ఈ వయసులో పక్షవాతమా?


Fri,July 14, 2017 01:05 AM

నా వయసు 20 సంవత్సరాలు. 7 సంవత్సరాలుగా నేను సైనస్‌తో బాధపడుతున్నాను. ఈత నాకు చాలా ఇష్టమైన వర్కవుట్. దాదాపు ప్రతి రోజు ఈతకు వెళ్తుంటాను. ఇటీవల ఒకరోజు ఎప్పటిలాగే ఈతకు వెళ్లి వస్తుంటే ఎడమకాలు, చెయ్యి కదిలించడం కష్టంగా అనిపించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన సలహా మేరకు ఎంఆర్‌ఐ పరీక్ష చేయిస్తే మెదడులో చిన్న క్లాట్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆకస్మాత్తుగా ఇలా జరుగడంతో మా తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎందుకు జరిగింది? దీని వల్ల ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చు? పరిష్కార మార్గాలు ఏమిటి? దయచేసి నా సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించగలరు.
ప్రవీణ్, సూర్యపేట

Bellspalsy
మీరు సరైన సమయంలో డాక్టర్‌కు చూపించుకుని, సమస్యకు కారణాన్ని తెలుసుకున్నందుకు మీకు అభినందనలు. అయితే దీర్ఘకాలికంగా మీకున్న సైనస్ సమస్యకు మీకు ప్రస్తుతం ఏర్పడిన సమస్యకు ఎలాంటి సంబంధం ఉండే ఆస్కారం లేదు. తలకు దెబ్బతగులడం, బీపీ పెరుగడం, కొంత మందిలో వంశపారంపర్యంగా బలహీనమైన రక్తనాళాలుండడం వంటి కారణాలతో ఈ సమస్య రావచ్చు. మీ సమస్యలో మీకు ఎడమ చెయ్యి కాలు కదుపడానికి కష్టం అయ్యింది కానీ కదుపగలుగుతున్నారు అంటే మీ మెదడులో పెద్ద దమనుల్లో కాకుండా చిన్న కేశనాళికల్లో క్లాట్ ఏర్పడి ఉండవచ్చు.

మెదడులోని రక్తనాళాల్లోనే క్లాట్ ఏర్పడవచ్చు లేదా శరీరంలోని ఇతర భాగాల్లో ఏర్పడిన క్లాట్ రక్తప్రసరణ ద్వారా మెదడులోకి చేరి అక్కడున్న చిన్న రక్తనాళాల్లో చిక్కుకుపోవచ్చు. ఇలా జరుగడాన్ని సెరిబ్రోవాస్కులార్ ఆక్సిడెంట్ అంటారు. క్లాట్ ఎలా ఏర్పడినా పరిణామాలు ఒకే విధంగా ఉంటాయి. మెదడులో క్లాట్ ఏర్పడిన భాగాన్ని బట్టి శరీరంలోని వివిధ అవయవాల మీద దాని ప్రభావం ఉంటుంది.

ఆకస్మాత్తుగా పక్షవాత లక్షణాలు కనిపిస్తాయి. మీ ఎడమ కాలు, చెయ్యి అదుపు తప్పింది అంటే మీ మెదడులోని కుడి భాగంలో క్లాట్ ఏర్పడి ఉంటుంది. మెదడులో క్లాట్స్‌కు ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మెదడులో ఉన్న క్లాట్ చాలా చిన్నదనే అనిపిస్తున్నది. మందులతో ఈ క్లాట్ కరిగిపోవచ్చు. చికిత్స తీసుకోవడంతో పాటు మీరు ఇలా జరుగడానికి కారణాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వంశపారంపర్య కారణాలు లేదా బీపీ వల్ల ఇలా జరిగి ఉంటే భవిష్యత్తులో మెదడులోని చిట్లిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్టే, కాబట్టి తరుచుగా డాక్టర్‌ను సంప్రదిస్తూ సరైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
drrajesh

334
Tags

More News

VIRAL NEWS