ఆకలి తీర్చే.. పబ్లిక్ రిఫ్రిజిరేటర్!


Sat,September 8, 2018 01:23 AM

బెంగళూరు నగరంలోని పలుచోట్ల వెలిసిన పబ్లిక్ రిఫ్రిజిరేటర్లు ఎంతోమంది అభాగ్యుల ఆకలిని తీరుస్తున్నాయి. ఇన్నాళ్లు నగరంలో ఆకలితో కడుపు మాడ్చుకొని బతికిన వారంతా వీటి పుణ్యాన కడుపునిండా తింటూ సంతోషంగా ఉంటున్నారు. ఇలా ఎంతోమంది ఆకలిని తీర్చింది ఈ ఫాతిమానే.
fatima
ఆర్థో డెంటిస్ట్ అయిన డాక్టర్ ఫాతిమా బెంగళూరు నగరంలో ఆకలిలో అలమటించేవారి కోసం పబ్లిక్ రిఫ్రిజిరేట్ల ఆలోచన చేసింది. పార్టీలు, శుభకార్యాలు, పండుగలు.. ఇలా ఎన్నో వేడుకల్లో మిగిలిన ఆహారాన్ని సేకరించి, నగరంలో ఉన్న పలు పబ్లిక్ రిఫ్రిజిరేటర్లలో ఉంచుతుంది. ఇంకా కొంతమంది దుస్తులు, చెప్పులు, పుస్తకాలు, బొమ్మలు వంటివి అక్కడ పెడుతున్నారు. దీంతో ఆకలితో ఉన్నవారు కడుపు నిండా సంతోషంగా అన్నం తిని, వారికి అవసరమున్న వస్తువులను తీసుకొని వెళ్తున్నారు. ఈ మంచి పని చేయడం వెనుక ఫాతిమా ఎంతో కష్టపడింది. తనకు పరిచయమున్న ఎంతోమందిని సహాయం కోరింది. కొంతమంది నిర్మొహమాటంగా సాయం చెయ్యలేమని చెప్పినా, అధైర్యపడకుండా కొంత తన సొంత డబ్బులు, విరాళాలు కలిపి నగరంలో పలుచోట్ల రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు, కండక్టర్లు, బిచ్చగాళ్లకు తినడానికి తిండి దొరుకుతుంది. పుస్తకాలు కొనలేని పేద విద్యార్థులకు పుస్తకాలు దొరుకుతున్నాయి. మొదట్లో సహాయం చేయడానికి ముందుకురాని వారు కూడా ఇప్పడు ఫాతిమా చేస్తున్న మంచిపనికి తమవంతు సాయం చేస్తున్నారు. వలంటీర్లు అన్నం పాడవకుండా, అందుబాటులో ఉన్న పేదలకు పంచుతూ ఉంటారు. ఎక్కువమంది దాతలు స్పందిస్తే.. ఇలాంటి పబ్లిక్ రిఫ్రిజిరేటర్‌లను అన్ని రాష్ర్టాలలో ఏర్పాటు చేస్తానంటున్నది డాక్టర్ ఫాతిమా.

537
Tags

More News

VIRAL NEWS