ఎన్ని గంటలు నిద్రపోవాలి?


Fri,March 1, 2019 01:42 AM

మా అమ్మాయి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నది. క్లెవర్ స్టూడెంట్ అయినా ఫస్ట్ ఇయర్ మార్క్స్ తక్కువగా వచ్చాయి. బాగా చదువుతుంది. రాత్రి రెండింటి వరకు కూడా చదువుతూనే ఉంటుం ది. అయినా ఇప్పుడు కూడా మార్కులు తక్కువగా వస్తాయేమో అని ఆందోళన చెందుతుంది. ఈ ఆందోళన పోయేదెలా ? మా అమ్మాయి మంచి ఫలితాలు సాధించేది ఎలా ? ఎన్ని గంటలు నిద్ర పోవాలి? దయచేసి తెలుపగలరు.
- నిర్మల, వికారాబాద్

sleeping
మీరు ముందు మీ అమ్మాయి గురించి ఆందోళన చెందడం మానండి. మీ ఆందోళనతో మీ అమ్మాయి ఒత్తిడికి గురై ప్లాన్ లేకుండా ప్రిపేర్ అవుతున్నది. పరీక్షల సమయంలో పిల్లలకు కావాల్సింది నిద్ర.. ఆహారం. కానీ మీ అమ్మాయిలానే చాలామంది విద్యార్థులు ఒత్తిడికి లోనై ఆహారం, నిద్ర విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. సరైన ఆహారం తీసుకోకపోతే పరీక్షల సమయంలో నీరసం ఏర్పడుతుంది. శారీరక శక్తి తక్కువవుతుంది. నిద్రకు ఖచ్చితంగా 6 గంటల పాటు సమయాన్ని కేటాయించాలి. సరైన నిద్ర పోయినప్పుడే బ్రెయిన్ ఆక్టివ్‌గా పని చేయడానికి అవకాశం ఉంటుంది.తల్లిదండ్రులు సహాయకారిగా ఉండాలి కానీ వాళ్లపై ఒత్తిడి పెంచేలా ఉండకూడదు. పిల్లలు చదవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నప్పుడు, ఇతర పనులలో వారికి సహాయకారిగా ఉండాలి. పిల్లలు చదువుకునే టప్పుడు ఇతర పనుల పట్ల వారి ఆలోచనలు మరలకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప.. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేపి చదువుకో అనొద్దు. ఎంత చదివామన్నది కాదు.. ఎంతమేరకు అర్థం చేసుకుని చదివామన్నది ముఖ్యం అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.

పుస్తకాలు ముందేసుకుని బట్టికొట్టి చదివేదానికన్నా చదివేది ఎంతైనా సరే అర్థంచేసుకుని చదవడం వల్లనే బాగా గుర్తు ఉంటుంది. చదివింది పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుందని గుర్తించాలి. చదివేటప్పుడు చదువుతున్న విషయాన్ని ఒక్కొక్క దానికి కనెక్టు చేసుకుంటూ మనసులో ఆ విషయాలను ముద్రించుకోవాలి. ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ వస్తుందో ఇంటర్ లింక్ ఏర్పాటు చేసుకుంటూ చదివితే బాగా గుర్తు ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక.. ఆల్రెడీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు ఆదరాబాదరాగా చదవడం మంచిది కాదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇప్పటి దాకా చదివింది ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి తప్ప మళ్లీ కొత్తగా చదివి ఉన్న జ్ఞానాన్ని పాడుచేసుకోవద్దు. మొదటి సంవత్సరంలో మార్కులు తక్కువగా వచ్చాయి కదా అని రెండో సంవత్సరంలో కూడా తక్కువే వస్తాయి అనుకోవడం పొరపాటు. ఇది విషయ సంగ్రహణను బట్టి ఉంటుంది తప్ప అర్ధరాత్రి దాకా చదివింది అనేది ప్రామాణికం కాదు. మీ అమ్మాయిని హాయిగా నిద్ర పోనివ్వండి.. మంచి ఫలితాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్.

డాక్టర్
అట్ల శ్రీనివాస్ రెడ్డి
ఫ్యామిలీ కౌన్సెలర్

534
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles