ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు తెలుసుకున్నారా?


Sat,December 22, 2018 01:20 AM

2018 సంవత్సరం ముగిసిపోతున్నది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. వ్యక్తిగత పన్ను ఆదా ప్రణాళికలు రూపొందించుకోవడానికి కూడా సమయం దగ్గర పడింది. అయితే గత ఏడాది కాలంలో ఆదాయపు పన్ను చట్టంలో అనేక మార్పులు జరిగాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పన్ను ప్రణాళికను రూపొందించుకునే క్రమంలో ఆ మార్పులేమిటో తెలుసుకోవడం అవసరం.
ONZFBE

రిటర్న్‌లు దాఖలు చేయకపోతే జరిమానా

పన్ను రిటర్నులను దాఖలు చేయకపోతే జరిమానా విధించనున్నారు. ఈ ప్రతిపాదనను 2017 బడ్జెట్‌లోనే చేసినప్పటికీ ఏప్రిల్ 1, 2018 నుంచి అమల్లోకి వచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నులను దాఖలు చేయకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం రూ. 10,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి మాత్రం జరిమానాను రూ. 1,000 పరిమితం చేశారు.

పాన్‌కార్డ్ దరఖాస్తులో మార్పులు

పాన్‌కార్డ్ కోసం చేసే దరఖాస్తులోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త దరఖాస్తుల్లో లింగ వివరాలను పొందుపరిచేందుకు టాన్స్‌జెండర్లకు కూడా అవకాశం కల్పించారు. గతంలో కేవలం పురుషుడు లేదా మహిళలకు మాత్రమే అవకాశం ఉండేది. లింగ నిరూపణకు ఎలాంటి ధృవీకరణ పత్రాలు కూడా అవసరం లేదు. అలాగే తండ్రి పేరునే మాత్రమే కాకుండా ఇక నుంచి సింగిల్ పేరెంట్‌గా తల్లిపేరును కూడా పేర్కొనవచ్చు. ఈ కొత్త నిబంధన ఈ నెల ప్రారంభం నుంచే అమల్లోకి వచ్చింది.

జాతీయ పింఛన్ పథకం(ఎన్‌పీఎస్)లో మార్పులు

జాతీయ పించన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని వెసులుబాటులను కల్పించింది. మెచ్చూరిటీ సమయంలో విత్‌డ్రా చేసుకునే 60 శాతం మొత్తానికి 100 శాతం పన్ను మినహాయింపులను కల్పించింది. మిగిలిన 40 శాతం సొమ్ము మాత్రం యాన్యునిటీ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి తప్పనిసరిగా ఉపయోగించాలి. గతంలో మెచ్చూరిటీ సమయంలో 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి వీలుండేది. అయితే కేవలం 40 శాతం మొత్తానికి మాత్రమే పన్ను మినహాయింపు ఉండేది. మిగిలిన 20 శాతం మొత్తానికి పన్ను చెల్లించాల్సి వచ్చేది. సో.. ఇప్పుడు విత్ డ్రా చేసుకునే మొత్తానికి పన్నును మినహాయించినట్టు అయింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్ కింద పన్ను మినహాయింపులను కల్పించింది. 80సీ కింద రూ.1.5 లక్షల వరకూ మూడేండ్ల లాక్ ఇన్ పిరీయడ్‌తో ఈ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే, దీన్ని ప్రభుత్వం ఇటీవలే ఆమోదించినప్పటికీ ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదు.

మెడికల్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్

గత బడ్జెట్ చేసిన మరో ప్రధాన సవరణ మెడికల్ రీయంబర్స్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లకు బదులుగా స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రవేశపెట్టారు. గతంలో వీటిని సాలర్ స్లిప్‌ల్లోనూ పేర్కొనే వారు. అయితే ఆదాయపు పన్ను చట్టంలో మార్పుల కారణంగా 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని సాలరీ స్లిప్పుల్లో పేర్కొనరు.
ఈ రెండు అంశాలకు సంబంధించి పన్ను చెల్లింపుదారులు పన్ను దాఖలు చేసేటప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ కింద వీటిని పేర్కొనవచ్చు.

సెస్ పెంపు

పన్ను చెల్లింపులపై విధించే సెస్సును 3 నుంచి 4 శాతానికి పెంచారు. ఈ పెంపు ఏప్రిల్ 1, 2018 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి తోడు వీటిని, ఎడ్యుకేషన్, హెల్త్ సెస్‌లుగా పేరు మార్చారు.

ఈక్విటీలపై ఎల్‌టీసీజీ పన్ను

ఏడాది స్టాక్ మార్కెట్లను భారీగా ప్రభావితం చేసిన ప్రతిపాదనల్లో ప్రధానమైనది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్. ఒకే ఆర్థిక సంవత్సరంలో లక్ష రూపాయల కన్నా ఎక్కువ లాభాన్ని షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల అమ్మకం ద్వారా గడిస్తే పన్ను చెలించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే హోల్డింగ్‌లో వున్న షేర్లను 2018, జనవరి 31 నాటి ధరనే ప్రామాణికంగా తీసుకుంటారు. అప్పటి వరకూ వున్న లాభాలను పరిగణించరు.

విదేశాలకు డబ్బు పంపితే పాన్ తప్పని సరి

లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద విదేశాలకు పంపించే డబ్బుకు పాన్ కార్డును తప్పనిసరి చేశారు. గతంలో 25,000 డాలర్ల వరకూ పాన్ కార్డ్ లేకుండానే పంపే వీలుండేది. పిల్లల విదేశీ చదువులు, విదేశీ స్టాక్ ఎక్సేంజీలలో మదుపు, ఆస్తుల కొనుగోలు వంటి వాటి కోసం విదేశాలకు డబ్బును పంపించడం జరుగుతున్నది.

ఐటీఆర్ సవరణకు గడువు తగ్గింపు

ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసిన తర్వాత దాన్ని సవరించేందుకు ఆర్థిక సంవత్సరం ముగింపు తేదీ మార్చి 31 వరకూ గడువును విధించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులను దాఖలు చేస్తే దాన్ని మార్చి 31, 2019 వరకు సవరించుకునే అవకాశం ఉంటుంది. గతంలో రెండేండ్ల వరకూ సవరించే వీలుండేది.

ఈక్వీటీ మ్యూచ్చువల్ ఫండ్స్ పై డీడీటీ

ఈక్విటి మ్యూచువల్ ఫండ్ల నుంచి వచ్చే డివిడెండ్‌పై కూడా పన్నును విధిస్తూ 2018 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చింది. ఈ డివిడెండ్‌పై పన్నును 10 శాతం మేర విధించనున్నారు. అయితే డివిడెండ్‌ను చెల్లించే సమయంలోనే మ్యూచువల్ ఫండ్లు పన్నును మినహాయించుకుని డివిడెండ్‌ను చెల్లించననున్నాయి.

పాన్‌కార్డుపై హెచ్‌యూఎఫ్‌లకు గడువు

హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీఓఐ)లు పాన్‌కార్డ్‌ను దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31, 2019 వరకు గడువును పెంచారు. రూ. 2,5 లక్షలకు పైబడి లావాదేవీలు జరిపే వీరు పాన్ కార్డుకు తప్పని సరి దరఖాస్తు చేసుకోవాలి.
aadhar-pan

పాన్ కార్డ్‌కు ఆధార్ తప్పనిసరి

పాన్‌కార్డ్‌ను పొందాలంటే దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్ వివరాలను కూడా అందచేయాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ ప్రకారం ఆధార్‌ను తప్పనిసరి చేయడానికి సుప్రీం కోర్టు

కూడా సమర్దించింది. దీంతో పాన్‌కార్డ్ పొందాలంటే ఆధార్ కార్డ్ వివరాలు తప్పనిసరిగా పొందుపరచాల్సిందే. అలాగే పాన్ కార్డ్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. మార్చి 31, 2019 దీనికి గడువు. అలాగే ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు కూడా ఆధార్ నెంబర్‌ను పేర్కొనడమూ సెక్షన్ 139ఏఏ ప్రకారం తప్పని సరే.

సీనియర్ సిటిజన్లకు రూ. 50వేల వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదు

ఆదాయపు పన్ను చట్టంలో కొత్తం 80టీటీబీ సెక్షన్‌ను చేర్చారు. దీని ప్రకారం సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు చెల్లించే వడ్డీ రూ. 50,000 లోపు ఉంటే టీడీఎస్‌ను మినహాంచరాదని ఈ కొత్త సెక్షన్ చెబుతోంది. సీనియర్ సిటిజన్లకు ఇదో పెద్ద ఊరట. అయితే ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేటప్పుడు సాధారణంగానే ఆదాయం కింది పేర్కొనాల్సి ఉంటుంది.

1075
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles