ఇదీ మన తెలంగాణ


Sun,February 24, 2019 03:20 AM

తెలంగాణది చరిత్రే కాదు.. ఈ గడ్డ మీద చరిత్ర ఆనవాళ్లే లేవు.. అన్న నోళ్లకు ఓ సమాధానం ఈ చిత్రకథా సమాహారం. ఆదిమానవుడు నడక నేర్చుకున్న క్రమం నుంచి జీవన విధానాలు మారుతున్న కాలక్రమం, రాజులు, చక్రవర్తుల పరిణామ క్రమం ఈ గడ్డకు వేల ఏండ్ల కిందటే పరిచయం. తెలంగాణ పేరెత్తగానే కేవలం కాకతీయులే ఈ గడ్డను ఏలారు, అది తప్ప ఇంకే చరిత్ర లేదన్నవారెందరో. కానీ.. ఎన్నో చారిత్రక సాక్ష్యాలు, ఆధారాలు, శిలలు, శిల్పాలు, శిథిలాలు తెలంగాణకు ఉన్న ఘనమైన గత చరిత్రకు దర్పణంగా ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. తొలి తెలుగు కందపద్యం ఈ నేలమీదే పురుడుపోసుకుంది. దక్షిణ భారతావనిలోనే తొలి రాజధాని కోటిలింగాల ఈ మట్టిమీదే విలసిల్లింది. రాండ్రి, మన మట్టివాసనను గుండె గుండెకు చేరుద్దాం. చరిత్రే లేదన్న వారికి ఇదీ మన తెలంగాణ అని సాక్ష్యాలతో కళ్ళముందుంచుదాం.
Rudrapadalu

ఖానాపూర్ రుద్రపాదాలు / పెద్దపల్లి

చాళుక్యులు, కాకతీయ రాజుల కాలానికి చెందినవి ఈ రుద్రపాదాలు. గోదావరిలో మునిగి ఉండే ఈ రుద్రపాదాలకు ఎదురుగా రుద్రేశ్వరుడు, రుద్రరాణి, నంది, కొంతదూరంలో మహేశ్వరి, మహా త్రిపురసుందరి, బాలాత్రిపుర సుందరి, యోగినిశక్తి, త్రిమూర్తులు వలయాకారంలో కూర్చున్న అద్భుత శిల్పకళ ఇక్కడ ఉంది. మంథని మండలం ఖానాపూర్ వద్ద గల గోదావరి నది ప్రవాహ దిశ మార్చుకునే చోట ఈ రుద్రపాదాలున్నాయి.


BOMMALAMMAGUTTA

బొమ్మలగుట్ట / కరీంనగర్

గంగాధర మండలం కురిక్యాలలో ఈ బొమ్మలగుట్ట ఉంది. తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి కారణమైన తొలి తెలుగు కంద పద్యం ఈ గుట్టపై చెక్కి ఉండడం విశేషం. క్రీ.శ. 945 ప్రాంతంలో పంప మహాకవి సోదరుడు జీనవల్లభుడు బొమ్మలగుట్ట క్షేత్రంగా జీవించాడు. గుట్టపై బాహుబలి, యక్షిణి విగ్రహాలు ఆకట్టుకునేలా ఉంటాయి.


kush-mahal

ఖుష్‌మహల్ / వరంగల్

వరంగల్ కోటలోని శిలా తోరణాలకు దగ్గరగానే ఉన్న ఈ కట్టడానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. దీన్ని క్రీ.శ. 1350లో కాకతీయుల అనంతరం ఏలిన ముసునూరి నాయకులు కట్టించారు. ఈ దర్బారు వెడల్పు 45 అడుగులు, పొడవు సుమారు 90 అడుగులుంటుంది. కింది, పై గదులు రాజకుటుంబీకులు చల్లని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించారు.


shambuni-temple

నేల శంభుని గుడి / వరంగల్ అర్బన్

ఈ గుడి ఖిల్లా వరంగల్‌లో ఉన్న శిలా తోరణాలకు కొద్దిదూరంలో ఉంది. వరాలమ్మగుడి, నేల శంభునిగుడి, మట్టికోట కింద త్రికూటాలయ ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. దీన్ని కాకతీయులు నిర్మించారు. సగం భూమిలో సగం బయట ఉండటం నేల శంభుని గుడి ప్రత్యేకత. కూరుకుపోయిన మట్టిని తవ్వుతూ తోరణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నది మన పురావస్తు శాఖ.


bodhan-bahu-bali

బోధన్ బాహుబలి / నిజామాబాద్

మొదటి జైన తీర్థంకరుడు వృషభనాథుడి కొడుకు బాహుబలి. నవీపేట మండలంలోని బినోలాలో బహుబలి విగ్రహం ఇప్పటికీ ఒక ఆలయం వద్ద ఉన్నది. శ్రావణ బెలగోళలోని బాహుబలి కంటే ఇది చాలా పురాతనమైంది. క్రీ.పూ. 6వ శతాబ్దానికి ముందు నుంచే దీని ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తుంది.


kotilingala

కోటిలింగాల / కరీంనగర్

దక్షిణ భారత దేశ తొలి రాజధానిగా పేరుగాంచిన మహానగరం కోటిలింగాల. కోటిలింగాల కేంద్రంగా శాతవాహన సామ్రాజ్యం ఏర్పాటు చేశారు. క్రీ.పూ. 500 నుంచి క్రీ.పూ. 400ల మధ్య ఆంధ్ర గోపులు, శబరులు, మహాతలవరులు కోటిలింగాల కేంద్రంగా పాలించారు. అంతకు పూర్వ కాలం నాటి నాణేలు, మట్టి పాత్రలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి.


tellapur

తెల్లాపూర్ శాసనం/ సంగారెడ్డి

ఆరు వందల సంవత్సరాల క్రితమే తెలంగాణ పదం ప్రాచుర్యంలో ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం తెల్లాపూర్ గ్రామంలో ఉన్న శిలా శాసనమే ఇందుకు నిదర్శనం. బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షా హయాంలో అంటే క్రీ.శ. 1417లో నేటి తెల్లాపూర్ నాటి తెలంగాణపురంలో ఈ శిలా శాసనాన్ని ఏర్పాటు చేశారు. శిలా శాసనంలో మొత్తం 24 పంక్తులు ఉంటే అందులో 13వ పంక్తిలో తెలంగాణపురం అనే పదం ఉంటుంది. నాటి తెలంగాణపురమే కాలక్రమేణ తెల్లాపూర్‌గా మారింది. బహమనీ సుల్తాన్ తర్వాత వంద సంవత్సరాలకు అంటే క్రీ.శ 1510లో కాకతీయ రాజు ప్రతాపరుద్రునికి సంబంధించిన వెలిచర్ల శాసనంలో కూడా తెలంగాణ పదాన్ని ప్రస్తావించారు. ఆరు వందల ఏండ్ల క్రితం తెలంగాణపురంలోని దిగుడు బావి వద్ద ఈ శాసనాన్ని ఏర్పాటు చేశారు.


konda-masjeed

కొండ మసీదు /వరంగల్ (అర్బన్)

వరంగల్ మహా నగరాన్ని నిర్మించిన కాకతీయులపై 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు దాడిచేసి రాజధానిని కైవసం చేసుకొన్నారు. అద్భుతమైన శిల్పసంపదను ధ్వంసం చేయడంతో పాటు ఆ శిల్పసంపదకు పోటీగా అన్నట్టు కొండ మసీదును నిర్మించారు. అయితే ఇది కూడా శిథిలావస్థకు చేరుకుంది. కొంతకాలం క్రితం నిజాం ఆర్కియాలజీ విభాగం మరమ్మతు చేసింది. ఇప్పుడు అది కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న దశలో మళ్లీ మరమ్మతులు చేపట్టారు.


pillar

ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్ట స్తంభం / నిజామాబాద్

నాలుగు వందల సంవత్సరాల క్రితం తొమ్మిది మంది సిద్దులు తపస్సు చేసిన పుణ్యస్థలం ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దుల గుట్ట. తొమ్మిది మంది సిద్దులు నడియాడిన నేల కావడంతో నవ సిద్దులగుట్ట అనే నామకరణం జరిగింది. త్రేతాయుగంలో గుట్టపై వెలసిన స్వయం భూశివలింగం ఆనాటి నుంచి నేటి వరకు భక్తుల పూజలు అందుకుంటున్నది. దినదినాభివృద్ధితో ఆర్మూర్‌లో పట్టణంలోని గుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందుతున్నది. ఈ గుట్ట ప్రాంగణంలోని ఈ రాతి స్తంభం ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం.


బృహత్ శిలాయుగం


mud-plate

బౌద్ధుల కాలం నాటి మట్టి పాత్ర / నల్లగొండ

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు, ఎర్రగడ్డల గూడెం గ్రామాల శివార్లలో ఆదిమానవుల ఆవాసాలు ఉన్నట్లు గుర్తించారు. క్రీ.పూ. 500-1500 సంవత్సరాల వరకు ఇక్కడ బృహత్ శిలాయుగానికి చెందిన అనేక ఆనవాళ్లు బయటపడ్డాయి.


dolmen

రాకాసి గుట్టల్లో డోల్మెన్‌లు / ఖమ్మం

బృహత్ శిలా యుగానికి చెందిన ఆధారాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలం పడుగోని గూడెం రాకాసి గుట్టల్లో ఉన్నాయి. నాటి ప్రజల స్మృతి చిహ్నాలుగా రూపొందించుకున్న మెన్‌హీర్, స్టోన్ సర్కిల్, డోల్మెన్‌లు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి.


జైనం


padmakshi-hill

పద్మాక్షి గుట్ట / హన్మకొండ

అతిపురాతనమైన జైన సంస్కృతి పద్మాక్షిగుట్టల్లో పారాడిన ఆనవాళ్ళు అక్కడ ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. తొలి కాకతీయులు జైన మతాన్ని ఆదరించిన నేపథ్యంలో ఆ ఏలుబడిలో ఉన్న ఓరుగల్లుకు జైనుల ప్రవాహం పెరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. తెలంగాణ జైన సంస్కృతి వికాసానికి ఆలవాలం. నిజామాబాద్ నుంచి కొలనుపాక (ప్రస్తుతం యాదాద్రి జిల్లా) దాకా, అక్కడి నుంచి జనగామ దాక (జైన్‌గావ్‌గా స్థిరపడి జనగామగా మారిన నేపథ్యం), అక్కడి నుంచి ఓరుగల్లు దాకా జైన సంస్కృతికి అనేక ఆనవాళ్లు, సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని పద్మాక్షిగుట్టల్లోని విగ్రహాలే స్పష్టం చేస్తున్నాయి.


jai-nath-temple

జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం / ఆదిలాబాద్

అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఇది ఒకటి. జైనథ్ మండల కేంద్రంలో ఉన్నది. శాతవాహన కాలంలో జైనథ్ జైనమత కేంద్రంగా వర్ధిల్లిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయ నిర్మాణానికి వాడిన వేవత్ మాలవంత్ శిల (రాయి)లు జైనథ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించదు. మహారాష్ట్రలోని పాండ్రకవడ నుంచి వీటిని తెచ్చారంటారు.


పరిఢవిల్లిన బౌద్ధం


naga-muchi-lindha

నాగముచిళింద బౌద్ధశిల్పం / నల్లగొండ

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామంలో బౌద్ధ మతానికి చెందిన నాగముచిళింద బౌద్ధశిల్పం లభించింది. ఇది 5, 6 శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు. బుద్ధుడికి జ్ఞానోదయమైన తర్వాత ప్రాకృతికతత్వాల నుంచి నాగరూపియైన ముచిళిందుడు కాపాడాడని చెబుతారు.


పురాతన బావి


koneru

వేయిస్తంభాల గుడి కోనేరు/ వరంగల్ అర్బన్

వరంగల్ పరిసర ప్రాంతాల్లో 150 నుంచి 200 పురాతన బావులున్నాయి. బావులను గుళ్లు, కోటలతో పాటు అత్యంత పవిత్రంగా కట్టిన చరిత్ర కాకతీయులది. కోనేరుగా ఉండే లేదా తంతెలు తంతెలుగా ఉన్న ఈ బావి నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిత్రంలో కనిపిస్తున్నది వేయి స్తంభాల గుడి పరిసరాల్లోని ఉన్న కోనేరు.


great-wall

గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ/మహబూబ్‌నగర్

క్రీ.శ 8వ శతాబ్దంలో నిర్మాణం మొదలుపెట్టిన అతి పొడవైన గోడ ఇది. 13వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు ఈ గోడ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. 120 కిలోమీటర్ల మేర ఉన్న ఈ గోడను పటాల భద్రతకోట అంటారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ ఆనవాళ్లు దొరికాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని మున్ననూర్ నుంచి పరహరాబాద్, కొల్లాపూర్, కల్వకుర్తిల మీదుగా ఈ గోడ ఉన్నది.


శాసనాలు, తోరణాలు, ముఖద్వారాలు


bayyaram-pond
బయ్యారం చెరువు, శాసనం / మహబూబాబాద్

bayyaram-pond2
కాకతీయ గణపతిదేవుని సోదరి మైలాంబ తన తల్లి బయ్యమాంబ పేరు మీద బయ్యారం పెద్దచెరువును నిర్మించారు. బయ్యారం పెద్దచెరువుపై ఉన్నా శిలాశాసనం కాకతీయుల చరిత్రకు ప్రత్యక్ష ఆనవాలుగా నిలుస్తున్నది.

chandu-patla

చందుపట్ల శాసనం / నల్లగొండ

కాకతీయ రుద్రమదేవి మరణం గురించి తెలిపే శాసనం ఇది. నల్లగొండ జిల్లా చందుపట్లలో ఉన్నది.


UPPARIPALLY

ఉప్పరపల్లి ముఖద్వారం / కరీంనగర్

సైదాపూర్ మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఉంటుంది ఈ శిలా ముఖద్వార తోరణం. దక్షిణ భారతదేశ దండయాత్రల్లో భాగంగా ఢిల్లీ సుల్తానులు క్రీ.శ. 1303లో ఉప్పరపల్లి యుద్ధంలో కాకతీయల చేతిలో ఘోర పరాజయం పొందారు. ఈ విజయానికి గుర్తుగా ప్రతాపరుద్రుడు గొడిశాల (ప్రస్తుతం గుజ్జులపల్లి)లో త్రికూట ఆలయాన్ని కూడా నిర్మించాడు.


jalli-pally

జల్లిపల్లి దుర్గం ముఖద్వారం / ఖమ్మం

15వ శతాబ్దంలో కాకతీయులు జల్లిపల్లిని విడిది ప్రాంతంగా ఉపయోగించుకున్నారని స్థానిక చరిత్రకారులు చెబుతారు. ఈ గుట్టలను కిలాయి గుట్ట, గూనిగుట్టలుగా కూడా పిలుస్తారు. బొబ్బిలి యుద్ధానికి మూలకారణమై, 400 ఏండ్ల పాటు పగను రగిల్చిన జల్లిపల్లి మహా సంగ్రామం (క్రీ.శ. 1361) జరిగింది ఇక్కడే. ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు జల్లిపల్లి కోటమీద దండెత్తి ఈ ప్రాంతాన్ని స్వాధీన పరుచుకున్నాడు.


పురాతన ఆలయాలు


బోధన్ వంద స్తంభాల గుడి / నిజామాబాద్

sundayspecial1
క్రీ.శ. 6వ శతాబ్దానికి ముందు ఈ కట్టడం నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ వంద స్తంభాల గుడి ప్రాచీన కాలంలో ఆలయంగా, ఆ తర్వాత మసీదుగా మార్చడం వల్ల దీనిని దేవల్ మజీద్ అని కూడా పిలుస్తారు. జైనుల కాలం నాటి ఈ కట్టడం అనేక విధాలుగా రూపాంతరం చెందింది.


గణపేశ్వరాలయం నాట్యమండపం / జయశంకర్ భూపాలపల్లి

sundayspecial2
గణపేశ్వరాలయం కాకతీయుల కాలం నాటిది. మహ్మదీయులు దాడిచేసే సమయంలో గణపేశ్వరాలయంలోని అద్భుత శిల్పాలను వారి కంటపడి విధ్వంసం కాకుండా కాపాడారు. భూమిలో పూడ్చిన 8 అడుగుల శివ, విష్ణువు ద్వారపాలకుల విగ్రహాలు, రాజనర్తకి, సూర్య భగవాన్‌ల విగ్రహాలు తవ్వకాల్లో బయటపడ్డాయి.


ఏకవీర రేణుక ఎల్లమ్మ / వరంగల్ రూరల్

sundayspecial3
వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజక వ
ర్గం పరిధిలోని గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామ శివారులో ఏకవీర రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉన్నది. ఇది 12వ శతాబ్దం నాటిదిగా చరిత్రకారులు చెబుతున్నారు.

జోగుళాంబ ప్రాంగణంలో శివాలయం / జోగుళాంబ గద్వాల

sundayspecial4
అష్టాదశ శక్తి పీఠాల్లో అలంపూర్‌లో వెలసిన జోగుళాంబ అమ్మవారు ఐదో శక్తిపీఠంగా వెలుగొందుతున్నది. ఇక్కడ క్రీ.శ. ఆరో శతాబ్దంలో ఆలయాలు నిర్మించారు. ఆ ప్రాంగణంలోని శివాలయం ఇది.


కోటగుళ్లు / జయశంకర్ భూపాలపల్లి

sundayspecial5
కాకతీయుల వైభవానికి ఇవి చిహ్నాలు. కోటగోడలాంటి రాతితో నిర్మించిన ప్రహరీ కారణంగా ఆలయానికి కోటగుళ్లు అని పేరు వచ్చినట్లు భావిస్తున్నారు. గణపురంలోని గణపేశ్వరాలయానికి దక్షిణం వైపు రంగమంటపం,ఉత్తరంవైపు కాటేశ్వరాలయం,తూర్పున నంది మంటపంతో పాటు చుట్టూ 21 ఉప ఆలయాలు ఉన్నాయి.


రాయికల్ త్రికూటాలయం/ జగిత్యాల

sundayspecial6
వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, నగునూర్ త్రికుటాలయం ఇలా పేరెనికగన్న నిర్మాణాల శైలిని తలపించే విధంగా ఉంటుంది రాయికల్ త్రికూటాలయం. క్రీ.శ. 1305లో దీన్ని నిర్మించారు. మూడు గర్భగుడులు, ఒకే ఒక్క మండపంతో నిర్మితమైన ఈ త్రికుటాలయం ఇప్పటికీ తన వైభవాన్ని చాటుతున్నది. ఇది జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో ఉంది.


కందకుర్తి శివాలయం / నిజామాబాద్

sundayspecial7
గోదావరి నది తెలంగాణలో ప్రవేశించే ప్రదేశం ఇది. గోదావరి, హరిద్ర, మంజీర నదుల త్రివేణి సంగమ పుణ్యక్షేత్రమే కందకుర్తి శివాలయం. 1785లో మొఘల్ సైన్యం, పీష్వా సైన్యాల మధ్య జరిగిన యుద్ధంలో రాణి అహల్యాదేవి విజయం సాధించి ఈ ఆలయాన్ని నిర్మించిందట.


కన్నెకల్ శివాలయం / నల్లగొండ

sundayspecial8
మాడ్గులపల్లి మండలంలోని నేటి కన్నెకల్.. కందూరు చోడుల నాటి కర్నెకోట. కాకతీయుల నిర్మాణ శైలిలో శ్రీశైలం నమూనాను పోలిన శిథిల శివాలయం ఇక్కడ ఉంది. సుమారు 600 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు.


డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం / నిజామాబాద్

sundayspecial9
డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో 50 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ రామాలయం ఉంది. ఈ ఆలయంపై విజయనగర రాజుల శిల్పకళ పోలిన శైలి కనిపిస్తున్నది. 16వ శతాబ్దం మధ్యకాలంలో రామరాయల హయాంలో దీన్ని నిర్మించి ఉండవచ్చని భావిస్తున్నారు. మరికొందరు 14వ శతాబ్దంలో నిర్మితమైందని చెబుతుంటారు.


బురుజులు


ఆందోలు / సంగారెడ్డి

sundayspecial10
క్రీ.శ. 1764లో అందోలు సంస్థానాన్ని శంకరమ్మ పాలించింది. 1774లో శంకరమ్మ ఆనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు. అందోలు పట్టణం చుట్టూ 36 బురుజులు, 3 గౌనిలు, 6 పిల్లి దిడ్లు, మహారాజు కుటుంబీకుల నివాసం సిద్ధ్దిమహల్ వంటివి ఏర్పాటు చేసుకున్నారు. శత్రువులు దాడి చేసే సమయంలో తప్పించుకునేందుకు వీలుగా సిద్ధిమహల్ నుంచి కోట బయటకు వెళ్లేందుకు గుర్రం స్వారీ చేసేంత వీలుగా సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో వ్యవసాయానికి, తాగునీటి కోసం అందోలు పెద్ద చెరువును ఏర్పాటు చేశారు. 36 బురుజులలో సుమారుగా 10 వరకు మాత్రమే కనిపిస్తుండగా, మిగతావి శిథిలావస్థకు చేరాయి. 1642-50 మధ్యకాలంలో హూమ్నాబాద్‌కు చెందిన నూలు బసనప్ప అనే వీరశైవుడు రాజుల అనుమతితో జోగిపేటలో వ్యాపారం చేసేందుకు వచ్చాడు. పగుల రాళ్ల గుట్టపైన తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు.


గోండు రాజుల బాదనకుర్తి బురుజు / నిర్మల్

sundayspecial11
ఖానాపూర్ మండలంలోని గోదావరీ ద్వీపకల్పంలో వెలిసిన సుందర గ్రామం బాదనకుర్తి. ఈ ప్రాంతాన్ని 500 ఏండ్ల క్రితం ఆర్కా వంశానికి చెందిన గోండు రాజులు పాలించారని చరిత్ర చెబుతున్నది. వారు నిర్మించిన కోట బురుజే ఇది.


కోరుట్ల బురుజు / జగిత్యాల

sundayspecial12
జగిత్యాల జిల్లాలో చారిత్రక ప్రాధాన్యం గల ప్రాంతం కోరుట్ల. క్రీ.శ. 1042-1068 మధ్యకాలంలో కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రైలోక్యమాల్ల సోమేశ్వర మొదటి శాసనం కోరుట్లలో ఉన్నది.


వీర బైరాన్ పల్లి/ సిద్దిపేట

sundayspecial13
70ఏండ్ల క్రితం బైరాన్‌పల్లిలో జలియన్ వాలాబాగ్‌ను తలపించే నరమేధం జరిగింది. మట్టిమనుషులు తిరుగబడ్డరు. గడ్డికోసిన చేతులే కోడవళ్లు పట్టాయి.. బువ్వొండిన చేతులే తుపాకులు పట్టి రజాకారు దాష్టీకాలకు, రాక్షసత్వానికి వ్యతిరేకంగా గర్జించి పిడికిల్లెత్తాయి. మాతృభూమి విముక్తి కోసం 118మంది వీరయోధులు చేసిన త్యాగాలకు నెత్తుటి సాక్ష్యంగా నిలిచిన గ్రామం వీరబైరాన్‌పల్లి.


కోటలు / ఖిల్లాలు


దేవరకొండ ఖిల్లా / నల్లగొండ

sundayspecial14
ఎత్తైన ఏడుకొండలను కలుపుతూ నిర్మించబడిందే నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఖిల్లా. క్రీ.శ.13, 14వ శతాబ్దాల్లోనే దేవరకొండ గిరిదుర్గం రేచర్ల పద్మనాయక వెలమ రాజ్యానికి రాజధానిగా ప్రఖ్యాతి గాంచింది. కోటలోని రహస్య స్థావరాలు, ధాన్యాగారాలు, కచేరీలు, నివాసాలు, నీటి వనరులు, పూజా మందిరాలు, వ్యవసాయ క్షేత్రాలు, సైనిక స్థావరాలు, ఆశ్వ, గజ, పశుశాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నా.. కోట చుట్టూ నిర్మితమైన శిలా ప్రాకారాలు మాత్రం చెక్కు చెదరకుండా నేటికీ దర్శనమిస్తున్నాయి.


రామగిరి ఖిల్లా / పెద్దపల్లి

sundayspecial15
కాకతీయుల కాలం నాటి కళాఖండాలు.. ప్రాచీన శోభకు ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. వందల శతాబ్దాల చరితగల రాతి కట్టడాలతో కూడుకున్న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఈ ఖిల్లా ఉంది.


మొలంగూర్ ఖిల్లా / కరీంనగర్

sundayspecial16
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో ఇది ఉంది. ఈ కోటను కాకతీయుల కాలంలో
నిర్మించారని ఆధారాలున్నాయి. ఆదిమమానవుడి ఆవాసాలు, శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్లూ ఇక్కడ లభించాయి.


గోండు రాజుల కోటలు / ఆదిలాబాద్

sundayspecial17
ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్, తాండూరు, ఉట్నూరులలో గోండు రాజుల కాలం నాటి కోటలు ఉన్నాయి. ఇవి సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటివి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది తాండూరు కోట. దీనిని క్రీ.శ.1309లో నిర్మించారు.


రుద్రూర్ కోట / నిజామాబాద్

sundayspecial18
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో 14వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించిన కోటలు నేటికీ దర్శనమిస్తున్నాయి. రుద్రూర్‌తో పాటు మండలంలోని అంబం గ్రామంలో కూడా 400 ఏళ్ల నాటి కోటలు ఉన్నాయి.


గాంధారి ఖిల్లా / మంచిర్యాల

sundayspecial19
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుంట గ్రామంలో ఇది ఉంది. మహాభారతం ఆధారంగా ఈ కోటకు గాంధారి కోట అని పేరు వచ్చిందని కొందరు చెబుతారు. దీనిని గాంధారి మైసమ్మ కోటగాను పిలుస్తారు. కోటలోకి వెళ్లడానికి పెద్ద రాతి కొండను తొలిచి ప్రవేశ ద్వారం నిర్మించారు.


ఎలగందుల ఖిల్లా / కరీంనగర్

sundayspecial20
కొత్తపల్లి మండలంలోని ఎలగందులలో ఇది ఉంది. ఇక్కడ లభించిన అముద్రిత శిలాశాసనాన్ని బట్టి క్రీ.శ. 1202 నాటికే ఈ గ్రామం (బహుధాన్యపురం) ఉంది. కాకతీయ కాలంలోనే ఇక్కడి గుట్టపై కోట నిర్మించగా, ఆ తర్వాత ముస్లింల వశమైంది.


నిమ్మలనాయుని కోట.. ఖిల్లాగుట్ట / నిర్మల్

sundayspecial21
ఇది నిర్మల్ జిల్లాలో చారిత్రక ఖిల్లా. 16వ శతాబ్దంలో నిర్మల్‌ను ఏలిన నిమ్మలనాయుడు నిర్మించిన కోట ఇది. నిమ్మలనాయుడి పేరు మీదనే నిర్మల్‌కు ఆ పేరు వచ్చింది. పట్టణంలోని బత్తీష్‌గడ్, శ్యాంగడ్, సోన్‌ఘుడ్ కోటలతో నిమ్మలనాయుడు పాలన సాగిందని తెలుస్తున్నది. శరత్‌మహల్ తోట, శీతలమందిరం వంటి అప్పటి కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి.


సర్వాయి పాపన్న కోట/ జనగామ

sundayspecial22
ఖిలాషాపురంలోని సర్వాయిపాపన్న కోట 18వ శతాబ్దంలో ఢిల్లీ సామ్రాజ్యాధిపతులైన మహ్మదీయ ప్రభువులతో నిజాం నిరంకుశవాదుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప చరిత్ర ఉంది. ఈ కోటకు నాలుగు వైపులా పెద్ద బురుజులున్నాయి. మధ్యలో ఎత్తై న మరో బురుజు ఉంది. ఒక బురుజు నుంచి మరొక బురుజుకు నడిచి వెళ్లేందుకు దారి కూడా ఉంది. శత్రువులను ఎదుర్కొనేందుకు వీలుగా అక్కడక్కడ రంధ్రాలు, మూడు సొరంగాలు ఉన్నాయి.


గుట్టలు, గుహలు


కాచరాజుపల్లిలోని గాజుబెడ వద్ద చారిత్రక గుహలు / నల్గొండ

sundayspecial23
నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలోని నల్లమలను ఆనుకొని ఉన్న కాచురాజు పల్లిలో ఈ గుట్టలు కనిపిస్తాయి. లేత ఆకుపచ్చ, బంగారు వర్ణంలో అద్భుత సౌందర్యాన్ని సంతరించుకున్న ఈ గుహలు సుమారు వెయ్యేండ్ల నాటివని పురావస్తు శాఖ చెబుతున్నది. క్వార్ట్ శిలలు రూపాంతరం చెందడం వల్ల ఈ గుహలు ఆ రంగును సంతరించుకున్నాయంటారు.


రాముని గుండాలు / పెద్దపల్లి

sundayspecial24
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం దగ్గరలో ఇది ఉంది. ఈ ప్రాంతం రామాయణ కాలం నాటిదని ప్రతీతి. వనవాస కాలంలో రాముడు, సీత, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో సంచరించినట్టు పురాతన ఆధారాలు చెప్తున్నాయి. ఇక్కడి కొండ మీద 108 గుండాలున్నాయి. వీటిలో రాముడు, సీత, లక్ష్మణుడు స్నానమాచరించి, పూజలు చేసుకున్నట్టు పురాణకథలు చెప్తున్నాయి. అందుకే ఈ 108 గుండాలకు రాముని గుండాలు, రామగుండం అని పేరు. ఇక్కడ 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ఒకటి ఆకట్టుకుంటుంది.


పాండవుల గుట్ట/జయశంకర్ భూపాలపల్లి

sundayspecial25
రేగొండ మండలం తిరుమలగిరి శివారులో పాండవుల గుట్టలున్నాయి. మహాభారతం కాలంలో పాండవులు ఈ గుట్టలపైనే కొంతకాలం పాటు వనవాసం చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఆ కాలం నాటి చిత్రలేఖనం గుట్టలపై ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.


చిత్తారయ్య గుహలు / మంచిర్యాల

sundayspecial26
మంచిర్యాల జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలోని హాజీపూర్ మండలం బుగ్గగట్టు అడవుల్లో చిత్తారయ్య గుహలు ఉన్నాయి. ఇక్కడ మధ్యరాతి యుగం, కొత్త రాతియుగం ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ గుహల్లో గిరిజనులు దేవుని ప్రతిమలు పెట్టి పూజిస్తున్నారు.


ప్రతాపగిరి / జయశంకర్ భూపాలపల్లి

sundayspecial27
ప్రతాపగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్నదే గొంతెమ్మ గుట్ట. ఈ గుట్టపై కాకతీయుల కాలంనాటి 3 మహా ద్వారాలు ఉన్నాయి. శ్రీకృష్ణుని పాదముద్రలు... కుంతీదేవి పూజించిన శివలింగం... కాకతీయులు నిర్మించిన ప్రహరీ
గోడలు ఆకట్టుకుంటున్నాయి.

2660
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles