ఇక్కడ.. కొత్త ఏడాది.. కొంగొత్తగా!


Sat,December 29, 2018 10:52 PM

కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. ప్రపంచమంతా ఉరిమే ఉత్సాహంతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నది. ఆయా దేశాల్లో ఇప్పటికే న్యూఇయర్ హంగామా మొదలైంది. కౌంట్‌డౌన్ కూడా మొదలెట్టారు. ఆయా దేశాల ఆచారాల ప్రకారం నూతన సంవత్సరాన్ని జరుపుకొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ప్రజలు నూతన సంవత్సరాన్ని కొంగొత్తగా, వైవిధ్యంగా ఎలా జరుపుకుంటారు? వారి ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో మీరూ తెలుసుకోండి! కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అందుకే ఉరిమే ఉత్సాహంతో.. నూతన వసంతాన్ని నిండు మనసుతో ఆహ్వానిద్దాం. పండుగైనా, ఉత్సవమైనా.. ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకుంటారు. అలాగే నూతన సంవత్సర వేడుకలు కూడా పలు దేశాల్లో పలు రకాలుగా ఉంటాయి. ముందుగా కిరిబాటి ద్వీపంలో ప్రారంభమై.. ఆ తర్వాత అమెరికాలో ముగుస్తాయి. కొన్ని దేశాల్లో ప్రజలు పార్టీలు, పబ్‌లకు అంకితమైతే.. మరికొన్ని దేశాల్లో సకుటుంబ సమేతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ ఎలా చేసుకుంటారంటే..?
tank-bund

తెలంగాణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి న్యూ ఇయర్ వేడుకలకు మన హైదరాబాద్ పెద్ద వేదిక. ప్రస్తుతం తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మన సంస్కృతి ప్రతిబింబించేలా జోర్దార్ ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పటి నుంచే హైదరాబాద్ కుర్రకారులో నయా జోష్ కనిపిస్తున్నది. డిసెంబర్ 31 రాత్రి నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఇందుకు స్టార్ హోటళ్లు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. నూతన సంవత్సర సంబరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన డీజేలు యువతరానికి సరికొత్త మ్యూజిక్‌తో కిక్ ఇస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో కొత్త సంవత్సరం వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి.


india-asia

ఆసియా

మన ఆసియా ఖండంలో చైనాలోని బీజింగ్, హాంగ్ కాంగ్‌లలో, సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్, జకార్తా, బ్యాంకాక్, మయన్మార్, కోకోస్ దీవులు, బంగ్లాదేశ్ , ఢాకా, నేపాల్, భారతదేశం, శ్రీలంక,పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, దుబాయ్‌లలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. భిన్న సంస్కృతులు, భిన్న జాతులు ఉన్న మన దేశంలో నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. బాలీవుడ్ తారలు, సెలెబ్రిటీలతో కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు, స్టార్ హోటళ్లు డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక షోలను ఏర్పాటు చేస్తాయి. జపాన్‌లో ఈ ఉత్సవాన్ని జపనీయులు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఒసైటో, నెంగాజో వంటి ఉత్సవాలు ప్రత్యేకం. ఒసైటో రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు.


heres

న్యూయార్క్

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో టైంస్క్వేర్ వద్ద ప్రతి సంవత్సరం ఒక పెద్ద బాల్‌ను ఎగురవేస్తారు. పాత ఏడాది ఇంకా ఒక నిమిషంలో ముగుస్తుందనగా ఆ బెలూన్‌ను పోల్‌పై నుంచి మెల్లగా కిందకు దింపుతారు. సరిగ్గా పన్నెండు గంటలు కావడంతో ఆ బంతి నేలను తాకుతుంది. ఆ బంతి నేలను తాకీ తాకగానే అందరూ బిగ్గరగా వేలాది స్వరాలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నినదిస్తారు. అంతేకాకుండా అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కొంతమంది మాస్క్‌లతో తమ ముఖాలను కప్పేసుకొని సరిగ్గా పన్నెండు గంటలు కాగానే మాస్కులు తీసేసి ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటారు.


australia

ఆస్ట్ట్రేలియా

ఆస్ట్రేలియన్లు బాణసంచా కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. పెర్త్ నగరంలోని గ్లౌసెస్టర్ పార్క్ ఏటా నూతన సంవత్సర వేడులకలకు ప్రత్యేక ఆకర్షణ. బ్రిస్బేన్‌లో బాణాసంచా హడావుడి మామూలుగా ఉండదు. ఈ బాణసంచా వెలుగును వీక్షించడానికే బ్రిస్బేన్ నది చుట్టుపక్కల నుంచి సుమారు 50 వేల మంది పాల్గొంటారు. ఇక సిడ్నీలో జరిగే లైట్ అండ్ మ్యూజిక్ షో ఉత్సవాల్లో సుమారు 1.5 మిలియన్ ప్రజల పాల్గొంటారు. మెల్బోర్న్, అడిలైడ్, బ్రోకెన్ హిల్, క్వీన్‌ల్యాండ్ తదితర ప్రాంతాల్లో అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.


cap-town

ఆఫ్రికా

ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లోని ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులలో కలిసి అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడి ప్రజలు చర్చ్ గంటలు మోగించడం ద్వారా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. లావిష్ డిన్నర్, మ్యూజిక్, డాన్స్‌లతో యూత్ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లో జరిగే ఉత్సవాలు చాలా ప్రాముఖ్యమైనవి. మినిస్ట్రెల్ కార్నివాల్ పేరుతో జరిగే ఉత్సవానికి కొన్ని వేల మంది హాజరవుతారు. సముద్ర తీరం వెంట ఉన్న డర్బన్ నగర బీచ్‌లు విద్యుత్ కాంతులతో తళుకులీనుతాయి.


touchlight

ఐరోపా

ఐరోపా ఖండంలోని కొత్త సంవత్సర వేడుకల్లో ఒక్కో దేశానిది ఒక్కో ప్రత్యేకత. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో జనవరి 1 నుంచి 6 వరకు సెలవులిస్తారు. ఈ ఆరు రోజులూ ఫుల్ జోష్ ఉంటుంది. 6న ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్ చేయడం ద్వారా వేడుకలకు ముగింపు పలుకుతారు. కొన్ని చోట్ల టార్చ్‌లైట్ వేడుకలుంటాయి. బ్రిటన్‌లో ఆరు రోజులూ ప్రజలు ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తారు. థీమ్ పార్టీలు, సల్సా డాన్స్‌లతో వేడుకలు ఆద్యంతం కన్నుల పండువగా జరుగుతాయి.


new-zealand

న్యూజిలాండ్

ఈ దేశంలో నూతన సంవత్సర వేడుకల్లో బాణసంచా ప్రత్యేక ఆకర్షణ. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే తొలి దేశం న్యూజిలాండ్. ఇక్కడ మరో ప్రత్యేక విషయమేమిటంటే.. ప్రాంతీయంగా ఉన్న పలు ప్రభుత్వ కౌన్సిళ్లు.. న్యూ ఇయర్ పార్టీలను నిర్వహిస్తాయి.
కొన్ని వింత వేడుకలు..
-పనామాలో కొత్త సంవత్సర వేడుకలను ఒక దిష్టిబొమ్మను దహనం చేసి ప్రారంభిస్తారు. ఈ నూతన సంవత్సరం అంతా మంచే జరగాలని కోరుకుంటారు.
-స్కాట్లాండ్‌లో మంచి బహుమతితో బంధువుల ఇళ్లకు వెళతారు.
-ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంట్లో ఉన్న పాత ఫర్నీచర్‌ను బయట పడేస్తారు.
-రొమానియా దేశంలో నూతన సంవత్సరం రోజున ఆవులతో మాట్లాడతారు. అది విజయవంతమైతే, ఇక సంవత్సరం అంతా అలాగే ఉంటుoదని విశ్వాసం.
-చిలీ దేశంలో కొత్త సంవత్సరం రోజున స్మశానాల్లో గడుపుతారు. తమ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారని వారితో మాట్లాడటానికి వెళతారు.
-థాయిలాండ్ దేశంలో బకెట్‌లతో నీటిని ఒకరిపై ఒకరు చల్లుకొని, బూడిద, పౌడర్ రాసుకుంటారు.
-డెన్మార్క్‌లో కుర్చీల పైకి ఎక్కి దూకుతూ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
-జపాన్‌లో 108సార్లు గుడి గంటలు మోగిస్తారు. ఇలా చేయడం అదృష్టంగా భావిస్తారు.
-సైబీరియాలో నీటికింద మొక్కలు నాటి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
-టర్కీలో ఆ ఒక్క రోజు కోసమే ఎరుపు రంగులో ఉండే లోదుస్తులు ధరిస్తారు.
-అమెరికాలో పవిత్ర అలింగనం చేసుకుంటూ దుష్ట ఆత్మలను తరిమికొట్టడానికి పెద్దపెద్దగా శబ్దాలు చేస్తారు.
-ఇంగ్లాండ్‌లో కూడా నూతన సంవత్సరం ప్రారంభ సమయంలో వచ్చే తొలి అతిథి తమకు కానుకలను తెచ్చివ్వాలని కోరుకుంటారు.
-స్పెయిన్, పెరూ దేశాల్లో 12 నెలలు తమకు అదృష్టం కలగాలని కోరుకుంటూ 12 ద్రాక్షలను తింటారు. పెరూలో 13వ ద్రాక్షను కూడా తింటారట. ఆ ద్రాక్ష తమ అదృష్టాన్ని బీమా చేయిస్తుందని వారి నమ్మకం.
-గ్రీస్‌లో ఓ నాణేన్ని లోపల ఉంచి బ్రెడ్‌ను తయారు చేస్తారు. బ్రైడ్‌ను కట్ చేసినప్పుడు ఆ నాణెం మూడో ముక్కలో ఉంటే కలిసొస్తుందని నమ్మకం.
-నార్వేలో బియ్యంలో అల్మండ్ పెట్టి వండుతారు. ఎవరికి ఆల్మండ్ వస్తే వారికి సంపద కలుగుతుందని నమ్ముతారు.
-చైనాలో కొత్త సంవత్సరం ప్రారంభంరోజున ఇంట్లో కత్తిని వాడకుండా విందు తయారు చేస్తారు.
-డప్పు రవి

1058
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles