పై వసంతాలుగా నేను సాగిస్తున్న సాహితీ వ్యవసాయానికి ఫలసాయంగా తెలుగు ప్రజలే కాకుండా భారతప్రజలందరూ కలిసి అందించిన ఆశీర్వాదంలా ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నాను. ఈ శుభ తరుణాన నాకు సినీ జన్మనిచ్చిన విశ్వనాథ్‌గారి చరణాలకు నమస్కరిస్తున్నాను.

అంతరంగ అన్వేషణే జీవితం

పాట అనేది కేవలం వినోదానికో, కాలక్షేపానికో కాదు. మాటల్లో వ్యక్తపరచలేని అవ్యక్తానుభూతుల వ్యక్తీకరణ సంవిధానమని నా ప్రగాఢ విశ్వాసం. మాటలు చాలక, భాష మూగబోయే స్థితిలో అనేకానేక నైరూప్య భావనల్ని హృదయరంజితంగా తెలియజేసేదే పాట అని నేను నమ్ముతాను. ఎవరైనా గీత రచన కోసం నన్ను సంప్రదిస్తే...సంఘటనలు, వ్యక్తులు, స్థలాలు..ఈ అంశాల మీద పాట అడగొద్దని చెబుతుండేవాడిని. ఎందుకంటే నా దృష్టిలో అవన్నీ తత్కాలీయమైన ప్రయోజనాలనే నెరవేరుస్తాయి. శోకం, హాసం, క్రోధం, ప్రణయం, శృంగారం...ఈ ఉద్వేగాలన్నీ దేశకాలాతీతమైన సార్వజనీన భావాలు. వీటి ఆలంబనగానే నా ప్రస్థానాన్ని సాగించాను. ప్రకృతి, భగవంతుడు ప్రసాదించిన బుద్ధి విచక్షణతో హృదయపు అంతరాంతరాల్ని అన్వేషిస్తూ మనిషి సాగించే ప్రయాణమే స్థూలంగా అతడి జీవితమని నా భావన. ప్రేమ, అభిమానాలు, కోరికలు, ఆవేశకావేశాలు, పశ్చాత్తాపాలు, ఆకాంక్షలు, తీరని దాహాలు, చేరని గమ్యాలు..సమస్త భావోద్వేగాల పట్ల ఆరాటం, మమకారం కనబరుస్తూ ఆ భావాల్ని పాట రూపంలో అక్షరీకరించడమే ప్రతి గీత రచయిత కర్తవ్యమని నేను భావిస్తాను.

రసానుభూతికి స్థాయిభేదాలు ఉండవు

బాధ్యత అనేది ప్రతి కవికీ ఉండాల్సిన సహజ లక్షణం. నేను మనుషుల్ని వర్గాలుగా విభజించి చూడను. రసానుభూతిని పొందడానికి ప్రత్యేక అర్హతలు, స్థాయిభేదాలు వుంటాయని అనుకోను. హృదయస్పర్శ కలిగేలా రాయగలిగినప్పుడు ప్రతి ఒక్కరి మనసు, ఆత్మ స్పందిస్తుంది. అనుభూతికి స్థాయిభేదాలు వుండవు. ఒక పాట రాసే ముందు అది ఎంత కీర్తి తెచ్చిపెడుతుందో, ఎంత ధనాన్ని తెచ్చిపెడుతుందో అని ఆలోచించే బదులు పాటను వినే శ్రోతలకు ఏ మేరకు రసస్ఫూర్తి కలిగిస్తుందో ఆలోచించుకోవాలి. కవిత్వాన్ని ఆస్వాదించే హృదయ ఔన్నత్యం లేనివాడికి కవిత్వం రాసే అర్హత వుండదు.

రాజ్యం కన్నా హృదయం ముఖ్యం

పాటకు అలరించడం, ఆలోచింపజేయడం అనే రెండు లక్షణాలుంటాయి. సాధారణంగా కళలకు ప్రయోజనం అలరింపజేయటమని భావిస్తారు. కానీ ఇంకా పైస్థాయిలో కళ మనల్ని ఆలోచింపజేస్తుంది. ప్రతి పాటలో రసస్ఫోరకంగా నా భావాల్ని చెప్పాలని ప్రయత్నిస్తాను. అన్ని ప్రతిభలు, గొప్పతనాలు, ఘనతలు. ఐష్టెశ్వర్యాలకంటే నేను మనిషి వ్యక్తిత్వానికే ఎక్కువ విలువ ఇస్తాను. ఈ ప్రస్థానంలో నువ్వు ఏం సాధించావని ఎవరైనా అడిగితే మానవ వ్యవసాయం చేసే హృదయాల్లో స్థానం సాధించానని చెబుతా. ఒక రాజ్యం సంపాదించడం కన్నా ఒకరి హృదయంలో విలువైన స్థానం సంపాదించడం చాలా ముఖ్యం.

అప్పుడే పాటకు సార్థకత

సందర్భాన్ని బట్టే పాట తన భాషను ఎంచుకుంటుంది. తెలుగు భాష చాలా పరిపుష్ఠమైంది. అత్యంత క్లిష్టమైన భావాల్ని కూడా సరళంగా చెప్పడానికి అవకాశమున్న ఏకైక భాష అని కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ఎప్పుడో చెప్పారు. ఉధృతమైన, లోతైన భావాల్ని చెప్పాల్సివచ్చినప్పుడు కొంచెం పాండిత్యప్రకర్ష ఉన్న భాషను వాడతాను. పాట ఆలోచింపజేస్తూ అలరించాలి. అప్పుడే దానికి సార్థకత. పాట మనల్ని కేవలం అలరింపజేస్తే మత్తులోకి వెళ్లిపోతాం. ఆలోచనరే కెత్తితే మెలకువలోకి వస్తాం.
SirivennelaSitaramasastri1

నా పాటల్లో నేను కనిపించొద్దు

సినిమా జీవితానికి ప్రతిబింబం. రెండింటికీ తేడా ఏమిటంటే సినిమాలో కొంత నాటకీయత దాగి ఉంటుంది. ఎక్కడైతే మాట మూగబోతుందో అక్కడే పాట మొదలవుతుంది. నా పాటల్లో నేను కనిపించొద్దని ఎప్పుడూ కోరుకుంటుంటాను. ఆ పాటను ఆస్వాదించే వారి భావాలే కనిపించాలన్నది నా ఆకాంక్ష. సమాజం, ప్రజలు అనే సామూహిక భావనల పట్ల నాకు కొన్ని నిశ్చిత అభిప్రాయాలున్నాయి. అవి మనలోని చాలామందిలో ఉన్నాయని భావిస్తాను. సింధూరం చిత్రంలోని అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని.. పాటలో కొన్ని పంక్తులను సినిమాలో వినిపించలేదు. సురాజ్యమవలేని సురాజ్యమెందుకని..సుఖాన మనలేని వికాస మెందుకని. సుమాల బలికోరే సమాజమెందుకని. అడుగుతోంది అదిగో ఎగిరే భరతపతాకం. తెలుసుకోండి ఆ తల్లి తపనలో నేటి కన్నీటి కథనం. విషాదవర్షంలో వివర్ణ చిత్రమని..త్రిశంకు స్వర్గంలో త్రివర్ణ స్వప్నమని తెలుపుతోంది అదిగో ఎగిరే భరతపతాకం. ఆకసానికి తనను ఎగరేసి ఏకాకిగా తననొదిలేసి పాతాళంలో నిలిచిన పౌరుల కరతాళ ధ్వని చూసి విలవిలలాడుతూ వెలవెలబోయెను మువ్వన్నెల జెండా.జలజల కురిసెను తెగిపడిపోయిన ఆశల పువ్వుల దండ...ఈ లైన్స్ సినిమాలో వినిపించవు. వాటిలో ఎంతో ఆర్తి దాగివుందని నా నమ్మకం. భారతసోదరులు నిజంగా సంతోషంగా ఉన్నారా? స్వాతంత్య్ర ఫలాలు నిజంగా నెరవేరాయా? అనే ఆవేదనతో రాసిన పాట ఇది.

చావు శత్రువు కాదు..

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. అనే పాటలో ఆయువంటు ఉన్నవరకు చావు కూడా నెగ్గలేక శవంపైన గెలుపు చాటురా అని రాశాను. ప్రాణం ఉన్నంతవరకు మనం చనిపోయినట్లు కాదు. బ్రతుకు, చావు రెండు వేరుగా ఉంటాయనే భావనతో ఆలోచిస్తే చావు గురించిన అమంగళకరమైన ఆలోచనలు తగ్గుతాయి. అలాగే భయాలకు మనం ఎప్పుడూ భయపడొద్దు. సానుకూల దృక్పథంతో ఉంటే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. ఈ తత్వాన్ని చెప్పడానికి నాకు సినిమా అనే విస్తృతమైన వేదిక దొరికింది. నేను సినిమాను దేవాలయం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. నాట్య శాస్ర్తానికి శివుడి సంకల్పం కారణం. సినిమా అనేది నాటకానికి యాంత్రిక స్వరూపం. సినిమా అనే నాటకాన్ని వేల చోట్ల ఒకేసారి ప్రదర్శిస్తాం. కళలన్నింటిలోకి సాహిత్యం ఉత్తమమైంది. ఈ సాహిత్యంలో అత్యుత్తమ పీఠం నాటకానికి ఉంది. వేదిక ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది. దాని మీద మనం పిచ్చి నృత్యాలు చేస్తున్నామా? శివతాండవం చేస్తున్నామా? లేకపోతే అందమైన గౌరీలాస్యం చూస్తున్నామా? అన్నది మన తాలూకు ఆలోచనల్లోనూ, చేతల్లో ఉంటుంది. వేదిక మాత్రం ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది. సినిమా వల్ల సమాజం బాగుపడుతుందే కానీ పాడైపోవడం అంటూ ఉండదు.

లక్షల మందికి ఆరాధ్యగీతం

కష్టపడకుండా ఏదీ రాదు. అందుకే ప్రసవ వేదన అంటే పుట్టుకకు పూర్వరంగం. నా పాటల్ని పల్లవి నుంచి చివరి పంక్తి వరకు అన్వయించుకుంటూ తమ జీవితాల్ని బాగుచేసుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి ఎలా విలువ కడతాం. ఒక్కో పాట విలువ జీవితపు విలువకు సమానం. ఎప్పుడో ఒప్పుకోవద్దురా అనే పాటను కొన్ని లక్షలమంది ఆరాధ్య గీతంగా భావిస్తారు. ఆశయంతో, ఆర్తితో పాట రాయమని అడిగిన వారికి లాభాపేక్ష లేకుండా పాట రాసిచ్చిన సందర్భాలు చాలా వున్నాయి. నా భుక్తికి సరిపోయేలా 30ఏళ్లుగా పరిశ్రమ అందిస్తూనే ఉంది. నా పాట సినిమా విలువను హెచ్చిస్తే నిజంగా దానికి వెల కట్టలేను.

కాలం చక్రభ్రమణం లాంటిది..

కాలం ఎప్పుడూ మారదు. కాలం మారిపోతే మనం బ్రతకలేం. భౌగోళికంగా ఈ ప్రపంచంలో ఊహాతీతమైన మార్పులు ఏమీ చోటుచేసుకోలేదు. సముద్రం చెలియలి కట్టను ఏర్పాటు చేసుకొని తన ఆధీనంలోనే ఉంది. పంచభూతాలు అలాగే ఉన్నాయి. కానీ మన అభిరుచులు మారాయి. వస్త్రధారణ, ఆహార్యంలో మార్పులు వచ్చాయి. మనం మనుషులమై ఉండి ట్వీటింగ్ ఎందుకు చేయాలి? మాట్లాడొచ్చు కదా?. చాట్ అంటూ చీటింగ్‌లు చేసుకుంటున్నాం. తెలుగువాడు తన తాలూకు ఉనికిని కోల్పోవడానికి ఎక్కువ ముచ్చటపడుతున్నాడు. కాలం చక్రభ్రమణం లాంటిది. తలక్రిందులు కావడం కూడా మళ్లీ మామూలుగా కావడానికే.

నేటి సూర్యోదయం రేపు మరోలా కనిపిస్తుంది

SirivennelaSitaramasastri2
మీలో నిక్షిప్తమై ఉన్న భావాలను మీ సంస్కారానికి అనుగుణంగా నేను నా పాటల్లో పలికిస్తున్నాను కాబట్టే మీరు నన్ను ఇష్టపడుతున్నారు. అప్రియమైన మాటల్ని ఎవరూ మెచ్చుకోరు. మీ అందరి భావాల్ని ఆవాహన చేసుకొని నేను నా గీతాల్లో వ్యక్తీకరిస్తున్నాను. మీ గుండెల్లోని నిశ్శబ్దానికి నేను ప్రతిధ్వనిని. చదువుతున్న అక్షరాల మధ్యలో ఏం ఉంది? మనం చూస్తున్న జీవితానికి ఆవలివైపు ఎలాంటి ఉద్వేగాలు దాగివున్నాయి? అనే అంశాల్ని నిశితంగా పరిశీలిస్తాను. నేటి సూర్యోదయం రేపు మరొలా కనిపిస్తుంది. మనలో కలిగే భావ సంచలనాల్ని బట్టి దృష్టికోణం మారుతూ వుంటుంది. ఆ జీవన వైచిత్రిని నా పాటల్లో చిత్రించడానికి నేను ఇష్టపడతాను.

అది సహజ ప్రక్రియ

ట్యూన్‌కు తగినట్లుగా పాట రాయడమనేది అనాదిగా సినిమా రంగంలో ఉన్నదే. తెలుగులో రకరకాల ఛందస్సు వున్నాయి. అవన్నీ ట్యూన్సే కదా. నువ్వు చెప్పదలచుకున్న భావానికి ఎటువంటి నడకైతే బాగుంటుందో ఎంచుకొని అందులోంచి ఛందస్సు ఎంచుకొని రాయమని ఒకప్పుడు చెప్పేవారు. ట్యూన్‌కు రాయడమనేది చాలా సహజమైన ప్రక్రియ. నా దృష్టిలో సినిమా కవి గొప్ప కవి. మిగతా కవులు వారి వారి భావోద్వేగాలను బట్టి రాసుకుంటారు. కానీ సినిమా కవి విషయంలో అలా వుండదు. భావానికి అనుగుణంగా మూడ్‌ను తెచ్చుకోవాల్సి ఉంటుంది.

స్త్రీని ఎప్పుడూ కించపరచను

నా పాటల్లో స్త్రీని ఏ పరిస్థితుల్లోనూ కించపరచను. సినిమాలో ఆ స్త్రీ పాత్ర ఎలాంటిదైనా కావొచ్చు. స్త్రీని అవమానిస్తూ రాయాలని కోరుకోను. శృంగార రచన చేస్తాను కానీ అంగాంగ వర్ణనలు చేయను. ఎంత ఘాటు , మోటు శృంగారమైనా రాస్తాను. అది కూడా నా కుటుంబ సభ్యులతో కూర్చుని వినగలిగేలా ఉంటుంది. అలాగే కుర్రకారుని రెచ్చగొట్టే పాటల్ని రాయను. యువతను చెడువైపుకు దారితీసే విధంగా సినిమా వుండకూడదని నా అభిప్రాయం. చదువు, పుస్తకపఠనం గొప్పవే. అయితే వంద పుస్తకాలు చదివే బదులు ఓ మంచి గురువుతో సంభాషించడం ద్వారా అంతే జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు.

-కళాధర్‌రావు
-సిఎం. ప్రవీణ్

841
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles