ఆత్మజ్ఞానంతోనే పరమాత్మ సాక్షాత్కారం!


Fri,March 8, 2019 01:23 AM

సకల చరాచర జగత్తు అంతా పరమాత్మ సన్నిధిలోనే ఉన్నది. ఆయన మహిమలో ఈ విశ్వం కేవలం నాల్గవ భాగం మాత్రమే. పరమాత్మకు చెందిన ఆ మిగిలిన మూడు వంతుల మహిమ మనకు తెలియనే తెలియదు, ఈ ఒక వంతు తప్ప. ఈ ఒక్క భాగం కూడా వేదాల వల్ల, ఉపనిషత్తుల వల్ల, విద్వాంసుల ప్రవచనాల వల్లనే మనం తెలుసుకోగలుగుతున్నాం.
parmatma
ఆత్మసాక్షాత్కారం అనే మాట లోకంలో తరచుగా వినబడుతుంటుంది. మా గురువు గారికి ఆత్మసాక్షాత్కారమైంది. మరి, మీ గురువుగారికయ్యిందా? అని శిష్యులు మాట్లాడుకోవడం చూస్తుంటాం. కొందరైతే నాకు నలభైయేండ్ల క్రితమే ఆత్మసాక్షాత్కారం లభించింది. నేనిప్పుడు నలభై ఒకటవ ఆత్మసాక్షాత్కార దినోత్సవాన్ని జరుపుకొంటున్నాను. మీరంతా రండి! అని ఆహ్వానాలు పంపి మరీ వార్తల్లోకి ఎక్కుతుంటారు. నిజంగా వీరికి ఆత్మసాక్షాత్కారం అయ్యిందా అనేది సగటు మనిషికి కలిగే సందేహం.


ఆత్మ అంటే ఏమిటో, సాక్షాత్కారం అంటే ఏమిటో తెలియకుండా, ఆత్మసాక్షాత్కారం అయ్యిందంటే ఎవరు నమ్ముతారు? ముందుగా ఆత్మ, సాక్షాత్కారం అనే పదాలకుగల మౌలికమైన అర్థాలు తెలుసుకోవాలి. అలాగే, ఆత్మసాక్షాత్కారం ఎవరికి కలగాలనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. దీనికి సమాధానం దొరికితే ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటో అర్థమవుతుంది. నాకు ఆత్మసాక్షాత్కారం కలిగింది అనే ఉద్దిష్ట వాక్యంలోనే సాక్షాత్కారం ఎవరికి కలగాలో తెలుపబడింది. నాకు అన్నప్పుడు జీవాత్మకు అని అర్థం చేసుకుంటే, ఎవరికన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లే.


మొత్తం మీద జీవునికి ఆత్మసాక్షాత్కారం అనే విషయం స్పష్టమైంది. ఇంతకూ, ఆత్మ శబ్దానికి గల అర్థం తెలిస్తే గాని సాక్షాత్కార ఫలం లభించినట్లవదు. ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ అనే అర్థం. మనం జీవాత్మలం. ఒకచోటికే పరిమితమైన వాళ్లం. శరీరధారులం. కానీ, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నవాడు. అతనికి శరీరం లేదు. మన వలె జన్మలెత్తడు. మన వలె కష్టసుఖాలను అనుభవించడు. మన వలె రాగద్వేషాలకు లోను కాడు. అంతేకాదు, మన వలె ఈ ప్రపంచంలో ఎన్నడూ బంధింపబడడు. బంధమోక్షాలు మనకే తప్ప, పరమాత్మకు లేవు.


పరమాత్మ మనకు జన్మప్రదాత మాత్రమే కాడు, మోక్షప్రదాత కూడా. ఎవరికి పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుందో వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది. ఎవరిని ఆశ్రయిస్తే అమృతం లభిస్తుందో, ఎవరిని ఆశ్రయించకపోతే మృత్యువు ఆవహిస్తుందో అతనికి నా నమస్కారం అని వేదంలోనే స్పష్టంగా ఉంది. సాక్షాత్కారం అంటే మన కళ్లకు కనిపించడమనే అభిప్రాయం లోకంలో ఉంది. కానీ, సన్నిధిలో ఉండడమనే ముఖ్యమైన అర్థాన్ని చాలామంది చెప్పుకోరు. జీవాత్మలమైన మనం పరమాత్మ సన్నిధిలో ఉండడమే సాక్షాత్కారం అనే మాటకు అసలైన అర్థం.


పరమాత్మ సూక్ష్మపదార్థాలలోకెల్లా సూక్ష్మమైన వాడు. ప్రపంచానికి ఉపాదాన కారణమైన ప్రకృతి సూక్ష్మమైంది. ప్రకృతి కంటే జీవాత్మ మరింత సూక్ష్మమైంది. జీవాత్మకంటే పరమాత్మ అత్యంత సూక్ష్మమైన వాడు. పరమాణువులతో కూడిందే ప్రకృతి. ప్రకృతిని మనం చూడలేనప్పుడు, ప్రకృతికంటే సూక్ష్మమైన పరమాత్మను మనం మన మామూలు కంటితో ఎట్లా చూడగలం? పరమాత్మకు రూపం లేదు. మన నేత్రాలు కేవలం రూపం కలిగిన వస్తువులను మాత్రమే చూడగలవు. అందుకే, నిరాకారుడైన పరమాత్మను మన నేత్రాలు చూడలేవు. కానీ, ఆయన సన్నిధిలో నిలువగలం. అదెలా?


దీనికోసం మొట్టమొదట పరమాత్మ గురించి తెలుసుకోవాలి. అతని గురించి వినాలి. అంతేకాదు, ఆలోచించాలి. మన అన్ని రకాల కర్మల ఫలాలను అతనికే అర్పించాలి. అప్పుడే అతని సన్నిధిలో నిలిచే అర్హత మనకు లభిస్తుంది. ఆత్మ సమర్పణ భావమే పరమాత్మ సాక్షాత్కారానికి దారిచూపుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సాక్షాత్కారం అంటే మన అనుభవంలోకి పరమాత్మను తెచ్చుకోవడమే. ఎవరి అనుభవం వారిది కావచ్చు. కానీ, పరమాత్మ ఒక్కడే. ఆయన సన్నిధిలో నిలవడమే కాదు, అనుభవంలోకి తెచ్చుకోవడం కూడా సాక్షాత్కారమే అవుతుంది.


ఆత్మజ్ఞానమే పరమాత్మ సాక్షాత్కారానికి కారణమవుతుంది. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అది ఒకదానివల్ల పుట్టేది కాదు, ఏర్పడేదీ కాదు. వృద్ధిక్షయాలు దానికి లేవు. అన్నివేళల అది ఒకే తీరుగా, కొత్తగానే ఉంటుంది. శరీరాలు, శరీరాలకు మూలకారణమైన పంచభూతాలు నశిస్తాయి. కానీ, ఆత్మ నశించదు. మనం జీవాత్మలం. ఓం పదంతో చెప్పబడే దైవమే పరమాత్మ. ఆ పరమాత్మ తత్వాన్ని ఎవరు తెలుసుకొంటారో వారికి ఏ దు:ఖం ఉండదు. ఎవరు పరమాత్మకంటే ఇతరమైన విషయాలకు దూరంగా, తమ బుద్ధిని పరమాత్మలో ఏకాగ్రం చేసి, అతడినే ఉపాసిస్తారో వారికే పరమాత్మ అనుభవంలోకి వస్తాడు. యోగం ద్వారా పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవడమంటే ఇదే మరి.


parmatma2

మానవుడే శ్రేష్ఠుడు!

అసలు, రహస్యం ఏమిటంటే, సకల చరాచర జగత్తు అంతా పరమాత్మ సన్నిధిలోనే ఉన్నది. ఆయన మహిమలో ఈ విశ్వం కేవలం నాల్గవ వంతు మాత్రమే. పరమాత్మకు చెందిన మిగిలిన మూడు వంతుల మహిమ మనకు తెలియనే తెలియదు, ఈ ఒక వంతు తప్ప. ఈ ఒక్క భాగం కూడా వేదాల వల్ల, ఉపనిషత్తుల వల్ల, విద్వాంసుల ప్రవచనాల వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం. ఐతే, ఆయన మహిమ ఎట్లున్నా ఆయన పూర్ణుడే. పూర్ణుడైన పరమాత్మ మూలంగానే పూర్ణజగత్తు రచింపబడింది. జగత్తులో కదలనివి, కదిలేవి అనే రెండు పదార్థాలున్నాయి. కదిలే ప్రాణికోటిలో మానవుడే శ్రేష్ఠుడు. అతనికే పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. మనం పరమాత్మలో ఉన్నప్పటికీ అతని గురించి తెలుసుకోలేం. అదే వైచిత్రి.


sri-kanth-kumar

ఏది ఆత్మసాక్షాత్కారం?

ఫిబ్రవరి 1న చింతనలో ప్రశ్నోపనిషత్ శీర్షికన ప్రచురితమైన ఈ ప్రశ్నను బెంగళూరుకు చెందిన డి. శ్రీకాంత్‌కుమార్ పంపారు. దీనికి పూర్తి వివరణాత్మకమైన సమాధానంగా వారితోపాటు పాఠకులూ ఈ వ్యాసం చదువుకోగలరు.
-ఆచార్య మసన చెన్నప్ప, సెల్: 98856 54381

506
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles