ఆదిత్య వైభవం


Fri,February 8, 2019 01:17 AM

రథసప్తమి సందర్భంగా..
అనూహ్య శక్తి స్వరూపుడైన సూర్యుడు అందరి దైవం. మతాలు, తత్తాలు, ప్రాంతాలు, జాతులు, జీవ నిర్జీవాలకు అతీతంగా సమస్త నక్షత్ర మండలాని కంతటికీ ఆయనే ఆరాధ్యనీయుడు. ఇంకా, నిక్కచ్చిగా చెప్పాలంటే, ఆస్తికులకే కాదు, దైవిక భావన అంటేనే ఆమడ దూరం పారిపోయే నాస్తికులు సైతం ఆ శక్తి ముందు మోకరిల్ల వలసిందే.
aditya-vaibhavam
సూర్యతేజో విలాసాన్ని, హృదయ విశాలత్వాన్ని, శక్తి సామర్థ్యాలను, మహోన్నత గొప్పతనాన్ని మన భారతీయ ధార్మిక తాత్వికత గుర్తించినంతగా మరే దేశ, మత తత్త శాస్ర్తాలూ వెల్లడించలేదు. ఒక్కమాటలో ఆదిత్యుడంటేనే అనంతుడని, ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపమేనని వేద పండితులు అభివర్ణిస్తారు. భౌతికంగా భగభగమండే భానుని హృదయం అంతరాంతరాలలో ఎంత ప్రశాంతమో అంత ప్రసన్నమనీ వారు చెప్తారు. తాను ఆదరించే వారి నుంచి అతి ఆరాధనలను కోరుకోడని, కేవలం ఒక్క కృతజ్ఞతా పూర్వక నమస్కారం చాలునని అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. శివునికి అభిషేకం, విష్ణువునకు అలంకారం ఎలాగైతే అత్యంత ప్రీతికరమైన భక్తికార్యాలో సూర్యునికి మాత్రం ఒక్క నమస్కారం చాలునని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. అందుకే, నమస్కార ప్రియో భాను: అన్నది వేదవాక్కు.


సంధ్యావందనంలో సూర్యునికి ఇచ్చే అర్ఘ్యప్రధానానికి అత్యంత విలువ ఉన్నది. ఆధునికులు, దైవం పట్ల నమ్మకం లేని వారు సైతం సూర్య నమస్కారాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అటు మానసిక ప్రశాంతత, ఇటు భౌతిక వ్యాయామం రెండూ ఏకకాలంలో లభిస్తాయి కనుక అనేకమంది ఆధునికులూ దీనిని పాటిస్తారు. ఉత్తరాయణం మొదలైన తర్వాత మాఘ శుద్ధ సప్తమి ఆదిత్యుని జన్మదినం. నాటినుంచి సూర్యరశ్మి ఉచ్ఛస్థితికి చేరుకొని వేసవికాలం మొదలవుతుందని పండితులు అంటారు. శిశిర ఋతువులో భానుడి తాపానికి భూమిమీది అనేక జలాలు ఆవిరై పోతాయి. అప్పట్నించీ నాలుగు నెలలు సూర్యప్రతాపమే. పుష్యమాసం పూర్తయి, మాఘ ప్రతిపద మొదలైన నాటినుంచి అంటే, మరో ఏడు రోజుల్లో రథసప్తమి పర్వదినం ఉందనగా శిశిర ఋతువు ప్రారంభమవుతుంది. అవాల్టితో సూర్యుని గమన తీరులోనే తీవ్రస్థాయి మార్పు వస్తుందన్నమాట. ఇక, రాబోయేదంతా వేసవే కాబట్టి, అప్పుడు తన ప్రతాపాన్ని ఒకింత తగ్గించుకోమంటూ సూర్యభగవానుని వేడుకోవడంగానూ ఈ పండుగను భావిస్తాం.


రథసప్తమిని సూర్య జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. జ్యోతిష శాస్త్రపరంగా ఈరోజు నుంచి ఆకాశంలో నక్షత్రాలు రథాకారంలో భాసిస్తాయని, కాబట్టే ఇది రథసప్తమి అనీ అంటారు. సప్తమి అంటే ఏడు. సూర్యుని రథానికి అశ్వాలు ఏడైతే, సూర్యకిరణంలోని రంగులూ ఏడే. ఇన్ని విశేషాలున్నందునే ఈ ప్రత్యేక పర్వదినం సూర్యారాధనకు అత్యంత విశిష్ఠమని పండితులు చెప్తారు. ఇక, సంవత్సరం పొడుగునా వచ్చే 12 మాసాలకు సూర్యనామాలతో ప్రత్యేకమైన పేర్లున్నాయి కూడా. అంటే, సదరు నెల కాలాన్ని సూర్యుడు ఆ పేరుతో పాలిస్తుంటాడని అర్థం. మధు (చైత్రం), మాధవ (వైశాఖం), శుక్ర (జ్యేష్ఠం), శుచి (ఆషాఢం), నభో (శ్రావణం), నభ (భాద్రపదం), ఇషమ్బర (ఆశ్వయుజం), ఊర్జ (కార్తీకం), సహో (మార్గశిరం), సహస్య (పుష్యం), తపో (మాఘం), తపస్య (ఫాల్గుణం)గా పన్నెండు పేర్లతో పిలుస్తారు. రథసప్తమి నాడే కాకుండా ప్రతి మాసంలో వచ్చే సప్తమి తిథినాడు, ప్రత్యేకించి ప్రతీ ఆదివారం రోజున సూర్య ఆరాధనలు ఎంతో శుభకరమనీ మన ధర్మశాస్ర్తాలు పేర్కొన్నాయి.


ఆదిపరాశక్తి ప్రత్యక్ష ప్రతిరూపాలుగా చెప్పే త్రిమూర్తుల ఏకీకృత రూపమే సూర్యభగవానుడనీ వేద పండితులు అంటారు. సృష్టి, స్థితి, లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలు భాస్కరునిలో అనునిత్యం త్రికాలాల్లో ప్రకటితమవుతాయి. ఉదయం పూట బ్రహ్మదేవునిగా, మధ్యాహ్నం పరమశివునిగా, సాయంత్రం మహావిష్ణువుగా సూర్యబింబం భాసిస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఆయన్ను అనేక విధాలుగా ఎలుగెత్తాయి. సూర్యుడిని త్రిపురుషమూర్తి అని, త్రివేద మయుడు అని వారు అభివర్ణిస్తారు. నాలుగు వేదాలూ ఆయన్ని విరాట్‌మూర్తిగానూ పేర్కొన్నాయి.


నాలుగు వేదాలతోపాటు బ్రహ్మ, మార్కండేయ, మత్స్య, సాంబ, భవిష్య పురాణాలు, సూర్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, నారాయణోపనిషత్తులు, భగవద్గీత, రామాయణ, మహాభారతాలు, తైత్తిరీయ అరణ్యకం, తైత్తిరీయ సంహిత, బృహత్సంహితలు, ధర్మసింధు, సుప్రభేదాగమం, అమరకోశం వంటి అనేక మహద్గ్రంథాలు, శాస్ర్తాలు, స్తోత్రాలు అనితర సాధ్యమైన, అనంతమైన సూర్యతేజో వైభవాన్ని ఆవిష్కరించాయి. సౌర విశేషాలలో సాంబపురాణాన్ని ఆదిగ్రంథంగా చెప్తారు. అన్నింటినీ క్షుణ్ణంగా చదివిన వారికి సూర్యుని శక్తి సామర్థ్యాలేకాదు, సౌర కిరణాలలోని ఆరోగ్య రహస్యం, మహత్తు, జీవశక్తి తెలుస్తాయి. అమరకోశంలో ఆదిత్యుడిని 52 పేర్లతో పిలిచారు.


ప్రతీ ఏడాది రథసప్తమి పర్వదినం వచ్చినప్పుడల్లా, ఇంకా సూర్యనారాయణమూర్తిని తలచుకున్నప్పుడల్లా అనేక తరాల తెలుగువారికి గుర్తొచ్చే వినసొంపైన ఆకాశవాణి భక్తిరస గేయం శ్రీ సూర్యనారాయణా మేలుకో. బాలాంత్రపు రజనీకాంతరావు కలం నుండి జాలువారిన ఈ అద్భుత గీతం తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ పాట పల్లవి ఒక ఎత్తయితే చరణాలన్నీ మరో ఎత్తు. అవి వింటుంటే, కవి అద్భుత పూల వర్ణనల్లో దివాకరుని తేజస్సు ఎలా ప్రకృతితో మమేకమవుతున్నదో పూసగుచ్చినట్లు అర్థమవుతుంది.


ఇక, సూర్యరశ్మి అన్న పదం వెనుక వాల్మీకి కవితా హృదయం ఉంది. ఆయన సూర్యుణ్ణి రశ్మిభావనుడుగా పిలిచాడు. రశ్ములంటే అదుపులో వుండే కిరణాలు అన్న అర్థం వస్తుంది. సూర్యకిరణాలు రకరకాల ప్రభావాలతో ఉంటున్నప్పటికీ జీవకోటికి నష్టం చేయనివీ వాటిలో ఉంటై. పైగా, జీవధాతువులను, శక్తిని, ఆరోగ్యసత్తువనూ అవి ప్రసాదిస్తాయి కూడా.


సూర్యుడిని సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగానే భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొనడం విశేషం. అందుకే, సూర్యనారాయణ స్వరూపంగా ఆయన్ని చెప్తారు. విష్ణువు అన్నా కూడా సర్వత్రా వ్యాపించి వున్నాడని అర్థం. సూర్యుడూ అంతే కదా. సూర్య మండల పర్యంతం ఆయన కిరణ దృష్టి పరివ్యాప్తమై ఉంటుంది. ఆదిత్య హృదయం గొప్పతనం రామాయణంలో ప్రస్ఫుటమవుతుంది. దీనిని పారాయణంగా పఠించడం ఎంతో పుణ్యప్రదమనీ పెద్దలు అంటారు.


aditya-vaibhavam2

సూర్యుడే ఉదయించకపోతే...?

ఇది మాట మాత్రానికైనా మనం కోరుకోకూడదు. నిజానికి సృష్టికి విరుద్ధమైన ఈ పని జరగదనే అనుకోవాలి. ఒకవేళ పొరపాటున సూర్యుడు కనీసం మూడు- నాలుగు రోజులు అసలు ఉదయించకుండా ఉంటే మాత్రం చాలా ఘోరాలు జరిగిపోతాయి. జీవకోటికి కావలసిన ప్రాణశక్తినిచ్చే సూర్యునిల్లే జ్ఞానం, బుద్ధి, శక్తి, మేథ, చైతన్యం వంటివన్నీ సిద్ధిస్తాయని వైదిక గ్రంథాలు పేర్కొన్నాయి. సూర్యరశ్మిలోని డి-విటమిన్ ఆవశ్యకత గురించి వేరే చెప్పక్కర్లేదు. కిరణాల్లోని సప్తవర్ణాలకు అనేక దీర్ఘకాలిక వ్యాథులను నిర్మూలించే శక్తికూడా ఉన్నట్టు పలు ధార్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.


-దోర్బల బాలశేఖరశర్మ

1053
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles