ఎండాకాలాన్ని.. దహించేయండి


Thu,February 21, 2019 12:34 AM

milk-shrikand
భానుడి భగభగలు దహించేస్తున్నాయి.. ఆరోగ్యాన్ని హడలెత్తిస్తున్నాయి.. పెరుగుట ఎండ విరుగుట కొరకే, అంటున్నారు ఆరోగ్య, పాకశాస్త్ర నిపుణులు. అందుకే కమ్మటి పెరుగుతో కడీ, దద్జోజనం, వడలు, లస్సీలే కాదు,తియ్యటి శ్రీఖండ్‌లను కూడా తీసుకొచ్చేశాం. ఈ వంటకాలతో ఎండకి ఇప్పటినుంచే చెక్ పెట్టేయండి.

పెరుగు వడ

perugu-vada

కావాల్సినవి :

మినపపప్పు : 200 గ్రా., ఉల్లిగడ్డ : 1, పచ్చిమిరపకాయలు : 2, జీలకర్ర : ఒక టీస్పూన్, పెరుగు : 250 మి.లీ., ఆవాలు : అర టీస్పూన్, కరివేపాకు : 2 రెమ్మలు,
ఎండుమిర్చి : 5, క్యారెట్ తురుము : గార్నిష్ కొరకు, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

మినపపప్పును మూడు గంటలు నానబెట్టాలి. దీన్ని నీరు తక్కువగా పోసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి కాసేపు పక్కన పెట్టాలి. కడాయిలో నూనె ఎక్కువగా పోసి వేడి చేయాలి. ఇప్పుడు మినపపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసి నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. ఆ తర్వాత పెరుగును ఒక గిన్నెలో వేసి గిలక్కొట్టి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ వడలను అందులో వేసి ఉంచాలి. మరో కడాయిలో నూనె తక్కువగా పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీన్ని పెరుగు మిశ్రమంలో పోయాలి. కాసేపు వడలను ఆ పెరుగులో నాననిచ్చి ఆ తర్వాత తింటే యమ టేస్టీగా ఉంటాయి.

వెజిటెబుల్ కడీ

sabzi-kadi

కావాల్సినవి :

పెరుగు : ఒక కప్పు, ఉల్లిగడ్డ : 1, పచ్చిమిరపకాయలు : 2, కరివేపాకు : రెండు రెమ్మలు, క్యారెట్ ముక్కలు : ఒక కప్పు, బీన్స్ : ఒక కప్పు, కాలీఫ్లవర్ ముక్కలు : ఒక కప్పు, పసుపు : పావు టీస్పూన్, శనగపిండి : ఒక టేబుల్‌స్పూన్, జీలకర్ర పొడి : పావు టీస్పూన్, ధనియాల పొడి : పావు టీస్పూన్, నూనె : 2 టీస్పూన్స్, ఆవాలు,
జీలకర్ర : పావు టీస్పూన్,
ఎండుమిర్చి : 2, ఉప్పు : తగినంత

తయారీ :

పెరుగులో శనగపిండి వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారాక క్యారెట్ ముక్కలు, బీన్స్, కాలీఫ్లవర్ వేసి రెండు నిమిషాలు కలిపి మగ్గనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి సన్నని మంట మీద ఒక నిమిషం ఉంచాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కూరగాయ ముక్కలు బాగా ఉడుకనివ్వాలి. నీళ్లు కాస్త దగ్గర పడ్డాక.. శనగపిండి కలిపిన పెరుగు మిశ్రమాన్ని పోసి చిక్కబడేంత వరకు సన్నని మంట మీద అలాగే ఉంచాలి. ఈలోపు చిన్న కడాయిలో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీన్ని ఉడుకుతున్న పెరుగు మిశ్రమంలో పోసి దించేయాలి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.

మ్యాంగో శ్రీఖండ్

mango-shrikand

కావాల్సినవి :

గట్టి పెరుగు : 200 మి.లీ., మామిడి పండు గుజ్జు : ఒక కప్పు, చక్కెర : తగినంత, డ్రైఫ్రూట్స్ : తగినన్ని, నెయ్యి : ఒక టీస్పూన్

తయారీ :

పెరుగును ఒక గుడ్డలో వేసి నీళ్లు పోయేంత వరకు వడకట్టి పెట్టుకోవాలి. దీంట్లో చక్కెర, మామిడి పండు గుజ్జు వేసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌ని దోరగా వేయించాలి. వీటిని పెరుగు మిశ్రమంలో వేసి కలిపి గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లచల్లగా తింటుంటే ఆ టేస్టే వేరు!

దద్దోజనం

daddojanam

కావాల్సినవి :

పెరుగు : ఒక కప్పు, అన్నం : ఒక కప్పు, ఆవాలు : పావు టీస్పూన్, జీలకర్ర : పావు టీస్పూన్, పచ్చిమిర్చి : 2,
ఎండుమిర్చి : 2, కరివేపాకు : ఒక రెమ్మ, పసుపు : చిటికెడు, ఇంగువ : పావు టీస్పూన్, అల్లం : చిన్న ముక్క,
మిరియాలు : అర టీస్పూన్,
ఉల్లిగడ్డ : 1, నూనె : ఒక టీస్పూన్, ఉప్పు : తగినంత

తయారీ :

మిరియాలను దంచి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అన్నం మరీ మెత్తగా కాకుండా వండి చల్లారబెట్టాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగు, అల్లం ముక్కలు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో పెరుగు పోసి కలిపి అన్నిటినీ అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. టేస్టీ దద్దోజనం రెడీ!

స్వీట్ లస్సీ

Shrikand

కావాల్సినవి :

పెరుగు : 200 మి.లీ., చక్కెర : 2 టేబుల్‌స్పూన్స్, యాలకుల పొడి : చిటికెడు, బాదం, పిస్తా : గార్నిష్ కొరకు

తయారీ :

పెరుగును గిలక్కొట్టి పెట్టుకోవాలి. చక్కెర, యాలకుల పొడి వేసి కలుపాలి. దీంట్లో బాదం, పిస్తాలు వేసి గార్నిష్ చేయాలి. దీన్ని అలాగే తాగేయొచ్చు. లేదా కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తాగితే చాలా బాగుంటుంది.

జి.యాదగిరి
కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
పార్క్‌లైన్, సికింద్రాబాద్

968
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles