ఆరోగ్య విజ్ఞానశాస్త్రం పక్వానికి ప్రకృతి మంత్రం!


Tue,February 19, 2019 01:42 AM

విషరసాయన విధానాలకు తిరుగులేని విరుడుగా సహజ శాస్త్రీయ పద్ధతిలోనే కాయలను మాగేసే (Ripening natural way) పౌడర్ ఒకటి కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఎంజైమ్స్ (కణ్వాలు) నుండి విడుదలయ్యే ఎథిలీన్ వాయువును కాయలపైన ప్రసరింప జేయడం ద్వారా శాస్త్రవేత్తలు దీనిని సాధించారు. ఇదెంతో సురక్షితమేకాక నాణ్యమైందని, పోషకాలు, రుచిలోనూ దీనితో పక్వపెట్టిన పండ్లు ప్రకృతి ఫలాలను పోలి ఉన్నట్టు వారు చెబుతున్నారు. ఐతే, ఈ విలక్షణ ఆవిష్కరణ వెనుక ఉన్నది ఏ అమెరికాలోని వారో కాదు, మన తెలంగాణకు చెందిన యువ రైతులు!
Mango
ఎన్-రైప్ పేరున హైదరాబాద్‌కు చెందిన హెయిటెన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ (Heighten Innovative Solutions) వారు ఇటీవల విడుదల చేసిన ఎథిలీన్ వాయువుతో కూడిన చూర్ణం (Powder with encapsulation of ethylene gas) పూర్తిగా ప్రాకృతిక ధర్మాల ఆధారంగానే రూపొందినట్టు సంబంధిత పరిశోధకులు ప్రకటించారు. దారుణ అనారోగ్యాలతో ప్రాణాలకే ప్రమాదకరంగా పరిణమిస్తున్న క్యాల్షియం కార్బైడ్ విషపు విధానాలకు ఇక స్వస్తి చెప్పవలసిందేనని వారు అంటున్నారు. ఈ అద్భుత ఆవిష్కరణను ఎవరు సాధించారు? ప్రజల ఆరోగ్యానికి అదిచ్చే భరోసా ఏమిటి? అన్నవి ప్రస్తుత పరిశీలనాంశాలు.

బలవర్దకమైన, ఆరోగ్యకరమైన పోషక విలువలకు నిలయాలు పండ్లు. అవి మనకు ప్రకృతి ప్రసాదించిన అమృత గుళికలు. ఆదిమానవుల నుంచి ప్రాచీన ఋషుల వరకూ, పరిపక్వమైన మన భారతీయ జీవన విధానంలోని ఆయుష్షు, ఆరోగ్య రహస్యాలన్నీ కాయలు, పండ్లు, కందమూలాలు, ఆకులు, వనమూలికలలోనే దాగున్నాయి. ఐతే, ఏ కాయ అయినా ప్రకృతి సిద్ధంగా పండినప్పుడే దానికంతటి పోషకాలు సమకూరుతాయి. కానీ, గత నాలుగైదు దశాబ్దాలుగా జరుగుతున్నదేమిటి? హద్దులు దాటుతున్న భూతాపంతో వాతావరణ మార్పులు ఒకవైపు, మనిషి స్వార్థపు పోకడలు మరోవైపు మితిమీరి పోవడంతో ప్రకృతి సంపదలు గొడ్డుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు విషరసాయనిక పక్వ విధానాలు.

ప్రకృతి సిద్ధమైన ఫలాలు, సంపద ఎక్కడా అని వెతుక్కొనే దుస్థితి గత కొన్నేళ్లుగా ఏర్పడింది. ఏ సీజన్‌లో వచ్చే పండ్లను ఆ సీజన్‌లో తినాలనుకునే వారికి ఇదొక శరాఘాతం. పరిశ్రమల వాడకానికే పరిమితం కావాల్సిన క్యాల్షియం కార్బైడ్‌ను కడుపులోకి పంపించుకొనే దయనీయ దురవస్థలోకి మనం నెట్టివేయబడ్డాం. ఈ తరహా విషరసాయన సంయోగ ఘన పదార్థాలతో కాయల్ని పక్వపరుస్తున్న పోకడలు అనేకమందిని భయభ్రాంతులను చేస్తున్నాయి. అసలు మార్కెట్లో పండ్లు కొని తినాలంటేనే వెనుకంజవేసే స్థితి ఒకవైపు, తెలిసో తెలియకో తింటూ దీర్ఘకాలంలో తమకు తెలియకుండానే వ్యాధుల పాలవుతున్న వారు మరొకవైపు. అమ్మకానికి వుంటున్న పచ్చని పండ్లలో ఏవి సహజమైనవో, ఏవి విషరసాయనాలతో పక్వబెట్టినవో తేల్చుకోలేని గడ్డు పరిస్థితి. పెరిగిన డిమాండ్‌ను తట్టుకోవడానికో లేదా అధిక లాభాలకోసమో కాయల్ని పండ్లుగా మార్చడానికి చాలామంది క్యాల్షియం కార్బైడ్‌ను విరివిగా వినయోగించడం గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నది. ఇలా మాగబెట్టిన పండ్లను తినడం వల్ల అల్సర్ల నుంచి క్యాన్సర్ల వరకు అనేక రకాల వ్యాధులు కబళించే ప్రమాదం ఉందని నిర్ధారణ కావడంతో ఎన్నో దేశాలలో దాని వాడకాన్ని నిషేధించారు కూడా.

చెట్లపైనే మాగిన పండ్లకు తిరుగుండదు. చిలకలు, పక్షులు కొరికిన పండ్లు ఎంత తియ్యనో మనకు తెలుసు. ఏ పండైనా మాగాలంటే దానిలోని ఎంజైమ్స్ (కణ్వాలు: జీవరసాయనిక ప్రక్రియను వేగవంతం చేసే ప్రోటీన్లు) ఎథిలీన్ వాయువును విడుదల చేయాల్సి ఉంటుంది. గతంలో చెట్టుమీద పూర్తిగా కాసిన కాయలను తెంపి ఒక చీకటి గదిలో లేదా గంపలలో పోసి, వాటిపై ఆకులు కప్పేవారు. మూన్నాలుగు రోజుల్లో అవి మాగేవి. రాన్రాను అవి పెద్ద మొత్తంలో కావాల్సిన అవసరం ఏర్పడడంతో కృత్రిమంగా మాగపెట్టడం మొదలైంది. దీనికోసం ప్రత్యేక గదులలో ఉష్ణోగ్రత, తేమలను నియంత్రిస్తూ ఎథిలీన్ వాయువుతో కూడిన చాంబర్స్ (గదులు)ను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఫలితంగా చౌకగా అత్యల్ప ధరకు అందుబాటులో వుండే క్యాల్షియమ్ కార్బైడ్ వినియోగం మొదలైంది. ఒక్క మన తెలంగాణ, దేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇదే పరిస్థితి.

మన దేశంలోనూ మామిడి వంటి అన్ని రకాల కాయలను మాగేయడానికి క్యాల్షియం కార్బైడ్ వాడకాన్ని ప్రభుత్వాలు నిషేధించినా అది కచ్చితంగా అమలవుతున్నదా అన్నది ఇంకా ప్రశ్నార్థకమే. దీనికంతటికినీ ప్రకృతిదాయకమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయ విధానం అందుబాటులో లేకపోవడమే ప్రధాన సమస్య. కాగా, గత కొన్నాళ్లుగా క్యాల్షియం కార్బైడ్ స్థానంలోకి అక్రమంగా చొరబడిన చైనాకు చెందిన ఎథిలీన్ రైపనర్ పౌడర్‌లోని నాణ్యతా విలువలు, శాస్త్రీయ ప్రమాణాలు పూర్తి సురక్షితంగా లేవన్న విమర్శలూ వినబడుతున్నాయి. అది పేరుకు ఎథిలీన్ అయినా దాని తయారీపై భరోసా, విశ్వసనీయతా లేవు. మన దేశంలో చైనా రైపనర్ వాడకాన్నీ నిషేధించినట్టు తెలుస్తున్నది. అయినా, అడ్డదారులలో క్యాల్షియమ్ కార్బైడ్, చైనా పౌడర్ల వాడకం జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి.
Main-box
ఈ తరుణంలోనే ఇటీవల హైదరాబాద్‌కు చెందిన పై సంస్థ ఎన్-రైప్ పేరున ఎథిలీన్ వాయువుతో కూడిన పిండిపదార్థ చూర్ణం సాచెట్‌ను విడుదల చేసింది. ఇది పూర్తిగా సహజసిద్ధమైన పరిపక్వ విధానంతోనే తయారైనట్లు చెబుతున్నారు. ప్రకృతిసిద్ధంగానే పండు పరిపక్వత (Ripen Fruit Naturally!) అన్న ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఎన్-రైప్ సొల్యూషన్‌ను తొలుత కిందటేడాది బేనిషాన్ (బంగినపల్లి) మామిడిపండ్లపై ప్రయోగించారు. సత్ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ పౌడర్‌లో ఎలాంటి క్యాన్సర్ కారకాలు లేవని, పూర్తిగా ఎసిలిటేన్ రహితంగానే ఉన్నదని నిరూపణైంది. కాగా, మరిన్ని మామిడి రకాలు, సపోట, సీతాఫలాలు వంటి పండ్లపైనా పరిశోధనలు జరగాల్సి ఉంది.

ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటీ), బెంగళూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసర్చి (ఐఐహెచ్‌ఆర్) వారు సర్టిఫికెట్లనూ జారీ చేశారు. అలాగే, న్యూఢిల్లీలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) మూల్యాంకనంలో కూడా ఎన్-రైప్ పౌడర్‌కు క్లీన్‌చిట్ లభించినట్లు పై సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రకృతిసిద్ధంగా మాగిన పండ్లలోని నాణ్యతకు, ఎన్-రైప్‌తో మాగేసిన పండ్ల నాణ్యతా ఇంచుమించు ఒకే రకంగా ఉన్నదని, ఇవి రుచికరమే కాక సురక్షితమైనవిగానూ తేలినట్లు వారు చెప్పారు.

స్వీయానుభవంతోనే ఆవిష్కరణ!

ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో, పూర్తి సహజ సిద్ధమైన పద్ధతిలో, మూడేండ్ల పరిశోధనల తర్వాతే, ఎథిలీన్ ఆధారంగానే ఎన్-రైప్ సొల్యూషన్‌ను అదీ అత్యంత సరసమైన ధరకే అందుబాటులోకి తెచ్చినట్లు పై కంపెనీ నిర్వాహకులలో ఒకరైన శ్రవణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ వినూత్న ఆవిష్కరణకు మూలకారణమైన నల్గొండ జిల్లాకు చెందిన ఎం.మాధవరెడ్డి న్యూజీలాండ్ నుంచి తిరిగి వచ్చారు. అప్పట్లో తన తోటల్లో కాసిన మామిడికాయల్ని హైదరాబాద్, గడ్డిఅన్నారంలోని వ్యవసాయ మార్కెట్‌లో అమ్మబోగా, పక్వం కాని కాయలను కొనబోమని చెప్పడంతో పెద్ద మొత్తంలో ఆయన నష్టపోయారు. రైతుగా గడించిన ఈ స్వీయానుభవంతోనే యుగంధర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. అలా ఎన్-రైప్ పౌడర్‌ను ప్రకృతి సిద్ధమైన విధానంలో యువ శాస్త్రవేత్తల పరిశోధనలతో అభివృద్ధి పరిచారు.
-దోర్బల బాలశేఖరశర్మ

633
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles