ఎస్‌ఐపీ ఎంపిక ఎలా?


Sat,January 26, 2019 01:02 AM

investment
మార్కెట్లో స్వల్ప కాలంలో వచ్చే ఒడిదుడుకులు కొత్త ఇన్వెస్టర్లకు ఓ పెద్ద తలనొప్పి. ఇలాంటి మార్కెట్‌లో మదుపు చేయడం సవాలే. ఈ ఒడిదుడుకుల రిస్క్‌లకు దూరంగా ఉండాలనుకునేవారు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారంలలో మదుపు చేయడం ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మ్యూచువల్ ఫండ్లలో ప్రతీనెలా సిస్టామాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) ద్వారా మదుపు చేయడం నేటి ట్రెండ్. స్పల్పకాలిక ఒడిదుడుకులు, తప్పుడు సమయాల్లో మదుపు చేస్తే ఉండే రిస్క్‌ల నుంచి సిప్‌లు ఇన్వెస్టర్లను కాపాడతాయి. సిప్ పద్దతిలో మదుపు చేయడం కూడా సులభమే. అయితే సిప్ రూపంలో మదుపు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మీ రాబడి అంచనాలకు తగ్గట్టుగా, ఎంతకాలానికి రాబడిని ఆశిస్తున్నారో మొదట తెలుసుకొని అందుకు తగ్గట్టు సరైన ఫండ్‌ను సిప్ కోసం ఎంపిక చేసుకోవాలి. ఒడిదుడుకులు మదుపు ప్రక్రియలో ఓ భాగం. మార్కెట్ హెచ్చుతగ్గులకు గురవుతున్నప్పుడు సిప్‌లను నిలిపివేయరాదు. దీర్ఘకాలంలో అలాంటి ఒడిదుడుకులకు అర్థం ఉండదు. మ్యూచువల్ సగటున కొనుగోలు చేయడం వల్ల ఉండే ప్రయోజనాలనూ పొందవచ్చు. వివిధ రకాల మార్కెట్ పరిస్థితులను సమర్ధంగా ఎదుర్కొగల సాధనంగా సిప్ పనిచేస్తుంది. మనం చేయాల్సిందిల్లా ఓ మంచి ఫండ్‌ను ఎంపిక చేసుకోవడమే. సిప్ కోసం ఫండ్‌ను ఎంపిక చేసుకోవడంలో అవలంభించాల్సిన పద్ధతులేమిటో తెలుసుకుందాం.


1 రేటింగ్: మీరు ఎంపిక చేసుకున్న కేటగిరిలో మంచి రేటింగ్ ఉన్న ఫండ్ల జాబితాను తయారు చేయండి. 4 లేదా 5స్టార్స్ ఉన్న ఫండ్లను మాత్రమే ఎంపిక చేయండి. రేటింగ్‌లను వివిధ వెబ్‌సైట్లు అందిస్తున్నాయి. ఆ ఫండ్ ఎంత కాలం నుంచి ఉంది, ఎంత రాబడిని స్థిరంగా ఇస్తున్నది, ఏయూఎం వ్యయాల నిష్పత్తి వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జాబితాను తయారు చేయండి. జాబితాలో నుంచి ఉత్తమ ఫండ్ ఎంచుకోండి.


2 ఫండ్ వయసెంత? కొత్తగా వచ్చి ఫండ్ల పనితీరును అంచనా వేయలేం కనుక వాటిని మీ జాబితాలో నుంచి తీసివేయండి. ఐదేండ్ల లోపు ఫండ్లను జాబితాలో నుంచి తొలగించండి. 7 నుంచి 10 ఏండ్ల పైబడి ఉన్న ఫండ్లనే జాబితాలో ఉంచండి. దీర్ఘకాలంగా ఉన్న ఫండ్ల పనితీరును, రాబడులను బేరిజు వేయడానికి చరిత్ర అందుబాటులో ఉంటుంది. అలాంటి ఫండ్లు మార్కెట్ ఒడిదుడకులన్నింటినీ ఎదుర్కొని నిలచి ఉన్నవే.


3 రాబడుల్లో నిలకడ: జాబితాలో మిగిలిన వాటిలో అవి అందించిన రాబడులను మదింపు చేయండి. గత కొన్ని సంవత్సరాలలో వివిధ మార్కెట్ పరిస్థితుల్లో ఎలాంటి రాబడులను అందించాయో పరిశీలించండి. మార్కెట్ పతనం అయినప్పుడు వాటి ఎన్‌ఏవి ఎంత పతనం అయింది? మార్కెట్ బుల్లిష్‌గా ఉన్నప్పుడు ఎలాంటి రాబడులను అందించింది? అన్న అంశాలను పరిశీలించండి. మంచి ఫండ్ అయితే మార్కెట్ కన్నా తక్కువ పతనం కావడం, మార్కెట్ కన్నా ఎక్కువ రాబడిని ఇవ్వడం జరుగుతుంది. ఎస్‌ఐపీల కోసం ఫండ్ ఎంపిక చేసుకునేప్పుడు గత మూడు నుంచి ఐదేండ్ల కాలం ఏటా సగటున ఎంత రాబడిని ఇచ్చాయన్న అంశాన్ని పరిశీలించండి. గత ఏడాది కాల రాబడులను అంచనా వేయడం వల్ల ప్రయోజనం వుండదు.


4 ఫండ్ మేనేజర్: మ్యూచువల్ ఫండ్‌ను నిర్వహిస్తున్న ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డును పరిశీలించండి. ఒక వేళ ఇటీవలే ఫండ్ మేనేజర్ మారినట్టయితే అతను నిర్వహించిన ఇతర ఫండ్ల పనితీరును పరిశీలించండి. ఫండ్ మేనేజర్ మార్పు కూడా ఫండ్ పనితీరు మీద ప్రభావం చూపుతుంది. చాలా వరకు ఫండ్ మేనేజర్ల మార్పులు తక్కువగానే ఉంటాయి. ఒకే ఫండ్ మేనేజర్ దీర్ఘకాలంగా నిర్వహిస్తున్న ఫండ్ అయితే అతని పనితీరును అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది.

సిప్ (ఎస్‌ఐపీ) ప్రధాన ఉద్దేశ్యం రిస్క్‌ను దీర్ఘకాలానికి స్ప్రెడ్ చేయడమే. సిప్ మదుపు ద్వారా కాస్త అధిక రిస్క్‌నే తీసుకోవచ్చు. మార్కెట్ ఒడిదుడుకులన్నింటినిలోనూ మదుపు చేస్తాం కనుక మనకు సగటు ధరను పొందుతాం. నిలకడగా రాబడిని ఇస్తున్న ఫండ్‌ను సిప్ కోసం ఎంపిక చేసుకోవడం ఉత్తమ మార్గం. ఒకటి కన్నా రెండు మూడు ఫండ్లలో సిప్‌లను చేయడం వల్ల రిస్క్‌ను వివిధీకరించుకోవచ్చు. మార్కెట్ ఎంతగా ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటే సిప్‌కు అంతకు మించిన సమయం మరోకటి ఉండదు.

Harsh-Jain
హరీశ్ జైన్
కో ఫౌండర్&సీఓఓ
గ్రో డాట్ కామ్

541
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles