ఇక మడతపెట్టుడే..


Fri,March 1, 2019 03:26 AM

ఇన్ని రోజులు ఒంటికి వేసుకునే బట్టలే మడతబెట్టాం.. చదవడం పూర్తయ్యాక న్యూస్‌పేపరు, పుస్తకాలు మడతబెట్టి పక్కన బెట్టేశాం.. ఇకపై జేబులో ఉన్న మొబైల్, గోడకు వేలాడే టీవీ, బ్యాక్‌ప్యాక్‌లో ఉన్న లాప్‌టాప్ కూడా మడత బెట్టేసే రోజులొస్తున్నాయి. వస్తున్నాయ్.. అనేకంటే వచ్చే శాయ్ అనడం కరెక్టేమో! అవును.. ఖర్చీఫ్‌లా మడతబెట్టే మొబైల్ ఫోన్స్, చాపలా చుట్టేసే టీవీలు, తువ్వాలులా ఉండలా చుట్టేసే లాప్‌టాప్‌లు వచ్చేశాయి. బార్సిలోనాలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2019లో అబ్బురపరిచే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ కనువిందు చేస్తున్నాయి. ఆ ముచ్చట్లతో ఈ వారం సంకేత ప్రత్యేక కథనం.. అసలు ఈ ఫోన్లు, టీవీలు మడతబెట్టేయాలన్న ఆలోచన ఇప్పటిదేం కాదు. చాలా ఏండ్లుగా నానుతున్న ఆలోచనే. కాకపోతే రెండేండ్ల క్రితం కార్యరంగం ఏర్పడింది. ప్రయోగాత్మకంగా మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేసి ఓ శాంపిల్‌ను మార్కెట్లోకి వదిలారు. దానికి బాగా పాపులారిటీ, డిమాండ్ వచ్చింది. కాకపోతే అప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ అందుబాటులో లేదు. దీనికి తోడు.. ఒక ప్రాజెక్టు పూర్తి చేసే లోపు టెక్నాలజీ మరింత అప్‌డేట్ అయ్యేది. దీంతో కొన్నిరోజులు ఆలస్యమైనా గట్టి ప్రయత్నంతో మార్కెట్లోకి రావాలన్న కంపెనీల ఆలోచనలకు ప్రతిరూపంగా ఈ ప్రపంచ మొబైల్ జాతరలో మడతబెట్టే మొబైల్స్ కనువిందు చేస్తున్నాయి. ఒక్కో ఫోన్ ఒక్కో వెరైటీతో ఆకట్టుకునే ఫీచర్లతో మొబైల్ ప్రియులను ఊరిస్తున్నాయి. ఆయా మొబైల్స్, వాటి స్పెషల్ ఫీచర్ల వివరాలు మీకోసం..
galaxy-phones

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్

శాన్‌ఫ్రాన్సిస్కోలో తొలిసారి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూపొందించనున్నట్టు ప్రకటించింది సామ్‌సంగ్. ఐదురోజుల క్రితమే ఫోల్డబుల్ సామ్‌సంగ్ గెలాక్సీని పరిచయం చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే అసాధ్యం కానిదేదీ లేదని నిరూపించింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ పేరుతో రూపొందించిన ఈ మొబైల్ ఎటు కావాలంటే అటువైపు మొబైల్‌ని మధ్యలోకి మడతబెట్టుకోవచ్చు. దీనికి మూడువైపులా స్క్రీన్ ఉంటుంది. మడతబెట్టినప్పుడు ప్రైమరీ డిస్‌ప్లే 4.6 అంగుళాలు ఉంటుంది. తెరిస్తే 7.4 అంగుళాలు ఉంటుంది. ఓఎల్‌ఈడీ నేచర్ డిస్‌ప్లేతో మంచి నాణ్యతతో చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి మొత్తం ఆరు కెమెరాలు ఉంటాయి. మెయిన్ డిస్‌ప్లే మీద 10 మెగాపిక్సెల్స్, ముందువైపు 16 మెగాపిక్సెల్స్, వైడ్ డిస్‌ప్లేకు 12 మెగాపిక్సెల్స్, 12 మెగాపిక్సెల్స్ టెలీఫొటో కెమెరా, 10+8 మెగాపిక్సెల్స్ కాంబో కెమెరాలతో ఈ ఫోల్డబుల్ మొబైల్ ఆకట్టుకుంటుంది. ఎటువైపు నుంచి ఫొటో తీసినా క్లారిటీగా, అందంగా కనిపిస్తుంది. 4380 బ్యాటరీ సామర్థ్యం గల ఈ మొబైల్ ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి రానుంది. ఇంతకీ దీని ధరెంతో తెలుసా.. రూ. లక్షా 40వేల 619 మాత్రమే.


huawei-mate-x

హువాయ్ మేట్ ఎక్స్

ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో హువాయ్ పలు సంచలనాత్మక ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అందులో భాగంగానే హువాయ్ నుంచి తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనున్నది. హువాయ్ మేట్ ఎక్స్ పేరుతో విడుదల చేయనున్న మొబైల్ మడతబెట్టినప్పుడు 6.6 అంగుళాల తెర, మామూలుగా ఉన్నప్పుడు 8 అంగుళాల తెర ఉండేలా రూపొందించారు. 40 మెగాపిక్సెల్స్ వైడ్ కెమెరా, 16 మెగాపిక్సెల్స్ వైడ్ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ టెలిఫొటో కెమెరాలతో ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ చేశారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో సూపర్ పవర్ చార్జింగ్ కెపాసిటీతో ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందించారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ మొబైల్ ధర రూ. 1,85,285 గా నిర్ణయించారు.


nokia-purware

నోకియా 9ప్యూర్‌వ్యూ

ఐదు కెమెరాలతో ప్రపంచ మొబైల్ మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న సరికొత్త నోకియా మిస్సైల్ ఇది. నోకియా 9 ప్యూర్‌వ్యూ పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ నోకియాకి పూర్వవైభవం తెచ్చే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌లా ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో ఫొటో తీయొచ్చు. 5.99 అంగుళాల పీ-ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఈ మొబైల్ తెరను రూపొందించారు. 2కే స్క్రీన్ రిజల్యూషన్‌తో డిస్‌ప్లే డిజైన్ చేశారు. ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో అందరినీ ఎదురుచూపులకు గురి చేస్తున్న మొబైల్స్‌లో నోకియా 9 ప్యూర్‌వ్యూ ఒకటి. ఐదు కెమెరాలు 12 మెగాపిక్సెల్స్ సోనీ రూపొందించిన కెమెరాలే. ఐదు కెమెరాల్లో మూడింటిని మోనోక్రోమ్ సెన్సార్లు, రెండు ఆర్జీబీ సెన్సర్లతో రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కి అమర్చిన కెమెరాలు 1200 లేయర్ల డెప్త్ ఇన్ఫర్మేషన్‌ని క్యాప్చర్ చేయగలవు. ఇతర స్మార్ట్‌ఫోన్లు అయితే ఎంత ఎక్కువ మెగాపిక్సెల్స్ కెమెరాలు అమర్చినా కేవలం 10 లేయర్ల వరకు మాత్రమే క్యాప్చర్ చేయగలవు. సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సెల్‌తో రూపొందించారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ మొబైల్ ధర రూ.50,000గా నిర్ణయించారు.


fold-mobile

ఇంకా చాలా..

ఇలా ఈ ఏడాది మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్ల గురించి ఏకంగా ఓ పుస్తకమే రాయొచ్చు. పైన చెప్పినవే కాకుండా.. సోనీ ఎక్స్‌పీరియా 10ప్లస్, మైక్సోసాఫ్ట్ హోలో లెన్స్ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్, హానర్ 20, హెచ్‌టీసీ స్మార్ట్ సౌండింగ్, హెచ్‌టీసీ యూ12, యూ13 మొబైల్స్, వన్‌ప్లస్ 7, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10, ఎస్10ప్లస్, ఎస్10ఈ, గెలాక్సీ ఫోల్డ్, గెలాక్సీ వాచ్ ఆక్టీవ్, గెలాక్సీ ఫిట్ ఇలా ఎన్నో ఆకట్టుకునే నెక్ట్స్ జనరేషన్ మొబైల్స్, గాడ్జెట్స్ రానున్నాయి.


xiaomi-m96

జియోమీ ఎంఐ 9 స్పోర్ట్స్

2019 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో జియోమీ సంస్థ ఎంఐ 9 స్పోర్ట్స్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. మూడు కెమెరాలు, మెటల్, గ్లాస్ డిజైన్‌తో ఈ బేస్ మోడల్ రూపొందించారు. 5జీ టెక్నాలజీతో ఎంఐ తయారుచేసిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇది. 6.39 అంగుళాల డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్స్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్స్ వైడ్ సెన్సార్ కెమెరా, 12 మెగాపిక్సెల్స్ జూమ్ కెమెరా, 20 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరాలు అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 40,000 వరకు ఉండే అవకాశం ఉంది.


dual-screenM

ఎల్‌జీ వి50 థిన్ క్యూ

ఎల్‌జీ నుంచి వస్తున్న తొలి 5జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్ ఇది. గతంలోనే మడతబెట్టే మొబైల్స్ రూపొందించిన ఎల్‌జీ, ఇప్పుడు పూర్తిగా తెరతో పాటు మొబైల్‌ని ఫోల్డ్ చేయగలిగేలా రూపొందించిన అద్భుతమైన ఎల్‌జీ ఉత్పత్తి ఇది. మెయిన్ డిస్‌ప్లే 6.4 అంగుళాలు, సెకండరీ డిస్‌ప్లే 6.2 అంగుళాలతో డిజైన్ చేశారు. ఓఎల్‌ఈడీ తెర, క్యూహెచ్‌డీ రిజల్యూషన్‌తో ఈ మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు. 6జీబీ ర్యామ్‌తో 855 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో, మూడు కెమెరాలతో ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ చేశారు. 12 మెగాపిక్సెల్స్ స్టాండర్డ్ కెమెరా, 16 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్స్ 2ఎక్స్ టెలిఫొటో కెమెరాలు ఈ మడతబెట్టే మొబైల్‌లో ఉన్నాయి.

-ప్రవీణ్‌కుమార్ సుంకరి

923
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles