ఐటీఆర్ గడువు మించితే ఏం జరుగుతుంది?


Fri,August 17, 2018 11:45 PM

నిర్ణీత గడువు లోపల ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్)లను దాఖలు చేయకపోతే.. ఆ తర్వాత మళ్లీ అవకాశం ఉండదు. ఇదే చాలామందిలో ఉన్న అభిప్రాయం. అసలు గడువులోగా ఐటీ రిటర్నులు ఫైల్ చేయనిపక్షంలో ఏం జరుగుతుంది?
taxes

ఐటీ రిటర్నుల దాఖలుకు చివరి తేదీ ఎప్పుడు?

గడువులోగా ఐటీ రిటర్నులను దాఖలు పరుచకపోతే ఏం జరుగుతుందన్నది తెలుసుకోవడానికి ముందు.. ఈ 2018-19 మదింపు సంవత్సరానికిగాను ఐటీ రిటర్నుల దాఖలుకు చివరి తేదీ ఎప్పుడన్నది తెలుసుకోవాలి. అది ఈ నెలాఖరే. అంటే ఆగస్టు 31 అన్నమాట. నిజానికి జూలై 31 ఆఖరు. అయితే పన్ను చెల్లింపుదారుల కోరిక మేరకు దీన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నెల రోజులపాటు పొడిగించింది. ఈ నెల 31లోగా రిటర్నులు దాఖలు చేసినవారికే సవరణ రిటర్నులను దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాగా, మీరు ఏదైనా వ్యాపారరీత్యాగానీ, వృత్తిరీత్యాగానీ లేదంటే మీ అకౌంట్స్ ఆడిటింగ్ ఆలస్యం వల్లగానీ గడువు దాటిపోతే సెప్టెంబర్ 30దాకా పొడిగించుకోవచ్చు. భాగస్వామ్య సంస్థలో వర్కింగ్ పార్ట్‌నర్ కోసం కూడా సెప్టెంబర్ 30 వరకు ఐటీ రిటర్నులను దాఖలు చేసుకునే వెసులుబాటున్నది. కానీ ట్యాక్స్ ఆడిటింగ్ అంశాలకు సంబంధించిన జాప్యం ఉంటేనే ఇలా వీలవుతుంది. అలాగే కొందరు వ్యాపారులకూ నవంబర్ 30దాకా ఐటీ రిటర్నుల దాఖలుకు అవకాశం ఉన్నది.

గడువు దాటిపోతే ఏమవుతుంది?

ఆగస్టు 31 గడువు దాటిపోతే.. వచ్చే ఏడాది మార్చి 31లోగా దాఖలు చేసుకోవచ్చు. కానీ ఆలస్య రుసుము చెల్లించాలి. అయితే ఈ నెల 31లోగా మీ ఐటీ రిటర్నులను దాఖలు చేయకపోతే మాత్రం కొన్ని నష్టాలను తర్వాతి సంవత్సరాల్లోకి మార్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. అంతేగాక ఐటీ రిఫండ్ క్లయిములకు సంబంధించిన ప్రయోజనాలనూ కోల్పోయే వీలున్నది. కొన్ని సందర్భాల్లో జరిమానాల్నీ చెల్లించాల్సి రావచ్చు. ఆలస్యానికి లేట్ ఫీజులను కట్టాల్సిరావచ్చు. ఈ రుసుము మీ ఆదాయంపై, మీ ఐటీ రిటర్నుల దాఖలు గడువు ఆధారంగా ఉంటుంది. ఆగస్టు 31 తర్వాత, డిసెంబర్ 31కిలోపు ఐటీ రిటర్నులను దాఖలుచేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. అయితే రూ.5 లక్షల దిగువన ఆదాయమున్న చిన్న ట్యాక్స్‌పేయర్లకు వెసులుబాటు ఉంటుంది. వీరికి ఈ జరిమానా గరిష్ఠంగా రూ.1,000 మాత్రమే. ఇక వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య ఐటీఆర్ దాఖలు చేస్తే జరిమానాగా రూ.10,000 చెల్లించాలి.

మార్చి 31 గడువూ మించిపోతే?

వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉన్న గడువును కూడా చేజార్చుకుంటే మీ ఆదాయంపై ఐటీ శాఖ 50 శాతం జరిమానా వేసే వీలుంటుంది. రూ.3,000లకు మించి పన్ను ఎగవేత ఉంటే మీపై విచారణ చేపట్టే అవకాశాలూ ఉన్నాయి. అంతేగాక రెండు నుంచి ఏడేండ్ల వరకు జైలుశిక్ష పడే వీలున్నది. ఇది మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ తతంగం అంతా కూడా లేకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. అది నిర్ణీత గడువు లోపల ఐటీ రిటర్నులను దాఖలు చేయడమే.

486
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles