ఇది ఏ వ్యాధికి సంకేతం?


Fri,January 4, 2019 12:38 AM

మా అబ్బాయి వయసు 5 సంవత్సరాలు. తరచూ దురద పెడుతుంది అంటుంటాడు. గోకుతుంటాడు. దీంతో చర్మంపై అక్కడక్కడా కురుపులు అవుతున్నాయి. వాటిని గిచ్చితే పుండ్ల మాదిరి అవుతున్నాయి. తగ్గడానికి రకరకాల సబ్బులు, ఆయింట్‌మెంట్లు వాడినా ఫలితం లేదు. అసలు ఇదేం వ్యాధి? ఇది ప్రమాదకరమా? నాకు స్కిన్ అలర్జీ ఉంది. అది మా అబ్బాయికి కూడా వచ్చిందా? దయచేసి తెలుపగలరు.
- కె. అరుణ్‌కుమార్, చిట్యాల

Councelling
అరుణ్‌కుమార్ గారూ.. మీకెలాంటి భయం అక్కర్లేదు. మీ అబ్బాయికి వచ్చిన సమస్య మామూలుదే. కాకపోతే వాటిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. మీకు స్కిన్ అలర్జీ ఉన్నట్లు తెలిపారు. అది అంటువ్యాధేమీ కాకపోయినా వంశపారం పర్యంగా చర్మ సమస్యలు పిల్లలకు కూడా వస్తుంటాయి. అయితే మీకున్న అలర్జీ వల్లనే మీ అబ్బాయికి చర్మ సమస్యలు వచ్చాయని మాత్రం నిర్ధారించలేం. ఏది ఏమైనా మీ అబ్బాయికి పెద్దగా ప్రమాదమేమీ లేదు కాబట్టి మీరు ఆందోళన వదిలేసి చికిత్స గురించి ఆలోచించండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే అతనిది పాపులార్ అట్కేరియా సమస్యగా అనిపిస్తున్నది. ఈ సమస్య ఎక్కువగా చిన్న పిల్లల్లో, స్కిన్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లకు ఉంటుంది. ఈ చర్మస్థితి ఉన్నవాళ్లకు దోమలు కుట్టడం వల్ల కాళ్లపై గానీ, చేతులపైగానీ దురద పెడుతుంది. సాధారణంగా 2-12 ఏండ్ల వయసున్న పిల్లలకు వ్యాధి నిరోధక వ్యవస్థ హైపర్ రెస్పాన్స్ అవుతుంది. దీనివల్లే దురద పెడుతుంది. దీంతో కురుపులు ఏర్పడతాయి. తరుచూ గోకడం వల్ల పుండ్లు ఏర్పడతాయి. ఇదిలాగే కొనసాగడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తాయి. అంటే చీము పడుతుంది. బొబ్బలు వస్తుంటాయి. శీతాకాలంలో జరిగే వాతావరణ మార్పుల వల్ల దోమలు ఇతరత్రా కీటకాల ప్రభావం ఎక్కువగా ఉండి ఇలా అవుతుంటాయి. దీనిని నివారించాలంటే ముందు దోమలు కుట్టకుండా చూసుకోవాలి. కాళ్లకు, చేతులకు నిండైన వస్త్రాలు వేసుకోవాలి. దురద రాకుండా చర్మ నిపుణులుగానీ, పీడియాట్రిషియన్లు సూచించిన సబ్బులు, మాయిశ్చరైజ్‌లు వాడాలి. దీనివల్ల పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇక దోమలు బాగా సంచరించే సమయం సాయంత్రం 5-7 గంటలు కాబట్టి ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు.. వెంటిలేటర్లకు జాలీలు అమర్చాలి. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి నిరోధక వ్యవస్థ బలపడుతుంది కాబట్టి ఇది శాశ్వతంగా ఉండదు. ఇప్పటివరకైతే పీడియాట్రిషన్‌ను సంప్రదించి యాంటీ స్టెమినిక్, ఎమోలియన్స్ వాడితే సమస్య పరిష్కారం అవుతుంది.

డాక్టర్ కే భూమేష్ కుమార్
సివిల్ అసిస్టెంట్ సర్జన్,
కన్సల్టెంట్ పీడియాట్రిక్ డెర్మటాలజిస్ట్
గాంధీ హాస్పిటల్, హైదరాబాద్

673
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles