ఈశ్వర యోగం


Fri,March 1, 2019 01:04 AM

మహాశివరాత్రికి ఈశా ఫౌండేషన్ విలక్షణ కార్యక్రమాలు
లయకారుడైన శివుడు సృష్టికే ఆదియోగి. ఆయన నుంచే యోగశాస్త్రం ఆవిర్భవించింది. దేశంలోని ప్రముఖ యోగ, ధ్యాన కేంద్రమైన ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఎప్పటిలా ఈసారి కూడా అత్యంత వైభవంగా, విలక్షణంగా జరుగనున్నాయి. ప్రతీ సంవత్సరం ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా గల వివిధ శైవక్షేత్రాల్లో జరిగే ఆరాధనలకు భిన్నంగా కోయంబత్తూరు సమీపంలోని ఈశా ఆశ్రమంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తిని, యోగ ధ్యానాలతో మిళితం చేసే ఇక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేశ, విదేశీభక్తులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి.
isha-foundation
పాతికేళ్లుగా ఆధ్యాత్మిక పవనాలు: ఈశా ఫౌండేషన్ 1994 మార్చి నుంచి ప్రత్యేకంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. శూన్యంలో నుంచి పుట్టి శూన్యంలో విలీనమవ్వడమన్న ఆధ్యాత్మిక చింతనను ఇక్కడ ప్రధానంగా వివరించనున్నారు. ప్రతీది శివుడి నుంచి వచ్చి శివుడిలోకి వెళ్లిపోతుందన్నది వారి ప్రవచనాల సారం. పరమోన్నత గ్రాహ్యశీలతకు శివుడు ప్రతిరూపమని, జీవరాశిలో సమాంతరంగా ఉన్న వెన్నెముక నిటారుగా మారడం జీవపరిణామ క్రమంలో అతిముఖ్యమైన ప్రక్రియ అని, ఇలా జరిగినపుడే మనిషిలో అంతరజ్ఙానం వికసిస్తుందని ఈశా వ్యవస్థాపకులు చెబుతారు.


డ్రమ్ములతో ప్రత్యేక ప్రదర్శన: శివరాత్రి సందర్భంగా ఈ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. పండుగ నాడు శివుడి పేరుతో ఇక్కడ ధ్యానం చేయడం ద్వారా సంబంధికులకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉంది. ప్రఖ్యాత కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శనలు, అమిత్ త్రివేది, హరిహరన్, కార్తీక్ తదితర కళాకారులతో ప్రదర్శనలు జరగనున్నాయి. సౌండ్స్ ఆఫ్ ఈశాతోపాటు అజర్ బైజాన్ దేశం నుంచి కళాకారులు ప్రత్యేకంగా వస్తున్నారు. వీరు డ్రమ్ములతో ప్రదర్శన ఇవ్వనున్నారు.


వేలాదిమందితో మహా ధాన్యం: నడిరేయి ధ్యానం వంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకొంటాయి. బైరవి మహాయాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటుంది. లింగభైరవి దేవాలయం నుంచి ఆదియోగి వరకు ఇది కొనసాగనున్నది. ఈసారి కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి వస్తారని భావిస్తున్నారు. ఏకకాలంలో ధ్యానంలో ఉండేవారు కనీసం 50 వేల మందికి పైగానే ఉంటారు. ప్రత్యేకించి, శివరాత్రి పర్వదినాన ఇక్కడికి వచ్చేవారు లక్షల్లో ఉంటారని అంచనా. ఈ ఏడాదితో ఈశా సంస్థకు 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు రావచ్చు.


కులమతాలకు అతీతం ధ్యానలింగం: సర్వధర్మాలకు, కులమతాలకు అతీతంగా ఇక్కడ పరమేశ్వరుడిని కొలుస్తారు. ప్రతిరోజూ ఆధ్యాత్మికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మన దేశానికి చెందిన వారేకాక రష్యా, జర్మనీ, డెన్మార్క్, అమెరికా, స్పెయిన్, ఆస్ట్రేలియా వంటి విదేశీ ఆధ్యాత్మిక సాధకులు కూడా ఈ కేంద్రాన్ని సందర్శిస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఇక్కడ ఉన్నది. దీనిని ధ్యానలింగంగా కొలుస్తారు. చుట్టూ పచ్చని వేలంగిరి కొండల మధ్య ఆశ్రమంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ధ్యానలింగం అత్యంత ప్రత్యేకమైంది. ఇక్కడ పూర్తి నిశ్శబ్దం పాటిస్తారు. ఇక్కడ వందలాది మంది ప్రతిరోజూ ధ్యానం చేస్తుంటారు. ధ్యానానికి కావలసిన ప్రశాంతమైన పరిసరాలు ఇక్కడి ప్రత్యేకత. వేరే ఆరాధనలు, ప్రార్థనలు, పూజలంటూ ఏమీ ఉండవు. ఈ ధ్యానలింగం ఏ వర్గానికి, మతానికి చెందింది కాదని ఈశా వ్యవస్థాపకులు సద్గురు చెబుతుంటారు. దీని నిర్మాణమే ఒక అద్భుతం. ఎక్కడా పిల్లర్లు కనిపించవు. ఒక గుండ్రని ఆకృతితో ఉంటుంది.


భూగర్భంలో పాదరస లింగం: ధ్యానలింగ ఆలయానికి సమీపంలోనే భూమికి 30 అడుగుల దిగువన ప్రత్యేకంగా పాదరస లింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడే సూర్యకుండ్, చంద్రకుండ్ అని రెండు వేర్వేరు కొలనులున్నాయి. సాధారణంగా దేవాలయాల సమీపంలో ఉండే కోనేర్లు వంటివే ఇవి. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఉన్నాయి. సూర్యకుండ్ పురుషులకు, చంద్రకుండ్ మహిళలకు ఉద్దేశించినవి. సాధకులు ఇక్కడ స్నానం చేసి ధ్యానం చేసుకుంటారు. ఫలితంగా మనిషి గ్రాహకశక్తి పెరుగుతుందని ఆశ్రమ నిర్వాహకులు చెబుతుంటారు. ఆరోగ్య స్వస్థతకు ఇది ఉపయోగపడుతుందని ప్రతీతి.


ఓపికగా ధ్యాన, యోగ సాధనలు: ఈషా కేంద్రంలో ఎక్కడ చూసినా ధ్యానముద్రలో ఉన్నవారే కనిపిస్తారు. జ్ఙాన, కర్మ, క్రియ, భక్తి అనే నాలుగు విధాలైన యోగాలను ఇక్కడ నేర్పిస్తారు. అక్కడి ప్రతీ చెట్టు, పుట్టవద్ద కూడా ఏదో మహిమ ఉన్నట్టే సాధకులు నమ్ముతారు. వారి కోసమే ప్రత్యేకంగా అనేక హాళ్లు ఉన్నాయి. ప్రాథమిక దశ నుంచి అన్ని స్థాయిల్లో యోగాసనాలను నేర్పిస్తారు. అన్ని వయసుల వారు ఇక్కడ యోగ సాధన చేయడం విశేషం. యోగ గురించి వివరించే గురువులు కూడా ఎంతో ఓపికగా ప్రతీ ఆసనాన్ని ఒకటికి రెండుసార్లు చెప్పి సాధకులతో చేయిస్తుంటారు. ఒకేసారి వేలాది మంది యోగసాధనలో పాల్గొంటున్నా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సుమారు 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆదియోగి ఆలయం, 64 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో స్పందహాలు, తీర్థ కుండాలు, ఈశా రిజువనేషన్ సెంటర్ వంటివి ఇక్కడ వున్నాయి.


సర్వధర్మ స్థూపం: ధ్యానలింగ ఆలయ సమీపంలోనే లింగభైరవి మాత ఆలయం ఉంటుంది. దేశంలోని ఏకైక లింగభైరవి ఆలయం ఇదే. ఇక్కడ 8 అడుగుల ఎత్తయిన దేవి విగ్రహాన్ని పాదరస అంతర్భాగంతో ప్రబలశక్తి స్వరూపిణిగా ప్రాణప్రతిష్ఠ చేశారు. లింగాకారానికి అయిదు చేతులతో, వృషభాసనంపై ఉండే అమ్మవారికి నిత్యపూజలుంటాయి. ఇక్కడ పూజాది కార్యక్రమాలను మహిళలే నిర్వహించడం విశేషం. ఇక్కడి మరో ప్రత్యేకత లింగభైరవి ప్రసాదం. వేపాకులను నైవేద్యంగా సమర్పించి దానినే భక్తులకు పెడ్తారు. ఆధ్యాత్మికత ప్రకృతితో మేళవిస్తుంది. ఇక్కడ సర్వధర్మ స్థూపం ఉంది. అన్ని కులమతాలకు ఆశ్రమం సమదూరం, అందరూ ఒక్కటే అనే దానికి సూచనగా ఈ స్థూపాన్ని ఏర్పరచినట్లు చెప్తారు. స్థూపంపై అన్ని మతాల గుర్తులనూ చెక్కారు.


200 ఎకరాలు, 150 కేంద్రాలు: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ స్థాపించిన ఈశా ఫౌండేషన్ దేశవిదేశాల్లో ఉన్నది. ప్రధాన కేంద్రం తమిళనాడులోని కోయంబత్తూరుకు 30 కి.మీ. దూరంలోని వెలంగిరి పర్వతశ్రేణుల వద్ద ఉండగా, మరో ప్రధాన కేంద్రం అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఉంది. టెన్నెసీలో ఈశా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ స్థాపించారు. ఫౌండేషన్ నిర్వహణ పూర్తిగా వాలంటీర్ల ఆజమాయిషీలోనే ఉంటుంది. అన్నింటికీ సద్గురు జగ్గీవాసుదేవ్ మార్గదర్శి. ప్రపంచవ్యాప్తంగా 150కి పైబడి కేంద్రాలున్నాయి. వీటిల్లో 20 లక్షల మందికిపైగా వలంటీర్లు పనిచేస్తున్నారు. ఒక్క యోగ, ధ్యానంతోనే ఈశా సరిపెట్టలేదు. పర్యావరణం, విద్య, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడం వంటి అనేక సామాజిక హిత కార్యక్రమాలను, స్వచ్ఛందంగా చేపట్టింది. ఈశా ఫౌండేషన్ ఒక స్వచ్చంద సంస్థగా రూపాంతరం చెందింది. కోయంబత్తూరులోని ఆశ్రమంలో ఈశా హోం స్కూలు పేరుతో ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్నారు. ఇక, ఈశా విద్యాలయ పేరుతో పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నారు.


తమిళనాడులోని ప్రతీ తాలూకా కేంద్రంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో నిర్వాహకులు పనిచేస్తున్నారు. ఇప్పటికే వారు ఈ లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ పేరుతో తమిళనాడులో 11 కోట్ల మొక్కలను నాటాలని సంకల్పించారు. వీటన్నింటితోపాటు ర్యాలీ ఫర్ రివర్ పేరుతో దేశవ్యాప్తంగా నదుల పునరుజ్జీవం కోసం కూడా సంస్థ ప్రయత్నిస్తుండడం విశేషం. కాగా, ఈశా ఆశ్రమం సుమారు 200 ఎకరాలకు పైగా స్థలంలో విస్తరించి ఉన్నది. ఇక్కడి వలంటీర్లు, ఇతరులు వాడే వాహనాలన్నీ బ్యాటరీలతో నడిచేవే. మోటారు సైకిళ్లు, ఆటోలు, ఆటోరిక్షాలు, సైకిళ్లు సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. ధ్యానసాధకులకు ఏ ఇబ్బందీ లేకుండా పర్యావరణ హిత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. ఈ మహాశివరాత్రి పుణ్యదినాన ఈ ఆశ్రమ సందర్శన ఒక అద్వితీయ అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


isha-foundation2

అతిపెద్ద ఆదియోగి విగ్రహం!

ప్రపంచంలోనే అతిపెద్ద మహాశివుడి రూపమైన ఆదియోగి విగ్రహం ఈశా ఆశ్రమంలో కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ఆవిష్కరించారు. ఆదియోగి తన ఏడుగురు శిష్యులకు యోగశాస్ర్తాన్ని అందించారు. మానవుడు తన పరిమితులను అధిగమించి సర్వోన్నత స్థితికి చేరడానికి 112 మార్గాలను వివరించారు. ఆదియోగి సూచించిన 112 మార్గాలను గుర్తు చేసేలా 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఛాతీ పై భాగం నుంచి ముఖం వరకు ఉండే ఈ విగ్రహానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. అలాగే, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని ఇంక్రెడిబుల్ ఇండియా డెస్టినేషన్‌గా గుర్తించింది. ఈ విగ్రహానికి ఎదురుగానే యోగేశ్వర లింగం ఏర్పాటు చేశారు.
- ఓరుగంటి సతీశ్
చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో, నమస్తే తెలంగాణ

610
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles