ఇంత కోపమైతే ఎలా?


Wed,April 12, 2017 11:35 PM

ANGRY
నాకు 32 సంవత్సరాలు. 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఒక ఐటీ కంపెనిలో పనిచేస్తున్నాను. నేను ప్రతి నిమిషం ఒత్తిడిలో ఉన్నట్టుగానే అనిపిస్తున్నది. వృత్తిరీత్యా షిఫ్ట్‌ల్లో కూడా పనిచెయ్యాల్సి ఉంటుంది. అందువల్ల బాబుతో సమయం గడపడానికి కూడా వీలుపడడం లేదు. నా మూడ్ చాలా వరకు డల్‌గా ఉంటుంది. చాలా త్వరగా కోపం కూడా వస్తున్నది. బాబు చేసే కొద్ది పాటి అల్లరిని కూడా భరించడం నావల్ల కావడం లేదు. అందువల్ల కోపంతో ఊగిపోతున్నాను. నిద్ర కూడా సరిగా ఉండడం లేదు ఫలితంగా పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. ఆకలి కూడా తక్కువగా ఉంటున్నది. నా సమస్యలకు కారణం ఏమిటి? నాకు మంచి సలహా ఇవ్వగలరు.
మనీషా, హైదరాబాద్
మీ ఉత్తరం చదివిన తర్వాత ఒత్తిడి మీ వ్యక్తిగత జీవితాన్నే కాదు వృత్తి జీవితాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తోందని అర్థం అవుతున్నది. ఈ ఒత్తిడి ఇలాగే కొనసాగితే అది ఆందోళన, డిప్రెషన్‌గా కూడా మారవచ్చు. మీరు చెబుతున్న ఆకలి మందగించడం, నిద్ర తగ్గిపోవడం, పని మీద శ్రద్ధ తగ్గడం వంటివన్నీ డిప్రెషన్ లక్షణాలే. ఈ స్థితి ఇలాగే రెండు వారాలకు మించి కొనసాగి మీ రోజు వారీ పనులకు ఆటంకంగా పరిణమించితే మాత్రం మీరు వెంటనే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడం మంచిది. ఒక్కోసారి భావోద్వేగాలు ఏ కారణం లేకుండానే అదుపు తప్పుతుంటాయి. ఇది మెదడులో జరిగే రసాయన ప్రక్రియల్లో జరిగే చిన్న మార్పు వల్ల కలుగుతుంది. ఇలాంటి స్థితికి తప్పకుండా చికిత్స చెయ్యవచ్చు. మీ పరిస్థితిని పూర్తిగా పరీక్షించి మీకు కౌన్సెలింగ్‌తో పాటు కొంత మందులు కూడా అవసరం పడొచ్చు. మీకు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ను వీలైనంత త్వరగా సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.
డాక్టర్ దల్జీత్ కౌర్
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
కాంటినెంటల్ హాస్పిటల్స్
హైదరాబాద్

738
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles