ఆత్మ సంతృప్తి కోసమే ధ్యానం


Sun,September 2, 2018 01:19 AM

50 ఏండ్ల ధ్యాన యోగ కేంద్రం శాంతి సరోవర్‌లో గోల్డ్డెన్ జూబ్లీ ఉత్సవాలు సందేశమిచ్చిన మహా తపస్విని దాదీ జానకీ నేడు ఆధ్యాత్మిక ఇన్నర్ స్పేస్ ప్రారంభం కాబోతున్నది. హైదరాబాద్‌కు ఇన్నర్ స్పేస్ ఇదే తొలిసారి.
ప్రస్తుత జీవన విధానంలో బాహ్య సంతృప్తి మాత్రమే ఉందని, ఆత్మ సంతృప్తి లేదన్నారు. ధ్యానం జీవన విధానంలో భాగం కావాలని పిలుపునిచ్చారు బ్రహ్మకుమారీల ముఖ్య అధినేత్రి దాదీ జానకీ. ఆదివారం గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో ఇన్నర్ స్పేస్ ఆధ్యాత్మిక కేంద్రం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో 103 ఏండ్ల దాదీ జానకీ పాల్గొన్నారు. వివిధ దేశాల్లో ఆమెకు లక్షలాది మంది శిష్యులున్నారు.

Global
తెలంగాణకు మరో అరుదైన గౌరవం. ఐటీ కారిడార్‌కు వేదికైన గచ్చిబౌలి ప్రాంతం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.130 దేశాల్లో బ్రహ్మ కుమారీల కేంద్రాలను విస్తరించి, ధ్యానం, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల్లో కీపర్స్ ఆఫ్ విస్‌డమ్‌గా కీర్తికెక్కిన వారి చేతుల మీదగా ఇన్నర్ స్పేస్ ఆధ్యాత్మిక కేంద్రం ప్రారంభం కానుంది.

50 ఏండ్ల ధ్యాన కేంద్రం

హైదరాబాద్ శాంతి సరోవర్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆదివారంతో ఈ ధ్యాన కేంద్రం 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్నది. కేవలం వందల మంది బ్రహ్మకుమారీలతో మొదలైన శాంతి సరోవరం.. నేడు లక్షల మంది శిష్యులకు వేదికగా మారింది. 50 ఏండ్ల కిందట బ్రహ్మ కుమారీ మహేంద్ర బాయి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ధ్యాన కేంద్రం ఏర్పాటైంది. దీని పునాదితో కొన్ని వందల ధ్యాన కేంద్రాలు రాష్ట్రంలో మొదలయ్యాయి. రాజస్థాన్‌లో ధ్యాన కేంద్రాలను ప్రారంభం చేసిన దాదీ, మహా తపస్విని దాదీ జానకీ స్ఫూర్తితో హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభం చేశారు. శాంతి సరోవర్ సంచాలకులు కుల్దీప్ బెన్ ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. 50 ఏండ్లుగా బ్రహ్మ కుమారీల ఆధ్యాత్మిక సేవలకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో శాంతి సరోవరం కేంద్రంగా విస్తరించారు. దక్షిణ భారత దేశానికి రిట్రీట్ సెంటర్ అయిన శాంతి సరోవర్‌తో వేలాది మందికి ఒత్తిడి లేని జీవితాన్ని అందిస్తున్నారు. దీనిలో భాగంగా శాంతి సరోవరంలో ఇన్నర్ స్పేస్ ఆధునిక భవనాన్ని నిర్మాణం చేశారు. ఆధునిక సమాజానికి మరియు యువత, ఐటీ రంగాల్లో చిన్న వయస్సుల్లోనే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు ప్రత్యేకమైన రీతిలో తర్కబద్దంగా, శాస్త్రీయంగా అంతరంగిక వివేకాన్ని బయటకు తీసుకువచ్చి, ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితాన్ని అందించే విధంగా ఈ ఇన్నర్ స్పేస్‌ను నిర్మించారు. ధ్యాన మందిరం, భారతదేశ ప్రాచీన రాజయోగం విశిష్టతను తెలిపే విధంగా ప్రదర్శనా క్షేత్రం, ఆధ్యాత్మిక గ్రంథాలయాలు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

దేశంలో తొలిసారి

ఇన్నర్ స్పేస్ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రం దేశంలో మొదటిసారి హైదరాబాద్‌లో నిర్మితమైంది. యాంత్రీకమైన జీవన విధానంలో ఒత్తిడిని జయించి, ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు మొదటగా లండన్‌లో ప్రారంభమైన ఇన్నర్‌స్పేస్.. యూరప్, యూఎస్‌ఏ, జపాన్ వంటి పెద్ద దేశాల్లో ఉంది. ప్రస్తుతం దీనికి హైదరాబాద్ వేదికగా మారింది. సాఫ్ట్‌వేర్ రంగానికి ప్రధానంగా మారిన హైదరాబాద్ ప్రాంతంలో దీని ఏర్పాటుకు దాదీ జానకీ పునాది వేశారు. ఇన్నర్‌స్పేస్‌తో సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు నిత్యం మానసిక టెన్షన్‌తో చిద్రమవుతున్న వారికి ఇది మంచి వేదికగా మారుతుందని బ్రహ్మకుమారీల విశ్వాసం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... ఆత్మ బలంగా ఉంటే అసాధ్యమైన వాటన్నింటినీ సుసాధ్యం చేయడం, ఉల్లాసవంతమైన జీవన విధానాన్ని అందించే విధంగా ఈ ఇన్నర్ స్పేస్ తీర్చి దిద్దుతుందని బ్రహ్మ కుమారీలు చెబుతున్నారు.

అద్భుతంగా ఆరంభ వేడుకలు

హైదరాబాద్ శాంతి సరోవర్‌లో ఆరంభ వేడుకలు కన్నుల పండువగా మొదలయ్యాయి. శనివారం సాయంత్రం వేలాది మంది బ్రహ్మ కుమారీలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. దాదీ జానకీతో పాటు పలువురిని ప్రత్యేక వాహనాలపై ఊరేగించారు. తామర పూల మధ్య శిష్యులకు దాదీ జానకీ దర్శనమిచ్చారు. ప్రత్యేకమైన ఏర్పాట్లు, నృత్యాలు, కోలాటాలతో బ్రహ్మ కుమారీల క్షేత్రం శాంతి సరోవరం పులకరించింది.

శాంతి సందేశం

Global1
శాంతి సరోవర్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా దాదీ జానకీ శాంతి సందేశమిచ్చారు. హైదరాబాద్‌తో తనకు విడదీయలేని అనుబంధముందన్నారు. ఇక్కడ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించాలని తానే రూపకల్పన చేశానన్నారు. ప్రస్తుతం జీవన విధానంలో బాహ్య సంతృప్తి మాత్రమే ఉందని, ఆత్మ సంతృప్తి లేదన్నారు. ధ్యానం జీవన విధానంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మానసికంగా ధృడంగా ఉన్నప్పుడే జీవితం నూరేళ్లు సాగుతుందని, ప్రపంచ వ్యాప్తంగా ధ్యానంతో సంతృప్తికరమైన జీవితాన్ని వెల్లదీస్తున్నామని లక్షల మంది శిష్యులు చెప్పారని, జీవితంలో ఇది చాలా సంతోషమకరమై విషయమని 103 ఏండ్ల ఆధ్యాత్మిక వేత్త దాదీ జానకీ పేర్కొన్నారు.

టి. సంపత్, హైదరాబాద్, నమస్తే తెలంగాణ,
విద్యాసాగర్

761
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles