ఇద్దరు యువకుల ఫేస్‌బుక్ ఊరట!


Tue,January 22, 2019 10:44 PM

ఆందోళన.. ఒత్తిడి.. భయం.. అభద్రతా భావం. వ్యాపారం.. ఉద్యోగం చేసేవాళ్లలో ఎదురయ్యే సమస్యలివి. కానీ ప్రస్తుతం టీనేజ్ నుంచే మొదలవుతున్నాయి. కొందరిది ప్రేమ సమస్య. మరికొందరిది ర్యాంకుల సమస్య.. అందం సమస్య. తల్లిదండ్రులతో చెప్పుకోలేరు.. వారు చెప్పనిదే పేరెంట్స్‌కు అర్థంకావు. వాళ్లను అలాగే వదిలేద్దామా? ఎవరూ పట్టించుకోరా? అంటూ సోషల్‌మీడియానే సొల్యూషన్‌గా ఎంచుకొని నో వన్ కేర్ ఫేస్‌బుక్ పేజీ ద్వారా వేలాది యువత జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఓ ఇద్దరు యువకులు.
facebook
ఫేస్‌బుక్ పేజీ ద్వారా మానసిక సమస్యలు పరిష్కరించడమనే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టి నో వన్ కేర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు మహారాష్ట్రకు చెందిన 20 ఏండ్ల వయసున్న నిఖిల్ కాలే, సత్యం శాస్త్రి.


కోటిన్నర మంది: వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. కానీ వారికి ఉన్న ఫాలోయింగ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్క సంవత్సరంలోనే కోటిన్నర మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. చిన్న వయసులో ఫేస్‌బుక్ ద్వారా ఇంత ఫాలోయింగ్ ఉండటం కూడా ఒక రికార్డే. వాళ్లు చేసేదల్లా పాజిటివ్‌నెస్‌ను స్ప్రెడ్ చేయడమే. సమస్యతో ఉన్నామనే వారిని సంతోషం వైపు మళ్లిస్తూ ఫేస్‌బుక్‌కే వన్నె తీసుకొచ్చారు నిఖిల్, సత్యం. పేజీ క్రియేట్ చేసిన ఐదు రోజులకు కూడా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పేజీని లైక్ చేయని పరిస్థితి. వాళ్లు ఏం చెప్పదలుచుకుంటున్నారో.. యువత ఏం కోరుకుంటుందో మరోసారి ఆలోచించి పెట్టిన ఒకట్రెండు విషయాలైనా క్వాలిటీ కంటెంట్ ఉండేట్లు ప్లాన్ చేసుకున్నారు. No One Cares Of You.. You Should Care Of Yourself వంటి సందేశాలిచ్చారు. పది రోజుల్లోనే 100K ఫాలోవర్స్ పెరిగారు. సంవత్సరంలోపే 15 మిలియన్ల (కోటిన్నర) ఫాలోవర్లు ఏర్పడ్డారు.


తొలుత సరదా కోసం: నిఖిల్.. సిన్హ్‌గఢ్ ఇనిస్టిట్యూట్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా చేశాడు. సత్యంశాస్త్రి.. బర్కతుల్లా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. అందరిలాగే వీళ్లు కూడా సరదా కోసం, కాలయాపన కోసం సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లు. ఫేస్‌బుక్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారానే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. యువత దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నది? అనే చర్చ వీరిద్దరి మధ్య తరుచుగా జరిగేది. సరదా విషయాల్లోనే యువత ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుందనే నిర్ధారణకు వచ్చారు. ఫేస్‌బుక్ ద్వారా యువతను ఎంటర్‌టైన్ చేసే ఐడియా గురించి ఆలోచించి.. ఫన్నీ సైట్ ఒకటి పెట్టాలనుకున్నారు. తొలుత వైరల్ వీడియోస్.. బర్నింగ్ ఇష్యూస్‌పై స్పూఫ్ వీడియోలు, ఎమోజీ పోస్టర్లు చేసి పోస్ట్ చేస్తుండేవాళ్లు. సెటైరికల్‌గా ఉండటంతో మంచి ఆదరణ లభించింది. నాలుగు మాటలు రాసి పోస్ట్ చేసినా వేలల్లో లైక్‌లు వస్తుండటంతో వారు మరింత లోతుగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.


మానసిక సమస్యలే: ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసే అలవాటున్న నిఖిల్, సత్యం శాస్త్రి యువతను ఎంటర్‌టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సైకాలజిస్ట్‌లు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, కాలమిస్ట్‌లను సంప్రదించారు. సరదా వెనకాల సమస్యలు దాగున్నాయనే కొత్త విషయం తెలుసుకున్నారు. యువత ఆందోళన, ఒత్తిడి, ఆత్మన్యూనతకు గురవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇవి తీవ్రమైన మానసిక సమస్యలుగా మారకముందే వారికొక సొల్యూషన్ చూపించాలని సంకల్పించారు. టీనేజ్ పిల్లలు ఈ రోజుల్లో ప్రతీది సమస్యాత్మకంగానే భావిస్తున్నారు. ఆ సమస్యలు ప్రేమ, చదువు, అందం, ఆహారం చుట్టూ తిరుగుతుండటం వల్ల పేరెంట్స్‌కు చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో సొల్యూషన్ కోసం సోషల్‌మీడియాను ఆశ్రయిస్తున్నారట. అలాంటివారికి Take Care Of Yourself.. No One Else Will వంటి కోట్స్ చెప్తూ ఆలోచింపజేస్తున్నారు.


ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా: సోషల్‌మీడియాను మంచికి వాడుకుంటే చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు నిఖిల్, సత్యంశాస్త్రి. మేం కూడా ఏదో సరదా కోసం ఫేస్‌బుక్‌లో అకౌంట్ క్రియేట్ చేసి తొలుత ఫన్నీ అండ్ క్రేజీ పోస్టులు, వీడియోలు పెడుతుండేవాళ్లం. మేం సరదాగా చెప్తున్నన్ని రోజులు ప్రజలు దాన్నే ఆస్వాదించారు. అయితే మానసికంగా ఇబ్బంది పడుతున్న యువతకు ఏదైనా చేయాలని ఒక మంచి ఉపశమన కేంద్రంగా దీనిని వాడుతున్నప్పుడు అంతకన్నా రెట్టింపు ఆదరణ లభించింది. ఎప్పుడైతే నో వన్ కేర్.. సిఫియాకో మీడియా ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఇంకో అడుగు ముందుకేశామో అప్పుడే విజయం సాధించాం. మాతోపాటు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. వారికి కూడా My Head Says Who Cares? But My Heart Whispers.. You Do వంటి విషయాలు చెప్తున్నాం. ఫేస్‌బుక్ అంటే చాలామందికి ఇదేదో టైంపాస్ ప్రక్రియలాగా అనిపిస్తుంది. కావచ్చు.. కానీ అదొక్కటే కాదనే విషయాన్ని మేం ప్రూవ్ చేశాం. సిఫియాకో మంచి టర్నోవర్ సాధిస్తున్నది. భవిష్యత్‌లో దీనిని మూడు విభాగాలుగా విభజించి యూత్‌తో పాటు అన్ని వయసుల వారికి ఉపయోగపడే కార్యక్రమాలు రూపొందించాలని ఆలోచిస్తున్నాం అని వివరించారు.


facebook2

నో వన్ కేర్

వీళ్లు ఏర్పాటుచేసిన ఫేస్‌బుక్ పేజీ పేరు నో వన్ కేర్. 2016లో దీనిని ప్రారంభించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న యువతలో ధైర్యం నింపేందుకు ఇది దోహదం చేస్తున్నది. దాన్నొక స్టార్టప్‌గా మార్చేస్తూ సిఫియాకో మీడియా పేరిట వెబ్ బేస్డ్ మాధ్యమాన్ని ఏర్పాటు చేశారు. పుణె కేంద్రంగా 30-35 మంది ఉద్యోగులతో ప్రారంభమైంది. ఎలాంటి మానసిక సమస్యలను యువత ఫేస్ చేస్తుందనే విషయాన్ని ఒక టీమ్ తెలుసుకుంటుంది. వాటికి పరిష్కారంగా ఏం కంటెంట్ ఇవ్వాలి? ఎలా మోటివేట్ చేయాలి? అని క్రియేటివ్ వింగ్ చూసుకుంటుంది. ఇలా రోజులో 20 వీడియోలు.. కోట్స్.. చిన్న విశ్లేషణలు ఇస్తూ ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు. Dont Judge My Choices Without Understanding My Reasons. సిఫియాకో మీడియా ద్వారా అన్ని రకాల కంటెంట్ ఇస్తున్నారు. No One Cares Unless Youre Pretty Or Dying వంటి స్వీయ ప్రేరేపిత సందేశాలు కొత్తగా ప్రజెంట్ చేస్తూ క్రియేటివ్ పర్సన్స్‌గా గుర్తింపు పొందారు. అతి చిన్న వయసులో వెబ్‌మీడియా ద్వారా విజయం సాధించారు.
-దాయి శ్రీశైలం

538
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles