ఊరు ఉమ్మెడ.. పేరు ముత్యం


Thu,January 31, 2019 12:41 AM

VISHESHA
ఎప్పుడైనా గమనించారా?
ఎప్పుడైనా ఊహించారా?
పర్లేదు ఎప్పుడైనా విన్నారా?
సరే చదివారా?
సమాధానం అన్నింటికీ లేదు అనే వస్తుంది. కారణం. నిజానికి ఇలాంటి నేపథ్యం ఉన్న ఊర్లు తెలంగాణలో బాగానే ఉన్నాయి. కానీ ఇలాంటి పేర్లున్న ఊరు మాత్రం చాలా అరుదు. ఒకే అక్షరంతో పేర్లు పెట్టుకుంటున్న ఓ ఊరి కథ ఇది.

ఆ ఊర్లో అడుగుపెడితే చాలు.. మ అక్షరంతో మొదలయ్యే పేర్లే వినిపిస్తాయి. ముత్యం, ముత్తెన్న, ముత్యాలు, మహేశ్, మనోజ్, మోహన్..ఇలా ఈ పేర్లు ఉన్న మనుషులు ఎక్కువగా కనిపిస్తారు.ఎందుకని ఆరా తీస్తే.. ఆ ఊరి ముత్యాలమ్మ గుడి మహిమ అని తెలిసివచ్చింది. ముత్యాలమ్మ అమ్మవారి పేరు పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని వారి నమ్మకం. ప్రగాఢ విశ్వాసం. ఎన్నో ఏండ్లుగా ఈ ఊర్లో ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తున్నది. ఇప్పటి తరం కూడా ఈ ఆచార సంప్రదాయాల్ని పాటిస్తూ ఉన్నది. ఆ ఊరు పేరు ఉమ్మెడ. చిన్న ఊరే. నివాసం ఉంటున్న కుటుంబాల్లో దాదాపుగా ప్రతీ ఒక్కరూ మతో మొదలయ్యే పేరు పెట్టుకొని ఉన్నవారే ఉంటారు. భోజన్న, భోజవ్వ అనే పేరు కూడా ఉంది. ఇదీ ముత్యాలమ్మకు ప్రతిరూపమైన పేరుగానే భావిస్తారు.

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని ఓ మారుమూల పల్లెటూరు ఉమ్మెడ. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ముత్యాలమ్మ అమ్మవారంటే అందరికీ ప్రత్యేక నమ్మకం. భక్తి. విశ్వాసం. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఊరు పక్కనే ఉన్న మత్యాలమ్మ గుడి దగ్గరకి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందే. సంతానం కలిగితే అమ్మ దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఐదుగురు ముత్తైదువలకు పెట్టిన తర్వాతే ఏ దావతైనా.. ప్రతీ ఆదివారం ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి వద్ద కందూరు చేసుకొని పోతారు. మేకపిల్లను కోసుకొని మొక్కు తీర్చుకుంటారు. ఆమె మహిమ వల్లే తాము అనుకున్నది నెరవేరిందని మళ్లీ కొత్త మొక్కులు మొక్కుకుని పోతారు. కొత్తగా ఈ గుడికి వచ్చినవారు ఒక కొబ్బరి కాయ కొట్టి తమ కోరికను కోరితే.. అది నెరవేరడం ఖాయమంటున్నారీ గ్రామస్తులు. కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్లీ ఓ కొబ్బరి కాయ కొట్టి పోతే చాలంటున్నారు. అందుకే ఆమె పేరులోని ముందు అక్షరం వచ్చేలా పేర్లు పెట్టుకుంటున్నామని తెలిపారు. ఆ ఊర్లోనే అన్ని కులాలకు చెందిన వారికీ అమ్మవారి మహిమపట్ల విశ్వాసం.

ముస్లీంలు సైతం అమ్మవారికి వెండి కండ్లు చేపిస్తామని,బొట్టు పెడతామని మొక్కులు మొక్కుకుంటారు. వారు నేరుగా గుడికి వెళ్లకున్నా.. వేరొకళ్లతో ఈ మొక్కులు చెల్లించుకొని సంతృప్తి పడతారు. పర్వీనా అనే ముస్లిం మహిళ తన అనుభవాన్ని చెప్పుకున్నారు. తన కొడుకుకు ఆరోగ్యం బాగలేకపోతే ముత్యాలమ్మ మొక్కుకున్నదట, వెండి కండ్లు చేయించి ఇస్తానని. మొక్కుకున్న మరునాడే తన కొడుకు ఆరోగ్యం బాగుపడిందని, లేదంటే తన కొడుకు తనకు దక్కేవాడు కాదని ఆమె అమ్మవారి మహిమ గురించి చెప్పుకొచ్చింది. ముత్యాలమ్మ గుడికి కుడి పక్కన మహాలక్ష్మమ్మ గుడి ఉంటుంది. ఈ గుడి తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. పూజరులుగా పిలువబడే వడ్రంగివాళ్లు ఏడాదికొకసారి తెరిచి పూజలు చేసి మళ్లీ తలుపులు మూస్తారు. అమ్మవారి ప్రతిరూపాలుగా పిలవబడే మహాలక్ష్మీ, ముత్తెవ్వ, సందె మహంకాళి, ఎరుకల నాంచారి, బద్ది పోశవ్వ, నల్ల పోశవ్వ, చిల్కల చిన్మమ్మ, నాగవ్వ, ఆరెళ్లి మైసవ్వ.. ఇలా విగ్రహప్రతిరూపాలు ఆ గుడిలో కొలువై ఉన్నాయి.
VISHESHA1

చిన్న పిల్లలకు మొదట ముత్తెన్న పేరు..

ఆనాటి నుంచి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ ఈ గ్రామ ప్రజలు పాటిస్తున్నారు. పుట్టిన సంతానం మగబిడ్డ అయితే ముత్తన్న, ఆడబిడ్డ అయితే ముత్తెమ్మ అని మొదట నామకరణం చేసిన తర్వాతనే మరో పెట్టుకుంటారు. స్కూల్ రికార్డుల్లో వేరే పేరు నమోదు చేసినప్పటికీ.. ఇంట్లో పేరు మాత్రం ముత్తెన్న, ముత్తెవ్వ అనే పిలుచుకుంటారట. ఆ పేరు పెట్టుకుంటే అన్నీ అమ్మదయతో మంచి జరుగుతాయని, ఆరోగ్యం, సంపద చేకూరుతాయని విశ్వసిస్తారు. ఆ గుడి పక్క నుంచే గ్రామస్తులంతా ఉదయం తమ పంటపొలాలకు వెళ్తారు. ఈ ముత్యాలమ్మ గుడి వద్ద పొద్దున్నే ఓ దండం పెట్టి మరీ తమ దైనందిన కార్యక్రమాలు షురూ చేసే ఆనవాయితీ ఇక్కడ ఉంది.

గోదావరి ఒడ్డున గంగపేరు

జిల్లాలో గోదావరి నదీ ప్రవాహానికి పక్కనే ఉండే గ్రామాలలో గంగ అర్థం వచ్చే పేర్లను పెట్టుకోవడం కూడా ఈ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తది. రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి, హరిదా, మంజీరా నదుల కలియికను త్రివేణీ సంగమంగా చెప్పుకుంటారు. ఇక్కడ నుంచి మొదలుకొని మెండోరా మండలం వరకు గోదావరి పారుతూ వస్తున్న ప్రాంతాల్లో గంగ అర్థం వచ్చే పేర్లు ఎక్కువగా పెట్టుకుంటారు. ఇక్కడ గంగ అంటే గోదారమ్మ. గంగాధర్, గంగారెడ్డి, గంగారం, గంగవ్వ.. ఇలాంటి పేర్లు జిల్లాలో అధికంగా కనిపిస్తాయి. జిల్లాలో ఇపుడున్న ప్రధాన పార్టీల అధ్యక్షులు కూడా ఈ పేర్లతోనే ఉండటం విశేషం. కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు గడుగు గంగాధర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డిలు ఉన్నారు.

- దండుగుల శ్రీనివాస్
నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

877
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles