ఎన్ని వాడినా ఎందుకిలా..?


Wed,March 13, 2019 01:16 AM

నా వయస్సు 35 యేండ్లు. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. మద్యం అలవాటు లేదు. కానీ రోజు ఏడెనిమిది సిగరెట్లు మాత్రం కాలుస్తుంటాను. గడిచిన యేడాది కాలంగా కాళ్ళపైన పుండ్లు వస్తున్నాయి. ఎన్ని ఆయింట్‌మెంట్లు వాడినా తగ్గకపోవడంతో డాక్టర్‌ని కలిస్తే వేరికోస్ వెయిన్స్ వ్యాధి ఉందని చెప్పి చికిత్స అందిస్తున్నారు. సర్జరీ చేయాల్సి వస్తుందని కూడా చెప్పారు. పరిశుభ్రతకు ప్రాణం ఇచ్చే నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఇది ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుందా? అసలు వేరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? ట్రీట్‌మెంట్‌తో ఇది పూర్తిగా తగ్గిపోతుందా? దయచేసి తెలుపండి.
- వి. రామారావు, వరంగల్
counciling
వేరికోస్ వెయిన్స్ అనేది అంటువ్యాధి ఎంతమాత్రం కాదు. ఎప్పటికీ మానని అల్సర్లు వచ్చే ఈ వ్యాధి సాధారణంగా నిల్చొని పనిచేసే వృత్తిలో ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే సెక్యూరిటీ సంస్థల్లో పనిచేసేవారు హమషలు, పాఠశాలల్లోని ఉపాధ్యాయులు వంటి వారిలో ఎక్కువగా వేరికోస్ వెయిన్స్ ఏర్పడుతాయి. ఎక్కువసార్లు గర్భం ధరించినవారు, అదుపులేని షుగర్, అధిక బీపీ వ్యాధిగ్రస్తులు, అతిగా మద్యం తాగేవారు, పొగ తాగేవారు ఈ వ్యాధికి గురవుతుంటారు. యుక్తవయసు మొదలుకొని ఎనభై యేండ్ల వృద్ధుల వరకు అన్ని వయసుల వారూ దీని బారిన పడుతున్నారు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో దాదపు 15 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో సరైన చికిత్స అందక చాలామంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. వేరికోస్ వెయిన్స్ సమస్య మొదట కాళ్లు, చేతులపై సాధారణ పుండ్లు ఏర్పడడంతో మొదలవుతుంది. ఒకట్రెండు వారాలు గడిచేసరికి తీవ్రమైన నొప్పి ప్రారంభమై క్రమంగా పెరుగుతుంది. పుండ్లు మానడానికి మందులు వాడినా ప్రయోజనం కనిపించదు. ఈ విధంగా కొన్ని నెలలు గడిచేసరికి పుండ్లు పెద్దవై చీము, రక్తం స్రవించడంతో పాటు దుర్వాసన వస్తుంది. ఇవి ప్రధానంగా రక్తప్రసరణలోని లోపాల వల్ల వచ్చిన సమస్య. గుండె పంప్ చేసిన శుభ్రమైన (ఆక్సిజన్ కలిగిన) రక్తాన్ని ధమనులు శరీరంలోని అన్ని భాగాలకు తీసుకుపోతాయి. అదేవిధంగా శరీర భాగాల కార్బన్ డై ఆక్సైడ్ కలిగిన రక్తాన్ని సిరలు గుండెకు తీసుకెళ్తుంటాయి. కొందరిలో ఈ సిరలు బలహీనపడడం వలనో, వీటిలో అడ్డంకులు ఏర్పడడం వలనో వాటి రక్తప్రసరణ సామర్థ్యం తగ్గిపోతుంది. కాళ్ళు, చేతులలో సిరలు ఇలా రక్తాన్ని సక్రమంగా ప్రసరించలేనప్పుడు భూమి ఆకర్షణకు వ్యతిరేక దిశలో పైకి వెళ్లాల్సిన రక్తం.. అలా వెళ్లేందుకు బదులు వెనకకు వస్తుంటుంది. ఇది వేరికోస్ వెయిన్స్ వ్యాధికి కారణమవుతుంది.
వేరికోస్ వెయిన్స్ వ్యాధికి సంబంధించి నాలుగు దశలు ఉంటాయి. మెదటి దశలో కాళ్ళలో వాపులు. రెండో దశలో రాత్రుళ్లు కాలి పిక్కలు, కండరాలు పట్టేస్తుంటాయి. మూడో దశలో కాళ్ళచర్మం రంగు మారుతుంది. నాలుగో దశలో కాళ్లలో దురదలు రావడం, పుండ్లు ఏర్పడడం రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డాక్టర్ సూచనలు యథాతథంగా పాటిస్తూ జీవనశైలిని మార్చుకోవడం అన్న అంశానికి ఏ దశలో చికిత్స సమయంలోనైన అధిక ప్రాధాన్యం ఉంటుంది. చాలా సందర్భాల్లో కొంత ఉపశమనం కనిపించగానే మందులు మానేయడం, కోర్సు పూర్తి అయిన తర్వాత ఇక మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా ఉండడం వల్ల వ్యాధి ముదిరిపోయిన కేసులు ఉన్నాయి. ఇలా చేయడం ప్రమాదకరం ఈ వ్యాధి వచ్చిన వారు తప్పని సరిగా సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు డాక్టర్‌ను క్రమం తప్పకుండా సంప్రదిస్తూ వారు సూచించిన చికిత్స ప్రక్రియలను, జాగ్రత్తలను తప్పక పాటించాలి.
-డాక్టర్ దేవేందర్ సింగ్
సీనియర్ వాస్క్యులాండ్ అండ్ ఎండో వాస్క్యులార్ సర్జన్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ హైదరాబాద్.

939
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles