ఆవిష్కరణల జాతర-సీఈఎస్ 2019


Wed,January 9, 2019 01:51 AM

ఎన్నో ఆవిష్కరణలు. మరెన్నో అద్భుతాలు.. గాలిలో ఎగిరే టెక్నాలజీ, కోరుకున్న వస్తువులను గాలిలో ఇంటికి తెచ్చే టెక్నాలజీ, డ్రైవర్ అవసరం లేకుండానే నడిచే వాహనాలు, ఖరీదైన కార్లు, బైకులు, టీవీలు, మొబైల్స్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో ఆవిష్కరణల ప్రదర్శనశాల సీఈఎస్ 2019. ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పోటీపడి తయారుచేసిన సాంకేతిక అద్భుతాల జాతర విశేషాలు ఈవారం సంకేతలో..
SANTKETHA
అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ప్రపంచ ఎలక్ట్రానిక్ జాతర ప్రారంభమైంది. ప్రఖ్యాత కంపెనీలన్నీ ఎదురుచూసే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2019
(టెక్‌ఫెయిర్) ఈ నెల 8న అట్టహాసంగా మొదలైంది. ఈ నెల 11 వరకు కొనసాగనున్న సీఈఎస్ 2019లో అధునాతన టెక్నాలజీతో రూపొందించిన పలు ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. ఆకట్టుకునే ఫీచర్లు, అబ్బురపరిచే ఎలక్ట్రానిక్ వస్తువులు, 5జీ టెక్నాలజీతో తయారుచేసిన పలు గాడ్జెట్లు, అధునాతన ఫీచర్లతో రూపొందించిన పలు టెక్ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు.

1.మడతబెట్టే టీవీ..

lg-tv
ఎల్‌జీ కంపెనీ తయారుచేసిన 65 అంగుళాల టీవీ ఈ షోలో మార్కెట్‌కు పరిచయం కానుంది. 65 అంగుళాల డిస్‌ప్లే, 4కే సిగ్నేచర్ ఓఎల్‌ఈడీ తెరతో ఈ టీవీని రూపొందించారు. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్, యాపిల్ ఎయిర్‌ప్లే వంటి ఫీచర్ సపోర్టుతో పాటు డాల్బీ అట్మాస్ ఫీచర్ కూడా ఉంది. దీంతో పాటే 88 అంగుళాల 8కే హెచ్‌డీ టీవీ కూడా సీఈఎస్ 2019లోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

2.స్మార్ట్ సూట్‌కేస్

suitcase
చూడడానికి మామూలుగానే కనిపిస్తున్నా ఈ సూట్‌కేస్ చాలా ప్రత్యేకమైనది. పట్టుకోవాల్సిన అవసరం లేకుండానే మనతో పాటు నడుస్తుంది. కింద అమర్చిన వీల్స్ ఆధారంగా మనల్ని ఫాలో అవుతుంది. దీన్ని ఎవరూ దొంగిలించలేరు కూడా. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాక్‌సిస్టమ్ దీనికి అమర్చడంతో మనం తప్ప ఎవరూ ఈ సూట్‌కేస్ తెరువలేరు.

3.అండర్‌వాటర్ డ్రోన్

drone
మామూలుగా అయితే కెమెరాల మీద నీటిచుక్క కూడా పడనివ్వం. వర్షంలో కెమెరా బయటకు తీయాల్సి వస్తే అన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ.. ఈ కెమెరా అలా కాదు. నీటిలోపల కూడా రికార్డు చేయగలదు. మిటో కంపెనీ తయారుచేసిన ఈ అండర్‌వాటర్ డ్రోన్ 4కే కెమెరా ఈ సీఈఎస్ 2019లో విడుదల చేస్తున్నారు.

4.స్మార్ట్‌బీట్

Smartbeat
పిల్లలు ఉన్నచోట ఉండరు. కనురెప్ప కొట్టినంత సమయంలోనే ఏదో ఒక చిలిపి పని చేసేస్తారు. కొన్నిసార్లు ఆ చిలిపి పనులే వాళ్ల పాలిట ప్రమాదలవుతుంటాయి. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్లు ప్రతీ క్షణం వారిని చూస్తూ అప్రమత్తంగా ఉండాలంటే ఎంతైనా కష్టమే. అందుకే టెక్నాలజీ వారికి ఓ బహుమతి ఇచ్చింది. అదే.. స్మార్ట్‌బీట్. పిల్లల కదలికలను గమనిస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడే పరికరం ఇది. వారి కదలికలు, శ్వాసతీరు గమనిస్తూ ఏమాత్రం తేడాగా అనిపించినా తల్లిదండ్రులకు మెసేజ్ ద్వారా అప్‌డేట్ చేసి అప్రమత్తం చేస్తుంది.

5.బట్టలు మడతబెట్టే పరికరం

fold
బట్టలు ఉతకడం ఒకింత పనైతే, వాటిని ముడతలు లేకుండా మడతపెట్టడం ఒక ప్రహసనం. సీఈఎస్ 2019 మీ బట్టలను చక్కగా ఐరన్ చేసి మడతపెట్టే పరికరాన్ని పరిచయం చేస్తోంది. మరికొద్ది రోజుల్లో ఫోల్డిమేట్ పేరుతో ఈ పరికరం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి రానుంది.

6.స్లీపింగ్ రోబోట్

sleeping-robot
రోజూవారి పనిలో పడి కంటికి సరిగ్గా నిద్రలేకుండా ఒత్తిడికి గురవుతున్నవారు చాలామంది ఉన్నారు. వారికి ఈ సీఈఎస్ సుఖమైన నిద్రను అందించే రోబోను పరిచయం చేస్తున్నది. దీన్ని పక్కన పెట్టుకొని పడుకుంటే హాయిగా జోలపాడుతూ సుఖంగా నిద్రపోయేందుకు సహకరిస్తుంది.

7.స్మార్ట్ హెల్మెట్

helmet
అతివేగంతో బైక్ నడిపి ప్రమాదాల బారినపడే రైడర్లకు ఈ స్మార్ట్ హెల్మెట్ సీఈఎస్ 2019 అందిస్తున్న ఓ వరం. ప్రమాదాలు జరుగకుండా అలర్ట్ చేయగలదు. ఒకవేళ ప్రమాదం జరిగితే వెంటనే మన ఫోన్ కాంటాక్ట్స్‌లో నెంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా సందేశాన్ని పంపించగలదు.

8.హార్లీడేవిడ్‌సన్

harly
బైక్ రైడర్లకు, రైడింగ్ ప్రియులకు ఇది శుభవార్త. హార్లీడేవిడ్‌సన్ సీఈఎస్ 2019లో సరికొత్త టెక్నాలజీతో ఓ కొత్త బైక్‌ను పరిచయం చేస్తున్నది. లైవ్‌వైర్ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ పేరుతో మూడు సెకన్లలో అరవై కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గేర్‌షిఫ్టింగ్ అడగకుండానే నిర్ణీత వేగాన్ని చేరుకోగల టెక్నాలజీ ఈ బైక్ ప్రత్యేకత. పానసోనిక్ అటోమోటివ్స్‌తో సహకారంతో ఈ బైక్ రూపొందించింది.

సీఈఎస్ 2019 విశేషాలు

ces-show-floor
-యాభయేండ్లుగా ఈ సీఈఎస్ ప్రతీ ఏడు ఆవిష్కర్తలకు వేదికగా ఈ గ్లోబల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నది.
-ఈ ఎగ్జిబిషన్‌లో 4500 కంపెనీలు పాల్గొంటున్నాయి.
-ప్రదర్శన జరిగే నాలుగు రోజుల్లో 250 సెమినార్లు జరుగుతాయి. ఈ సెమినార్లలో రాబోయే తరం టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లలో మార్పులు, టెక్నాలజీ డెలివరీ సిస్టమ్, టెక్ అప్‌డేట్స్ గురించి చర్చిస్తారు.
-150 దేశాలు ఈ ఎలక్ట్రానిక్ ప్రదర్శనలో పాల్గొంటాయి.
-దాదాపు లక్షా 80వేల మంది ఈ ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటారు.
-నాలుగు రోజుల ప్రదర్శన ద్వారా 398 బిలియన్ డాలర్ల మార్కెట్ జరుగనుందని నిర్వాహకుల అంచనా.
-31 కేటగిరీల్లో ఆవిష్కరణలు, ప్రదర్శనలు జరుగుతాయి.
-లాస్‌వెగాస్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 3.2 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రదర్శన జరుగుతున్నది.

ఇంతే కాదు.. యాపిల్ తన నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్‌ని ఎక్స్1 రెండర్స్ మొబైల్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నది. హెచ్‌టీసీ రెండు వీఆర్ హెడ్‌సెట్‌లను ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో పరిచయం చేస్తున్నది. కొన్ని వేల కంపెనీలు లక్షల సంఖ్యలో భవిష్యత్తును కండ్లకు చూపే టెక్నాలజీ గాడ్జెట్లను ఈ సీఈఎస్ 2019లో ప్రదర్శిస్తున్నారు.
-ప్రవీణ్‌కుమార్ సుంకరి

1967
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles