ఎవరూ చూపని తెలంగాణ


Sat,February 2, 2019 11:25 PM

తెలంగాణకు ఎంతో చరిత్ర ఉంది. ఆదిమానవుల కాలం నుంచి ఇప్పటి వరకు శోధిస్తూ పోతే.. సాధించలేనంత తరగని చరిత్ర ఈ గడ్డ మీద దొరుకుతుంది. ఒక చరిత్రను వెలికి తీయడానికి ఎవరో ఒకరూ పూనుకుంటారు. ఒకరు పుస్తక రూపంలో చరిత్రను అక్షరీకరిస్తారు. మరొకరు వీడియోల రూపంలో చిత్రీకరిస్తారు. మరొకరు ఫొటోలలో బంధించి భావి తరాలకు ఇదీ.. మన ఘన చరిత్ర అని పరిచయం చేస్తారు. క్షణక్షణం చరిత్రను కాపాడుకుంటూ, కొత్త చరిత్రను వెతుక్కుంటూ చరిత్రకే అంకితమైపోతారు. మనకు తెలియని మన గడ్డ ఘనమైన చారిత్రిక సంపద రవీంద్రభారతిలోని ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్ రూపంలో కొలువుదీరింది. ద అన్‌టోల్డ్ తెలంగాణ (టేల్స్ ఆఫ్ ద ఫర్‌గెటాన్ పాస్ట్) అంటూ తెలంగాణ యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య పకిడె మరుగున పడిన మాణిక్యంలాంటి మన చరిత్రను ఫొటోల రూపంలో బంధించి ప్రదర్శిస్తున్నాడు. చరిత్ర గర్భంలో కలిసిపోయిన ఎన్నో పురాతన ఆనవాళ్లను తెలంగాణ అంతటా తిరిగి సంపాదించి ప్రదర్శన రూపంలో పట్నానికి తీసుకొచ్చాడు. ఆ వివరాలతో ఈ వారం సింగిడి..
paadhalu

పాదాలు..

మహబూబ్ నగర్ జడ్చర్ల మండలానికి చెందిన అల్వాన్‌పల్లి గ్రామంలోని గొల్లత్త గుడి సమీపంలో ఈ అతిపెద్ద పాదాలున్నాయి. ఇవి జైన మహావీరునికి సంబధించిన పాదాలుగా భావిస్తున్నారు. ఆరడుగుల పొడవున్న ఈ పాదాలు 8-10 వ శతాబ్దం కాలానికి చెందినవి.


kondaprthi-ganesh

ఐదడుగుల గణపతి విగ్రహం

కాకతీయుల కాలంలో కొండపర్తిలోని త్రికుటాలయం ముందు ఈ ఐదడుగుల విగ్రహం ఉండేది. విగ్రహానికి నాగబంధం ఉండడంతో విగ్రహంలో వజ్రాలున్నాయేమో అని విగ్రహం పగులగొట్టారు. ఇది పగులగొట్టక ముందు అరవింద్ తీసిన చివరి ఛాయాచిత్రం. కాకతీయుల చేత నిత్యం పూజలందుకున్న ఈ విగ్రహం ప్రస్తుతం ముక్కలుగా మిగిలింది.


balipeetam

వీరశైవ బలిపీఠం

వరంగల్ సమీపంలోని వీర శైవ బలిపీఠం ఇది . వీర శైవం ప్రబలంగా ఉన్న కాలంలో శివైక్యం చెందాలని కోరుకునే వారు స్వచ్ఛందంగా తమ తలని ఈ పీఠం వద్ద నరుక్కునేవారట. ఈ బలిపీఠం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.


edulabad

వజ్ర భైరవుడు

9 తలలు, 18 చేతులతో ఉన్న అరుదైన భైరవుడి విగ్రహం ఇది. బౌద్ధమతంలోని వజ్ర భైరవుడిని పోలి ఉన్న ఈ విగ్రహం ఘట్‌కేసర్ సమీపంలోని ఏదులాబాద్ అనే గ్రామంలో ఉంది. తాంత్రికులు వజ్ర భైరవుడిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు.


pandavula-gutta

ఇంకా ఎన్నో..

పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని ఉండవల్లి గుహాలయాలు, మానేరు నది సమీపంలోని సోమనపల్లి గుహాలయాలు, ఆత్మకూరులో 300 గదులతో నిర్మించిన ఆత్మకూరు గడి, కొండపర్తి, వెంకటాపురం గ్రామ సరిహద్దులోని భైరవుడి విగ్రహం, దేవరకొండ సమీపంలో చందంపేట మండలానికి చెందిన కాచరాజుపల్లి రంగుల గుహలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి సమీపంలో దామరవాయి బృహత్ శిలాయుగం నాటి మానవ సమాధులు, భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టపై గొంతెమ్మ గుహ 7,8వ శతాబ్దాల కాలం నాటివి, జఫర్‌ఘడ్ ప్రాంతంలో దొరికిన అసంపూర్తిగా ఉన్న బుద్ధుని విగ్రహం, గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని ప్రాచీన మానవుని సమాధులు, జనగామ జిల్లాలో ఇప్పగూడెం సమీపంలోని నాగుల చెరువు దగ్గర ఉన్న బౌద్ధమత వజ్రాయానంలో ధ్యానముద్రలో ఉన్న దేవతా తార విగ్రహం ఇలా ఎన్నో చారిత్రక శిలలు, విగ్రహాలు, చారిత్రిక సంపద ఫొటోల రూపంలో ప్రదర్శనలో ఉంచాడు అరవింద్. ఈ నెల 6వ తారీఖు వరకు కొనసాగే ఈ ప్రదర్శనను చూస్తే మీకు తెలియని మన చరిత్రలోకి ప్రయాణించవచ్చు.


gollttagudi

గొల్లత్త గుడి

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల అల్వాన్‌పల్లిలోని ఈ చారిత్రక కట్టడాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారు. ఆ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూటులు 65 అడుగుల ఎత్తులో కేవలం ఇటుక మీద ఇటుక పేర్చి, మధ్యలో ఎలాంటి మిశ్రమం వాడకుండా ఈ అరుదైన ఆలయం నిర్మించారు. జైన తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి కోసం దీన్ని నిర్మించారు.


herostone-nidigonda

నిడిగొండ హీరోస్టోన్

జనగామ జిల్లాలోని నిడిగొండలో పంటభూముల్లో ఈ విగ్రహం ఉంది. రామప్ప దేవాలయంలో మదనిక శిల్పానికి కనిపించే హైహీల్స్ ఈ శిల్పానికి కూడా ఉంటాయి. ఈ విగ్రహాన్ని విరగళ్లు విగ్రహం అంటారు. హైహీల్స్ వేసుకొని, ఆయుధం ఎక్కుపెట్టిన చక్రవర్తి మాదిరిగా ఈ విగ్రహం ఉంటుంది. కొన్నిప్రాంతాల్లో భైరవుడి విగ్రహానికి కూడా హైహీల్స్ ఉంటాయి. కాకపోతే ఈ విగ్రహం చేతిలో ఆయుధం ఉంది.


redlawada

రెడ్లవాడ

వరంగల్ రూరల్ జిల్లాలోని రెడ్లవాడ గ్రామ సరిహద్దులోని గుట్ట బండరాయికి ఈ విగ్రహం చెక్కి ఉంది. 12 చేతులతో భయం కలిగించేలా జ్వాలామాలిని విగ్రహం చెక్కారు. ఈ విగ్రహాన్ని జైనమతంలో ఆరాధిస్తారు.


ichampally-project

ఇచ్చంపల్లి ప్రాజెక్టు

ఐదో నిజాం కాలంలో ఫ్రెంచ్‌వారు నిర్మించ తలపెట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు తాలూకు గుర్తులివి. క్రీ.శ 1867లో ప్రారంభమైన ఈ నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్లేగు వ్యాధి ప్రబలి ఒకేరోజు దాదాపు రెండువేల మంది కార్మికులు, ఇంజినీర్లు చనిపోయారు. దీంతో ఆ ప్రాజెక్టును కట్టడానికి ఇంకెవరూ ముందుకు రాలేదు. కానీ ఫ్రెంచి ఇంజినీర్ల నిర్మాణ నైపుణ్యానికి ఇది సాక్షీభూతంగా నిలిచింది. అక్కడ నిర్మించిన ఫ్రెంచ్ ఇంజినీర్ల సమాధులు ఇప్పటికీ ఉన్నాయి.


mogalicherla

మొగలిచర్ల రాతిగుహలు

వరంగల్ రూరల్ జిల్లాలోని మొగలిచర్ల గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఏకవీరా దేవి ఆలయం ఉంది. ఆ గుడి ఎదురుగా ఉన్న పెద్ద రాతిగుండు మూడు గుహలుగా చెక్కబడి ఉంది. ఈ గుహల్లో జైన మతానికి చెందిన సల్లేఖన గుహలు లేదా జైన మునులు తపస్సు చేసుకునేందుకు ఉపయోగించి ఉంటారని పురాతత్వవేత్తల అభిప్రాయం.


shanthinath

శాంతినాథ విగ్రహం

హన్మకొండలో బస్టాప్‌లో దిగగానే కనిపించే 30 అడుగుల అతిపెద్ద విగ్రహం ఇది. హన్మకొండలో ప్రసిద్ధి చెందిన పద్మాక్షి అమ్మవారి ఆలయ సమీపంలో అగ్గలయ్య గుట్ట మీద ఈ విగ్రహం ఉంది. 16వ జైన తీర్థంకరుడైన శాంతినాథుని 30 అడుగుల విగ్రహం ఇది. కర్ణాటకలోని శ్రావణ బెళగులలో ఉన్న బాహుబలి విగ్రహం తర్వాత అంత ఎత్తైన విగ్రహం దేశంలో ఇది రెండవది.


pratapagiri

ప్రతాపగిరి కోట కరీంనగర్, జయశంకర్

భూపాలపల్లి జిల్లాల సరిహద్దులో కాళేశ్వరం సమీపంలోని మహదేవపూర్ అడవుల్లో ప్రతాపగిరికోట వుంది. శత్రుదుర్భేద్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రాజులు కోటలను గిరి, వన, జల దుర్గాలతో కట్టారు. ప్రతాపగిరి కోట దట్టమైన అడవిలో కట్టారు. అందుకే ఈ కోటను గిరిదుర్గం అని కూడా అంటారు.


adavi-somanapally

నైనగూళ్లు

దట్టమైన అడవిలో పచ్చని చెట్ల నడుమ పెద్దకొండను తొలిచి గుహగా మలిచారు. ఈ గుహలో ఏకశిల శివలింగం, పక్కనే మరో మూడు గుహలు ఉన్నాయి. విష్ణుకుండినుల కాలానికి చెందిన ఈ గుహల్లో అజంతా చిత్రాలు కన్నార్పనీయవు. అడవి సోమనపల్లి గుహాలయాలు అని పిలిచే ఈ గుహలు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులో ఈ గుహాలయాలు ఉన్నాయి.


devudi-gutta

దేవుడిగుట్ట

భారతదేశ శిల్పచరిత్రలోనే విశిష్టమైన శిల్పకళ దేవుడి గుట్ట సొంతం. భూపాలపల్లి జిల్లాలోని ములుగు మండలం కొత్తూరు గ్రామ అడవుల్లో ఈ దేవుడిగుట్ట ఉంది. వివిధ శిలలను కలిపి ఒకే శిలగా నిర్మించిన అంగ్‌కోర్ వాట్ దేవాలయం కంటే ముందే ఈ దేవుడి గుట్ట నిర్మాణం జరిగింది. దీన్ని బట్టి తెలంగాణ శిల్పకళలో ప్రపంచ దేశాల కంటే ముందున్నదన్న విషయం తెలుస్తుంది.


the-untold

హైలెట్

ఈ ఛాయాచిత్ర ప్రదర్శనను మాజీ డీజీపీ పేర్వారం రాములు ప్రారంభించారు. వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, నమస్తే తెలంగాణ సీజీఎం సీహెచ్ శ్రీనివాస్, ప్రముఖ చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2న ప్రారంభమైన ఈ ప్రదర్శన 6వ తేదీ వరకు కొనసాగుతుంది.
-ప్రవీణ్‌కుమార్ సుంకరి

aravind

ఇంకా వెలుగులోకి రావాలి..

తెలంగాణలో అనేక చారిత్రక కట్టడాలు మరుగున పడి ఉన్నాయి. అవన్నీ వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. వాటి చారిత్రక నేపధ్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న సంకల్పంతో తెలంగాణ చారిత్రక ప్రాంతాలు తిరుగుతున్నాను. నాకు తెలిసిన మార్గాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. ఇందుకు శ్రీరామోజు హరగోపాల్ సార్ ఇచ్చే సహకారం మరులేనిది. తెలంగాణ వైభవాన్ని చాటే ఈ ఎగ్జిబిషన్‌కి అవకాశమిచ్చి, ప్రోత్సహించిన మామిడి హరికృష్ణ సార్‌కి ధన్యవాదాలు.
అరవింద్ ఆర్య పకిడె, యువ చరిత్రకారుడు

3055
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles