ఎంఐజీ పొడిగింపు ఎవరికి ఉపయోగం?


Sat,January 19, 2019 01:23 AM

pmay
ఎంఐజీ గృహాల వడ్డీ రాయితీ పథకం.. 2020 మార్చి వరకు పొడిగింపు తెలంగాణ రాష్ట్రంలో సొంతిల్లు కొనుక్కునేవారికి శుభవార్త. సీఎల్‌ఎస్‌ఎస్ (క్రెడిట్ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్) కింద సొంతిల్లు కట్టుకునేవారికి కేంద్రమిచ్చే రూ.2.67 లక్షల రాయితీనిచ్చే పథకాన్ని 2020 మార్చి వరకూ పొడిగించింది. వాస్తవానికి, ఈ పథకం చివరి తేది 2019 మార్చి 31తో ముగుస్తుంది. దీనికి లభిస్తున్న విశేష ఆదరణ నేపథ్యంలో.. ఈ పథకాన్ని మరో ఏడాది దాకా పొడిగించాలని కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాల్ని జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఇల్లు కొనుక్కునేవారికెంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాకపోతే, ఈ పథకం కింద హైదరాబాద్లో ఎంతమంది ఇల్లు కొనుక్కునే అవకాశముంది?

రూ.30 లక్షల్లోపు ఇండ్లు ఎక్కడ?

మనదేశంలో ఏడాదికి రూ.6 నుంచి రూ.18 లక్షల జీతాన్ని ఆర్జించేవారు.. సీఎల్‌ఎస్‌ఎస్ కింద రుణం తీసుకోవడానికి అర్హులు. ఈ పథకాన్ని రెండు రకాలుగా విభజించారు. ఎంఐజీ-1 కింద, ఏడాదికి రూ.6-12 లక్షల వేతనాన్ని ఆర్జించేవారు మొదటి విభాగంలోకి వస్తారు. వీరు ఇరవై ఏండ్ల వ్యవధికి గృహరుణం సాయంతో ఇల్లు కొనుక్కుంటే.. దాదాపు నాలుగు శాతం మేరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. అంటే, నెలకు రూ.75,000 ఆర్జించేవారు.. కనీసం రూ.30 లక్షల్లోపు ఇంటిని కొనుగోలు చేయగలరన్నమాట. మరి, భాగ్యనగరంలో రూ.30 లక్షల్లోపు గల ఫ్లాట్లను కట్టే డెవలపర్లు ఎంతమంది? ఒకవేళ, ఎవరైనా బిల్డర్లు అందుబాటు ధరలో ఫ్లాట్లను నిర్మించినా.. వాటి కోసం శివారు ప్రాంతాల వరకూ వెళ్లక తప్పదు.

రూ.50 లక్షల్లో దొరికేనా?

ఎంఐజీ-2లో భాగంగా.. రూ.12-18 లక్షల వార్షిక వేతనం సంపాదించేవారు మూడు శాతం వడ్డీ రాయితీని అందుకోవచ్చు. నెలకు లక్షా ఇరవై ఐదు వేల రూపాయల వేతనాన్ని సంపాదించేవారు. దాదాపు రూ.50 లక్షల విలువ గల ఇంటిని కొనుగోలు చేయడానికి ముందుకొస్తారు. కాకపోతే, మన హైదరాబాద్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో రెండు పడక గదుల ఫ్లాట్ కోసం ఎంతలేదన్నా రూ.70 నుంచి 80 లక్షలు పెట్టక తప్పదు. అదే, మూడు పడక గదుల ఫ్లాట్ కోసం సుమారు కోటి రూపాయలకు పైగా పెట్టాల్సిందే. ఈ స్థాయిలో సొమ్ము పెడితేనే.. ఇలాంటి ప్రాంతాల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోగలరన్నమాట. అంతెందుకు, మియాపూర్ వంటి ప్రాంతాల్లోనూ చదరపు అడుక్కీ రూ.4,000 నుంచి రూ.5,000 చెప్పే డెవలపర్లు లేకపోలేరు. అందుకే, ఈ స్కీమ్ వల్ల ఉపయోగం లేదని కొనుగోలుదారులు అంటున్నారు.

ఎంత విస్తీర్ణంలో కొనవచ్చు?

సీఎల్‌ఎస్‌ఎస్ స్కీములో భాగంగా అర్హులైన రుణగ్రహీతలకు.. దాదాపు 1,500 నుంచి 2,100 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్లను కొనడానికి అర్హత లభిస్తుంది. కాకపోతే, ఈ విస్తీర్ణంలో ఫ్లాట్లు కొనడానికి శివారు ప్రాంతాలకు వెళ్లినా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేని దుస్థితి.

641
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles