ఆరోగ్య సమస్యలకు..సుమన్ సాయం!


Tue,March 5, 2019 03:21 AM

చిన్నా.. పెద్దా.. రోగం ఏది వచ్చినా.. దవాఖానల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోవాల్సిందే! ఏ రోగానికి ఎక్కడ వైద్యం చేస్తారనేది అందరికీ తెలియలకపోవచ్చు. ఒకవేళ వెళ్లినా దవాఖానలో డాక్టరు సరిగా చూడకపోతే.. మరో ఆసుపత్రికి ఎక్కడికి వెళ్లాలి.. ట్రీట్‌మెంట్ ఎలా చేయించుకోవాలి.. ఇలాంటి సందేహాలతో బుర్ర వేడెక్కుతుంది.. ఈ అన్ని ప్రశ్నలకు నేను సమాధానమిస్తానంటున్నది సుమన్ సాయని. ఏ సాయం కావాలన్నా.. రోగి పరిస్థితి అంచనా వేసి చెబుతానంటున్నది.. మల్టీనేషనల్ మెడికల్ టూరిజంలోనే మొదటి మహిళగా పేరుగాంచింది. మరి ఆమె చేసే సాయం గురించి.. ఆమె విశేషాలు తెలుసుకుందాం..
Vanaja
కూడు.. గూడు.. గుడ్డ.. వీటికి ఏ లోటూ లేకుండా బతుకాలి అంటారు పెద్దలు. కానీ ఇప్పుడు విద్య, వైద్యం, సాంకేతికత లేకుండా రోజు గడువదన్నది అసాధ్యం. ఇవన్నీ సంపాదించాలంటే మన ఆరోగ్యం బాగున్నప్పుడే సాధ్యమవుతుంది. దానికోసం ఎప్పటికప్పుడు శ్రద్ధ లేకపోతే కోరి కష్టాలు తెచ్చుకోవాల్సిందే! ఒకవేళ ఆరోగ్యం బాగా లేకపోతే ఒక డాక్డర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఏదో నోరు తిరుగని రోగం గురించి చెప్పేస్తాడు. దానికి మనం భయపడి ట్రీట్‌మెంట్లు మొదలుపెడుతాం. కానీ అలా చేయకూడదంటున్నది సుమన్ సాయని. కచ్చితంగా సెకండ్, థర్డ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఎలాంటి ట్రీట్‌మెంట్ అయినా కొనసాగించాలనేది ఆమె ఆలోచన. కానీ ప్రతీ డాక్టరు దగ్గరకి వెళ్లేకంటే అన్ని సమస్యలకు ఒకే చోట పరిష్కారం లభించాలని ఆ దిశగా కృషి చేస్తున్నది సుమన్. ఆమె తన సాయంతో ఎంతో కొంత మంది ప్రాణాలు నిలబడితే చాలు అని కోరుకుంటున్నది.

మాట సాయం..

సుమన్ సాయని 500 హాస్పిటల్స్ నుంచి తన దగ్గరకు వచ్చే పేషంట్లకి సెకండ్ ఒపీనియన్ ఇస్తుంది. 25,000 మందికి పైగా డాక్టర్లు ఆమెకు తెలుసు. పెద్ద హాస్పిటల్స్‌కి వచ్చే పేషంట్ల రిపోర్ట్స్ అన్నీ ఈమె వద్దకి రావాల్సిందే. వారికి ఎలాంటి రోగం? ఎంత ఖర్చు పెట్టగలరు? అని అంచనా వేస్తుంది. ఆ తర్వాత రోగికి ఐదు ఆప్షన్లు ఇస్తుంది. ఎక్కడికెళ్తే ఎంత ఖర్చవుతుందో పూర్తి వివరాలు పేషెంట్ తరుపు వారికి తెలుపుతుంది. ఐదింటిలో ఒక డాక్టర్‌ని ఎంపిక చేసుకున్న తర్వాత వీరిని ఫలానా డాక్టర్ వద్దకు పంపించండని చెబుతుంది. పేషెంట్‌కి నచ్చిన డాక్టర్ వద్దకే వీరిని పంపిస్తుంది. డాక్టర్‌కి, పేషంట్‌కి మధ్య సుమన్ వారధిలా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించే సరైన డాక్టర్‌ని గైడ్ చేయడమే ఈమె వృత్తి.

సంధానకర్తగా..

సుమన్ సాయని పుట్టి పెరిగింది వైజాగ్‌లోనే. చదువంతా అక్కడే! తండ్రి బిజినెస్ చేస్తుంటాడు. సుమన్‌ని డాక్టర్‌గా చూడాలని ఆశ పడింది తల్లి. మామూలు డాక్టర్ అయితే ఏముంటుంది.. మనుషుల మనోభావాలను అంచనా వేయాలనుకుంది. అందుకే సైకాలజీ వైపు అడుగులు వేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో సైకాలజీ, సోషల్ వర్క్, ఎడ్యుకేషన్‌లో మూడు ఎమ్‌ఏలు చేసింది. ఆ రోజుల్లో గిరిజన ప్రజలు పని లేక ఖాళీగా తిరుగుతుండేవారు. వారికి సరైన పని కల్పించాలనుకున్నది సుమన్. చదువు పూర్తయ్యాక కొన్ని స్వచ్ఛంద సంస్థలలో పనిచేసింది. దీని కోసంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో గిరిజనులను కలిసింది. అడవుల్లో దొరికే వనరులతో ఔషధాల్ని తయారుచేయడం నేర్పించి, వారికి జీవనోపాధి కల్పించింది. కొన్నిరోజులు గిరిజనులు చేసిన ఔషధాలను తగిన రేటుకి ఇతర ప్రదేశాలకు ఎగుమతి చేసింది సుమన్. తర్వాత అవేర్ గ్లోబల్ హాస్పిటల్‌లో పేషెంట్ హక్కులు, బాధ్యతలకి హెడ్‌గా పనిచేసింది. సైకాలజీ చేసిన అనుభవంతో వైద్యానికి సంబందించిన సలహాలు, సూచనలు ఇస్తుండేది. సైకో, సోషల్, ఫైనాన్షియల్ అండ్ ఎథికల్ కౌన్సెలింగ్ చేసింది. ఈ క్రమంలో పేషెంట్లకి ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలుసుకున్నది. ఈ అనుభవమే ఇవాన్ హెల్త్ సర్వీసులు అందించడానికి దోహదపడింది.
Vanaja!

సొంత మనిషిలా..

ఆరోగ్య సమస్య వస్తే ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలో చాలామందికి తెలియదు. అలాంటి వారికి ఇవాన్ సంస్థను సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యను బట్టి సరైన డాక్టర్ ఎవరో చెప్తారు. ఈ సంస్థ ఇక్కడే కాకుండా విదేశాల్లో సర్వీసులు అందిస్తున్నది. దీనికి సుమన్ సహవ్యవస్థాపకురాలు. పేషంట్‌కి కావాల్సిన చికిత్సకు ఎంత ఖర్చవుతుందనే విషయంలో పది కొటేషన్లు ఇస్తారు. అంతేకాకుండా విదేశాల్లో ఉండేవారు ఇక్కడి వైద్యం కావాలంటే ఏ హాస్పిటల్లో చికిత్స చేయించుకోవాలో నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. పేషెంట్‌కి అవసరమయ్యే మందులు, ఇంజెక్ష న్ల నుంచి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటారు. వైద్యం పూర్తయ్యాక పేషెంట్లు ఏ దేశంలో ఉంటే అక్కడికి మందులు సరఫరా చేస్తామని సుమన్ సాయని చెబుతున్నది. దీనికంటే ముందు గుమ్మంలోకి వైద్యాన్ని అందిస్తే బాగుంటుందనుకున్నది. డెస్టినీ హెల్త్ కేర్ సర్వీస్‌లను 2013లో ప్రారంభించింది. అత్యవసర కేసులు కాకుండా మిగతా అన్ని జబ్బులకు ఇంటి వద్దకే వైద్యుడ్ని పంపి వైద్యం చేయిస్తారు. దీని తర్వాతే ఇవాన్ హెల్త్‌కేర్ సర్వీస్‌లు మొదలుపెట్టింది. ఇవాన్ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న సుమన్ ఫ్యామిలీ కౌన్సెలింగ్, చైల్డ్ గైడెన్స్ సెంటర్‌లో, సైకోమ్యాట్రిక్స్‌లో కన్సల్టెంట్ సైకాలజిస్ట్‌గా కూడా పనిచేసింది.

నాణ్యమైన వైద్యం..

బంగ్లాదేశ్, శ్రీలంక, నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి కొన్ని దేశాల్లో ఎంత ఖర్చు పెట్టినా నాణ్యమైన వైద్యం దొరకదు. అక్కడి వారందరూ మన దేశానికే వచ్చి నాణ్యమైన వైద్యాన్ని పొందుతున్నారు. ఈ రకంగా మనదేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. రోగం వచ్చాక హాస్పిటల్‌కి వెళ్లడం కంటే ముందుగా జాగ్రత్త తీసుకుంటే మంచిది. అందుకు అల్లోపతి వైద్యం కాకుండా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకునే వైద్యాన్ని ప్రమోట్ చేస్తున్నాం. గిరిజన గ్రామాల్లో చేసే ఇంటివైద్యాన్ని ఒక దగ్గరకు చేర్చి వైజాగ్‌లో అరకువ్యాలీ దగ్గర హెర్బల్ గార్డెన్స్ అభివృద్ధి చేశాం. మరిన్ని మెరుగైన సేవలు కావాలంటే నా వాట్సప్ నెం. 8367223503కి సంప్రదించండి అని చెబుతున్నది సుమన్ సాయని.

అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటా..

కుటుంబం, కౌన్సెలింగ్, ఈ పనులు చక్కగా నిర్వర్తిస్తుంది సుమన్. కార్పొరేట్ డాక్టర్లు, వీసా సెంటర్, పేషెంట్ల పనులు చూసుకునేందుకు తను తయారుచేసిన ఒక్కో బృందం ఒక్కో పనిని చేస్తుంది. నలుగురితో ప్రారంభమైన తన సంస్థలో 50 మంది ఉద్యోగులున్నారు. ఒక్కో దేశంలో పదిమంది చొప్పున పనిచేస్తుంటారు. కుటుంబ విషయాలు పక్కన పెడితే సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా ఒత్తిడి ఉంటుంది. వీటన్నింటినీ మనుసులో పెట్టుకుంటే ముందడుగు వేయలేం. ఎప్పటి విషయాలు అప్పుడు మర్చిపోతూ అప్‌డేట్ అవుతూ ఉండాలి. అపుడే అనుకున్న సక్సెస్ సాధిస్తారు అంటున్నది. ప్రస్తుతం సుమన్ సాయని డెస్టినీ హెల్త్ కేర్, ఇవాన్ సర్వీసులను పనులన్నింటినీ పక్కనపెట్టి ఫ్యూచర్ ప్లానింగ్‌లో ఉన్నారు. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్‌ని ప్రారంభించాలనే ఆలోచనలోనూ ఉన్నారు.
-వనజ వనిపెంట బి. సంజయ్‌చారి

943
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles