ఎల్లలు దాటిన పేదింటి ప్రతిభ


Wed,May 8, 2019 12:57 AM

Mamatha
ఆకుల మమత.. నిన్న మొన్నటి వరకూ ఆమె నిర్మల్ జిల్లాలో ఒక సాధారణ విద్యార్థి. చదువుతున్నది గిరిజనఆశ్రమ కళాశాలలో. విశేషమైన ప్రతిభతో ఇంటర్‌నేషనల్ స్టడీ టూర్‌కు ఎంపికైన గిరిజన విద్యార్థి. చైనా ఇంటర్న్‌షిప్‌లో పాల్గొననున్న చదువుల తల్లి.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన ఆకుల పోశన్న, గంగవ్వ కూతురు మమత. ఊట్నూర్ ప్రాంతంలోని గిరిజన మహిళా ఆశ్రమ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీఎస్ చదువుతున్నది. మమత తండ్రి రోజూవారీ కూలి. తల్లి సూదులు, పిన్నీసులు, గాజులు అమ్ముతుంది. పేద కుటుంబమే అయినా బిడ్డలను ఉన్నతంగా చదవించాలనుకున్నారు తల్లిదండ్రులు. మమతను, చిన్న కొడుకు రమేశ్‌ను అలాగే చదవించారు. రమేశ్ ప్రస్తుతం పాలిటెక్నిక్ చేస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టానికి ఫలితంగా మమత చదువులో ముందుంటున్నది. బాల్యం నుంచి డిగ్రీ వరకు ఆమె ప్రతీ తరగతిలోనూ ఫస్ట్ క్లాస్ మార్కులే సాధిస్తూ వచ్చింది. ప్రాథమిక స్థాయి వరకు ఖానాపూర్‌లోని ఆదర్శ విద్యాలయంలో చదివింది. కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్ చేసింది. పదవతరగతిలో 9.8 జీపీఏ, సీబీఎస్ సెలబస్ ఇంటర్‌లో 459 మార్కులు సాధించి ప్రతిభ చూపింది. దీంతో ఉట్నూర్ ఏజెన్సీలోని లాల్‌టేకిడి గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో సీటు వచ్చింది. అక్కడ బీఎస్సీలో చేరి మొదటి సెమిస్టర్‌లో 9.7 శాతం మార్కులు తెచ్చుకుంది.
Mamatha1
కళాశాల తరఫున, గతంలో చదివిన నవోదయ తరఫున కేరళ, కర్నాటక, సిక్కిం, మధ్యప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ర్టాల్లో ప్రతిభా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. కాగా ఇటీవల అంతర్జాతీయ స్టడీ టూర్‌కోసం నిర్వహించిన పరీక్షలో మమత ప్రతిభ కనబరిచింది. దీంతో చైనా ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైంది. జూలై నెల మొదటి వారంలో ఈ టూర్ ఉంటుంది. చైనాలో భౌగోళిక పరిస్థితులు, పర్యావరణం, అభివృద్ధి అంశాలు, ఆర్థిక విధానాలు తదితర అంశాలపై స్టడీ టూర్‌లో తాము అధ్యయనం చేస్తామని మమత వివరించింది. పేదింట పుట్టి ఇంతటి ప్రతిభ చూపుతున్న మమత భవిష్యత్‌లోఉన్నత లక్ష్యాలను పెట్టుకుంది. ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నదే తన ప్రధాన లక్ష్యమని, అందుకోసం శ్రమిస్తున్నానని తెలిపింది. ఐపీఎస్‌కు కావలసిన అర్హత కోసం ఆటలు, జనరల్ నాలెడ్జి, సామాజిక అంశాలపై దృష్టిపెట్టిన్నట్టు చెప్తున్నది. ప్రిన్సిపాల్ టేమాజీ డోంగ్రే అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపింది. అక్కలకు పెండ్లిళ్లు అవడంతో వారు చదువలేకపోయారని, తాను కష్టపడి ఐపీఎస్ అవుతానని అంటున్నది.

- కారింగుల రామ్‌కిషన్, ఖానాపూర్ రిపోర్టర్


839
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles