ఆ మూడు గంటలే కీలకమా?


Mon,December 17, 2018 01:43 AM

మా నాన్న వయసు 50 సంవత్సరాలు. రాత్రి సమయంలో పక్షవాతం వచ్చింది. ఒక కాలు, చేయి పనిచేయకుండా అయిపోయింది. అయితే వచ్చిన వెంటనే మూడు గంటల్లో సరైన చికిత్స అందిస్తే బాగుపడేవారన్నారు. నిజంగా ఆ మూడు గంటలు అంత కీలకమా? పైగా డాక్టర్లు టిష్యూ ప్లాస్మినోజన్ ఇంజక్షన్ గురించి మాట్లాడడం విన్నాను. ఈ ఇంజక్షన్ వల్ల పక్షవాతం నయమవుతుందా తెలియజేయగలరు?
- భాగ్యలక్ష్మి, నర్సంపేట

couns
పక్షవాతం ఒక భయంకర విపత్తు. మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వల్ల గానీ, రక్తనాళాలు చిట్లడం వల్ల గానీ పక్షవాతం వస్తుంది. మెదడుకు అందాల్సినంత రక్తం అందకపోవడం వల్ల మెదడులోని కణాలు చనిపోవడం వల్ల వచ్చే పక్షవాతాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. అకస్మాత్తుగా కాలు, చేయి పనిచేయకుండా పోవడం, మూతి వంకరపోవడం, మాట్లాడలేకపోవడం, చూపు తగ్గిపోవడం, అకస్మాత్తుగా భరించలేని తలనొప్పి రావడం, తల తిరుగడం, వాంతులు కావడం, నడువలేకపోవడం.. ఇవన్నీ పక్షవాతం లక్షణాలే. ధూమపానం, బీపీ, మధుమేహం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక కొవ్వు, జన్యుపరమైన కారణాల వల్ల కూడా పక్షవాతం రావచ్చు. మెదడుకు రక్తం సరఫరా తగ్గినప్పుడు క్షణక్షణానికీ మెదడులోని కణాలు (న్యూరాన్లు) ఆక్సీజన్ అందక చనిపోతూ ఉంటాయి. పక్షవాతం వచ్చిన మూడు నాలుగు గంటల తర్వాత ఈ కణాలు తిరిగి కోలుకోలేని రీతిలో చనిపోతాయి.

ఆ తర్వాత వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ కణాలను తిరిగి బతికించలేరు. కాబట్టి పక్షవాతం వచ్చిన మొదటి మూడు గంటల్లోనే ఆసుపత్రికి వెళితే వైద్యులు టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేగర్ అనే మందులను ఇంజక్షన్ ద్వారా రోగి శరీరంలోకి ప్రవేశపెడుతారు. దీనివల్ల రక్తనాళాల్లో ఏర్పడిన పూడికలు తొలిగిపోతాయి. దీంతో మళ్లీ యథావిధిగా మెదడుకు రక్తం సరఫరా అయి అప్పటికే దెబ్బతిన్న మెదడులోని కణాలు తిరిగి కోలుకుంటాయి. టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ మందు ఇచ్చిన తర్వాత 50 శాతం రోగుల్లో వెంటనే కాలు, చెయ్యి పని చేస్తాయి. లేదా సమస్య జటిలం కాకుండా ఆగిపోతుంది. ఫలితంగా పక్షవాతం వచ్చినప్పటికీ వారు త్వరితగతిన కోలుకునే అవకాశాలు ఏర్పడుతాయి. అయితే పక్షవాతం వచ్చిన తర్వాత మూడు గంటల సమయం ఉంది కదా అని అలసత్వం ప్రదర్శించకూడదు. పక్షవాతం వచ్చిన వ్యక్తి శరీర బరువును బట్టి ఈ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ 45 నుంచి 60 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఇంజక్షన్ అతి ఖరీనదైనది. దీనిని తీసుకోవడం వల్ల 50 శాతం రోగుల్లో పక్షవాతం పూర్తిగా నయమయ్యే అవకాశముంటుంది. ఈ ఇంజక్షన్ వల్ల మెదడులో రక్తస్రావం కావడం అరుదుగా జరుగవచ్చు. అయితే కేవలం 4 నుంచి 7 శాతం మందిలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ ఇంజక్షన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు కచ్చితంగా సీటి స్కాన్ యంత్రం ఉండి, 24 గంటలు న్యూరాలజిస్ట్ అందుబాటులో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లడం మంచిది. అలాగే అక్కడ ఉండే డాక్టర్‌కి ఈ ఇంజక్షన్ ఇవ్వడం గురించి పూర్తి అవగాహన ఉండాలి.

డాక్టర్ లలిత
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్

987
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles