ఇదీ రక్తహీనతే! ఎప్లాస్టిక్ అనీమియా


Wed,July 6, 2016 01:42 AM

మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ నుంచి పోషకాలు, హార్మోన్ల దాకా శరీరంలో ఒక రవాణా మాధ్యమంగా ఉపయోగపడే ద్రవరూప కణజాలం రక్తం. ఎముక లోపలి భాగంలో ఉండే బోన్‌మ్యారోలో ఉండే మూలకణాలు పరిణతి చెంది రక్తకణాలు ఏర్పడతాయి. ఈ రక్తకణాల సంఖ్య తగ్గితే రక్తహీనత లేక అనీమియా అంటారు. మూలకణాల స్థాయిలోనే సమస్య ఉంటే ఎప్లాస్టిక్ అనీమియా అంటారు.
ఎప్లాస్టిక్ అనీమియాను ఒకరకంగా ఆటోఇమ్యూన్ వ్యాధిగా చెప్పవచ్చు. వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్)లో భాగమైన టి-కణాలు దాడి చేయడం వల్ల మూలకణాలు దెబ్బతింటాయి. సాధారణంగా ఇవి ఎందుకిలా దాడిచేస్తాయనే దానికి 75 శాతం ఇదమిత్థమైన కారణాలు లేవు. ఒక 25 శాతం వరకు మాత్రం వైరల్ ఇన్‌ఫెక్షన్లు ముఖ్యంగా హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్లు, కొన్ని యాంటిబయాటిక్స్ కారణమవుతాయి. బెంజీన్ లాంటి రసాయన పదార్థాలకు ప్రభావితం కావడం వల్ల కూడా ఎప్లాస్టిక్ అనీమియా రావొచ్చు. రక్తహీనత వల్ల కలిగే అన్ని రకాల సమస్యలు దీనిలో ఉంటాయి.

నిర్ధారణ
-బోన్‌మ్యారో పరీక్ష ద్వారా ఎప్లాస్టిక్ అనీమియాను నిర్ధారిస్తారు. టెస్టు చేసినప్పుడు బోన్‌మ్యారో నిండుగా రక్తకణాలు ఉండాల్సింది పోయి, ఖాళీగా ఉంటుంది.
-రక్తహీనతకు సంబంధించిన లక్షణాలుండడం వల్ల మొట్టమొదట బి12, ఐరన్, ఫోలేట్ పరీక్షలు చేస్తారు. వీటిలో ఏదైనా తక్కువగా ఉంటే తదనుగుణమైన చికిత్స ఇస్తారు.
-విటమిన్ లోపం ఏమీ లేకపోయినా రక్తపరీక్షల్లో అన్ని రకాల రక్తకణాలు తక్కువగా ఉన్నట్టయితే క్యాన్సర్ కాదని నిర్ధారించుకోవడం కోసం కణాలను పరిశీలిస్తారు. ఆయా కణాల ఆకార, నిర్మాణాలను మైక్రోస్కోప్‌లో పరిశీలించి, అవి క్యాన్సర్ కణాలు కావని నిర్ధారణ చేసుకోవడం అవసరం. క్యాన్సర్ కాదని తేలితే పెల్విక్ బోన్ నుంచి బోన్‌మ్యారో తీసుకుని, బోన్‌మ్యారో టెస్టు యాస్పిరేట్ బయాప్సీ చేస్తారు.
ఈ టెస్టులో..
-హిమోగ్లోబిన్ 10గ్రా./లీ., న్యూట్రోఫిల్స్ 1.5x10 పవర్ 9/లీ. కన్నా తక్కువ, ప్లేట్‌లెట్‌లు 50x10 పవర్ 9/లీ. కన్నా తక్కువగా ఉంటే నాన్ సివియర్ ఎప్లాస్టిక్ అనీమియాగా భావిస్తారు.
-రెటిక్యులోసైట్లు (ఎర్రరక్తకణాల ప్రికస్సర్స్) 60x10 పవర్ 9/లీ. కన్నా తక్కువ, న్యూట్రోఫిల్స్ 0.5x10 పవర్ 9 కన్నా తక్కువ, ప్లేట్‌లెట్‌లు 20x10 పవర్ 9 కన్నా తక్కువ ఉంటే సివియర్ ఎప్లాస్టిక్ అనీమియాగా పరిగణిస్తారు.
-న్యూట్రోఫిల్స్ సంఖ్య 0.2x10 పవర్ 9 లేదా అంతకన్నా తక్కువ ఉంటే వెరీ సివియర్ ఎప్లాస్టిక్ అనీమియాగా భావిస్తారు.
చికిత్స ఇలా..
నాన్ సివియర్ ఎప్లాస్టిక్ అనీమియాకి సపోర్టివ్ ట్రీట్‌మెంట్ అంటే రక్తం ఎక్కించడం, ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి యాంటి ఫంగల్, యాంటి వైరల్ మందులు ఇస్తారు. అవసరాన్ని బట్టి యాంటి బయాటిక్స్ ఇస్తారు. రక్తస్రావం కలగకుండా జాగ్రత్తపడడం, నివారించడం సపోర్టివ్ ట్రీట్‌మెంట్‌లో కీలకమైనవి.
ఆరోగ్యవంతుల్లో ప్లేట్‌లెట్‌ల సంఖ్య 1.5 నుంచి 4.5 లక్షలు ఉండాలి. ప్లేట్‌లెట్‌ల సంఖ్య 10 వేల కన్నా తగ్గితే సాధారణంగా ప్లేట్‌లెట్లను ఎక్కిస్తారు. జ్వరం కూడా ఉంటే ప్లేట్‌లెట్‌ల సంఖ్య 20 వేల కన్నా తగ్గినా ఎక్కిస్తారు.
డెఫినిటివ్ ట్రీట్‌మెంట్
దెబ్బతిన్న మూలకణాలను ఆరోగ్యకరమైన వాటితో రీప్లేస్ చేయడం ద్వారా డెఫినిటివ్ ట్రీట్‌మెంట్ ఇస్తారు.
ఇమ్యునో సప్రెసివ్ మందులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సివియర్ ఎప్లాస్టిక్ అనీమియా, వెరీ సివియర్ ఎప్లాస్టిక్ అనీమియా ఉన్న పేషెంట్లకు బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం అవుతుంది. అయితే వీరిలో హెచ్‌ఎల్‌ఎ మ్యాచ్ డోనర్ దొరికితేనే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఎంచుకుంటారు. దీనివల్ల 80 శాతం అనీమియా నయమవుతుంది. హెచ్‌ఎల్‌ఎ మ్యాచ్ అయ్యే డోనర్ దొరకకపోతే ఇమ్యునో సప్రెసెంట్స్ ఇస్తారు. వీటిలో భాగంగా యాంటి థైమోసైటో గ్లోబ్యులిన్ (ఎటిజి)ని సైక్లోస్పోరిన్‌తో కలిపి ఇస్తారు. దీనివల్ల తగ్గుతుందో లేదో 4-6 నెలల వరకు చూస్తారు. లేకుంటే మళ్లీ ఇస్తారు. అయినా ఫలితం లేకపోతే నాన్ రిలేటివ్ హెచ్‌ఎల్‌ఎ డోనర్స్ నుంచి అంటే హెచ్‌ఎల్‌ఎ మ్యాచ్ కాని డోనర్ నుంచి తీసుకున్న స్టెమ్‌సెల్స్‌నే ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు.
Anil

1720
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles