ఆట ఏదైనా మేఘన సై


Sun,April 14, 2019 12:37 AM

ఏ క్రీడాకారులైనా ఒకటో రెండో క్రీడలకే పరిమితమవుతుంటారు. కానీ ఈ చిన్నారి మాత్రం అలా కాదు. దాదాపు పది క్రీడల్లో తన సత్తా చాటుతున్నది. అది కూడా ఏ గ్రామ స్థాయిలోనో, జిల్లాస్థాయిలోనో కాదండోయ్.. ఏకంగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనే. ఆట ఏదైనా అక్కడ మేఘన ఉండాల్సిందే. పతకం పట్టాల్సిందే!!
Meghana
నిరుపేద కుటుంబంలో పుట్టిన మాణిక్యం ఈ చిన్నారి. పేరు మేఘన. ఒక్కమాటలో చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్. ఆటలు, పాటలు అన్నింట్లోనూ తన సత్తా చాటుతున్నది. జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన రాజారావు రమేష్, జమునల కుమార్తె మేఘన. ముగ్గురు తోబుట్టువుల్లో చిన్నది. మేఘనకు క్రీడలంటే చాలా మక్కువ. పరుగుపందెం, హ్యాండ్‌బాల్, త్రోబాల్, టెన్నికాయిట్, ఫీస్ట్ బాల్, లాంగ్ జంప్, ఖోఖో, కబడ్డీ.. ఇలా విభిన్న క్రీడల్లో రాణిస్తున్నది. ఒకసారి బరిలోకి దిగాక ఆట ఏదైనా దూసుకెళ్లడమే మేఘనకు అలవాటు.

పతకాల వేటలో మేఘన..

చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రోత్సహించడంతో.. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నది మేఘన. టైగర్ స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖోఖో పోటీల్లో రాష్ట్రస్థాయిలో బంగారు పథకం సాధించింది. కబడ్డీ, హ్యాండ్‌బాల్ రాష్ట్రస్థాయిలో రజత పథకం సాధించింది. దీంతో పాటు జాతీయ స్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా హర్యానాలో నిర్వహించిన హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొన్నది. గోవా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో హ్యాండ్‌బాల్, థ్రో బాల్ రాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించింది మేఘన. వచ్చేనెలలో గుజరాత్‌లో నిర్వహించే అండర్-14 ఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నది మేఘన. ఇప్పటివరకు రెండు జాతీయ స్థాయిలతో పాటు 11 రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు బంగారు, రజత పథకాలు సాధించింది.

కొడుకు లేని లోటును తీర్చుతున్నది..

మేఘన అన్నింట్లోనూ చురుగ్గా ఉంటూ.. అబ్బాయి లేడనే లోటు మేఘన తీరుస్తున్నదని తండ్రి చెబుతున్నాడు. మేఘన సీఎంఆర్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నది. పేద కుటుంబంలో పుట్టినా తన ప్రతిభ ఆధారంగా పలు జాతీయ, రాష్ట్రస్థాయిలో క్రీడల్లో పతకాల పంట పండిస్తున్నది. ఆర్థికంగా ప్రభుత్వం చేయూతనిస్తే అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటుతానంటున్నది.
meghana1

నాలుగింటికే పరుగు మొదలు..

మేఘన ఆటలతో పాటు, చదువుల్లోనూ రాణిస్తున్నది. ఒకవైపు చదువు, మరోవైపు ఆటలను బ్యాలెన్స్ చేసుకుంటున్నది. ప్రతిరోజూ తెల్లవారు జామున నాలుగు గంటలకే నిద్రలేచి తండ్రితోపాటు పరుగెడుతుంది మేఘన. ప్రాక్టీస్ అయ్యాక ఓ గంట పాటు చదువు, హోంవర్క్ పూర్తి చేసుకొని పాఠశాలకు వెళ్తుంది. ప్రతీ పరీక్షలోనూ మార్కుల శాతాన్ని పెంచుకుంటూ పోతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మేఘన వల్ల తమ స్కూల్‌కి మంచి పేరొచ్చిందని అభినందిస్తున్నారు. మేఘన ప్రతిభను చూసి మూడో తరగతి నుంచి ఆయా క్రీడల్లో శిక్షణ ఇస్తున్నామని వ్యాయామ ఉపాధ్యాయులు అంటున్నారు. అందుకే తాను అన్ని క్రీడల్లోనూ రాణిస్తుందని గర్వంగా చెబుతున్నారు.

తల్లిదండ్రులే నా బలం

తల్లిదండ్రులు, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ పతకాలు సాధించాను. నా బలం, బలహీనత తల్లిదండ్రులే. గతేడాది అంతర్జాతీయ స్థాయిలో ఫీస్ట్‌బాల్‌కు సెలెక్ట్ అయ్యాను. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో వెళ్లలేకపోయా. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి బంగారు పథకాలు సాధిస్తా. బాగా చదువుకొని పైలెట్ అవుతా. ఇదే నా లక్ష్యం. నా లాంటి గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రభుత్వం ఆర్థికంగా సాయపడితే మరింత రాణిస్తాం.
- మేఘన, క్రీడాకారిణి

-వనజ వనిపెంట

307
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles