e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 23, 2021
Advertisement
Home ఆరోగ్యం ఆరోగ్యం ఓ ప్రవాహం!

ఆరోగ్యం ఓ ప్రవాహం!

ఆరోగ్యం ఓ ప్రవాహం!

జీవితం అనేది (కాలంలో) పుడుతుంది. పెరుగుతుంది, తనను తాను ప్రకటించుకుంటుంది, అనంతరం మాయమైపోతుంది (చనిపోతుంది). ఇలా పుట్టడానికి, పెరగటానికి, తనను తాను అనేక విధాలుగా ప్రకటించుకోవటానికి, చివరకు చనిపోవటానికి.. ప్రకృతిలోని ఐదు మూలకాలపై జీవితం ఆధారపడుతుంది. అవి.. భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని. ఇవన్నీ కలగలిసి ఒక హృద్యమైన నదిలా సాగుతూ ఉంటాయి. సమస్త విశ్వానికి మూలమైన పంచభూతాలు సైతం విడివిడిగా ఉండవు.
ఆయుర్వేదం అంటే జీవితాన్ని అధ్యయనం చేయటం.

వేదం అంటే జ్ఞానం, తెలుసుకోవటం. ఆయుర్‌ అంటే జీవితం. ఆయుర్వేద సమగ్ర స్వరూపంలో యోగ, వ్యాయామాలు, ఆహార నియమాలు, శ్వాస ప్రక్రియలు, ధ్యానం కలిసి ఉంటాయి. మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే.. మొట్టమొదట ఆకాశతత్వంపై దృష్టి పెట్టాలి. ఆకాశం అనేది మనసుకు సంబంధించింది. నీ మనసుపై అనేక ముద్రలు పడి ఉంటే, అనేకానేక ఆలోచనలతో ఆ మనసు నిండిపోయి ఉంటే, అది నీ రోగనిరోధకశక్తిని తగ్గించివేస్తుంది. మనసు ధ్యానస్థితిలో, ఆనందంగా ఉంటే రోగ నిరోధక శక్తి పెరిగి, అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు. తర్వాత వచ్చేది వాయుతత్వం.

ప్రాణాయామం వంటి శ్వాసక్రియా పద్ధతులు, సుగంధ పరిమళాల అరోమా థెరపీ వంటివాటిని ఈ స్థాయిలో ఉపయోగించవచ్చు. యోగ ఈ పనే చేస్తుంది. పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో రాబోయే దుఃఖాన్ని (రాకముందే) నివారించేది యోగ అని చెప్పాడు. అంటే, గింజను మొలకెత్తే ముందే కాల్చి వేయటం అన్నమాట. తరువాత నీరు. ఉపవాసం ద్వారా, నీటితో అంతర కోశాలను ప్రక్షాళన (శుభ్రం) చేసుకోవటం ద్వారా మన శరీర వ్యవస్థలో చాలావరకు సమతుల్యతను తీసుకురావచ్చు. అయినా సాధ్యం కాకపోతే.. అప్పుడు అనేక మూలికలు, మందులు, శస్త్రచికిత్స ఉన్నాయి. ఇవన్నీ భూతత్వం. మిగిలినవన్నీ విఫలమైనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇవి పనిచేస్తాయి. మన శ్వాస మనకు ఎన్నో రహస్యాలను అందిస్తుంది.

మన మనసులో కలిగే ఒక్కో భావానికి తగినట్టుగా మన శ్వాసలో ఓ లయ ఉంటుంది. ప్రతి లయా శరీరంలో కొన్ని ప్రత్యేకమైన భాగాలపై ప్రభావం చూపుతుంది. మనం చేయాల్సిందల్లా వాటిని గమనించటం. ఆ ఎరుకే ధ్యానం. సరైన ఆహారపు అలవాట్లు కూడా ముఖ్యమే. ‘సరైన ఆహారం’ అంటే.. ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవటం. తిరిగి పొద్దున్నే ధ్యానానికి కూర్చునే సరికి ఆ ఆహారం శుభ్రంగా జీర్ణమైపోవాలి.

చివరగా నా సలహా ఏమంటే, ప్రతి సంవత్సరమూ ఒక వారం రోజులు మీ కోసం మీరు సెలవు తీసుకోండి. ఆ వారం రోజులూ ప్రకృతితో మిమ్మల్ని మీరు సమతుల్యం చేసుకోండి. చక్కగా సూర్యోదయంతోపాటు లేవండి, సరైన ఆహారం – అదీ ఎంత కావాలో అంతే తీసుకోండి. కొద్దిపాటి వ్యాయామాలు, యోగా, ప్రాణాయామం చేయండి. కాసేపు పాటలు పాడండి, నిశ్శబ్దంగా ఈ సృష్టిని ఆనందించండి. మిమ్మల్ని మీరు ప్రకృతితో మమేకం చేసుకుంటే, మీ జీవన వ్యవస్థ పునరుత్తేజితమవుతుంది.
(‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా)

-శ్రీశ్రీ రవిశంకర్‌ జీ

Advertisement
ఆరోగ్యం ఓ ప్రవాహం!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement