అసమానత్వంపై తిరుగుబావుట అంజలి హజారికా


Mon,February 4, 2019 11:55 PM

డాక్టర్.. లాయర్.. పోలీస్.. పైలెట్.. ఫైర్‌మన్.. ఒక క్లాసులోని పిల్లల్ని ఈ బొమ్మలు వేయమంటే.. మరుక్షణం ఆలోచించకుండా.. ఆయా వృత్తిలో ఉండేది మగవాళ్లనే అనుకొని.. వాళ్ల బొమ్మలే గీసి ఇస్తారు.. ఇది వారి తప్పు కాదు.. సమాజంలో ఉన్న భావజాలం అలాంటిది అంటారు అంజలి హజారికా. ఆడ-మగ వేరు కాదు.. ఇద్దరూ సమానులనే భావన అందరిలో ఉండాలంటారీమె.. సంప్రదాయ భావజాలం మహిళల ఎదుగుదలకు ఎలా అడ్డంకిగా మారిందో.. వాక్ ద టాక్.. ఉమెన్, వర్క్, ఈక్విటీ, ఎఫెక్టివ్‌నెస్ పేరుతో పుస్తకం రాశారు.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక సదస్సుకు ఆమె విచ్చేశారు.. ఈ సందర్భంగా ఆమె జిందగీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.. మగవాళ్లు ఓడిపోతే అది అతడి వ్యక్తిగత తప్పిదంగా భావిస్తారు. అదే ఓ మహిళ ఓడిపోతే.. అది మహిళా జాతి తప్పిదంగా చెబుతారు. ఇద్దరూ చేసింది తప్పే.. కానీ, ఇక్కడ ఒకరి తప్పు వ్యక్తిగతమైంది. మరొకరిది జాతికే మచ్చ తెచ్చిందని సమాజం భావిస్తుంది. చిన్నప్పుడు అమ్మాయి, అబ్బాయి పెరుగడంలో వ్యత్యాసం ఉండదు. వాళ్లు పిల్లలుగానే పెరిగి పెద్ద అవుతారు. సమాజమే వారిని స్త్రీ, పురుషుడు అనే భేదభావాన్ని వారి చిన్ని మెదళ్లలో నింపేస్తుంది. ఈ భావజాలాన్ని ప్రశ్నించేందుకు ఓ గొంతుక అయింది హజారికా.
anjali-hazarika
ఏ రంగంలో పని చేసినా మగాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే వారు మగవాళ్లని జడుస్తున్నారు. ఇప్పటికీ ఆడవాళ్లను ఇంటికే పరిమితం చేసే మగవాళ్లున్నారు. దీనిని ఉద్దేశించి సమాజంలో మహిళలకు ఉన్న స్థానం ఏంటో తెలియజేయాలనుకున్నది అంజలి. అందుకు ఒక ఉదాహరణగా.. ఒక టీచర్.. ఎనిమిదేండ్ల ఆడ పిల్లలని, మగపిల్లలని ఎంచుకున్నది. అందులో ఇద్దరిద్దరినీ జట్టుగా నిలబెట్టింది. బంతులను కింద వేసి పక్కన ఉన్న ఒకదాంట్లో వేయమని చెప్పారు. అప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే చాకచక్యంగా ముందు బంతులను ఏరివేశారు. కానీ పక్కనున్న ఆవిడ మగపిల్లలనే విజేతలుగా ప్రకటించింది. దీంతో పిల్లలు ఆశ్చర్యపోయారు. మగపిల్లలు కావడం వల్లే వాళ్లను విజేతలుగా ప్రకటించినట్లు ఆ టీచర్ చెప్పింది అంటే.. పురుషాధిక్య సమాజంలో ఉన్నామని చిన్నతనం నుంచే మనం నూరిపోస్తున్నామన్నట్లేగా! చెప్పింది అంజలి. సమానత్వం కోసం పోరాటాలు చేయొచ్చు. కానీ అవి కొన్నిసార్లు గాడి తప్పి పూర్తి అర్థాన్నే మార్చేయకూడదంటారామె.


అంతా ఆమె చేతిలోనే..

అన్నిసార్లు నిర్ణయించుకునే హక్కు అమ్మాయికి ఇవ్వాల్సిందే! దానికోసం అమ్మాయి కూడా పోరాటం చేయాలంటున్నది అంజలి. అందుకు ఒక చక్కని ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నది. ఆమె చదువుకుంటున్నది. యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేయాలనే ఆశ ఉండేది. ఆ సమయంలోనే ఒక పెండ్లి సంబంధం వచ్చింది. అత్తగారిది పెద్ద కుటుంబం. దాంతో పెండ్లి అయ్యాక ఉద్యోగం లాంటిది చేయొద్దని అత్తింటివారు కచ్చితంగా ఉన్నారు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది ఆ కుటుంబం. ఆ అమ్మాయి ఆశలను చిదిమేసి అతడికి ఇచ్చి కట్టబెట్టడమా? లేక ఆమె ఆశయాన్ని గౌరవించడమా? అన్న విషయంలో ఉన్నారా తల్లిదండ్రులు. ఆ అమ్మాయి తల్లి వెంటనే మీకు కావాల్సింది మీ ఇంటికో పనిమనిషి. మా అమ్మాయి ఈ పనులు చేయడానికి కాదు.. తనకంటూ కొన్ని ఆశలు, ఆశయాలున్నాయి.


వాటిని మేం నెరవేరుస్తాం. మీరు దయచేసి వేరే సంబంధం చూసుకోండి అని సమాధానమిచ్చింది. వెంటనే ఆ కూతురి ఆనందానికి అవధిలేకుండా పోయింది. ఇప్పుడా అమ్మాయి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంది. తనకు నచ్చిన వాడిని పెండ్లాడి సంతోషంగా ఉంది అని చెప్పింది అంజలి. ఆ రోజు వాళ్లమ్మ తన వైపు నిలబడకపోతే ఒక చదువుల తల్లి మనకు దక్కనట్టే కదా! అందుకే ఆడవాళ్లని చదువనిద్దాం, ఆర్థిక స్వాతంత్య్రాన్ని కలుగచేద్దామని నినదిస్తున్నది హజరికా. కెరీర్ అంటే కేవలం డబ్బు సంపాదించడం గానే భావించవద్దంటున్నది హజారికా. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో కెరీర్ అనేది.. ఆమెకు కావాల్సిన ఐడెంటిటీ అనేది గుర్తుపెట్టుకోవాలంటున్నది. ఆ ఇంట్లో సభ్యులు అమ్మాయికి అండగా నిలబడినప్పుడే ఏదైనా సాధ్యమంటున్నది.


గమ్యం ఒక్కటే కానీ..

జెండర్ ఈక్వాలిటీ అనేది కొన్నిసార్లు సరైన దిశలో వెళ్లడం లేదు. ఆడవాళ్లు కూడా దాన్ని ఒక ప్రయోజనంగా భావించి మగవాళ్ల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఇక్కడ మగవాళ్లను కించపరుచడానికి కాదు. వివక్ష లేని సమాజ నిర్మాణానికి అందరూ ముందడుగు వేయాలంటున్నది అంజలి. ఆడ-మగ పని అనే ఓ పరుగు పందెం పెట్టుకున్నారు. మగవాళ్లు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి తక్కువ సమయం పట్టింది. అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె ఎక్కువ సమయం తీసుకున్నది. దీనికి కారణం ఏమయి ఉంటుందని అనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నది హజారికా. దీనికి ఆమె సమాధానంగా.. మగవాళ్లు గమ్యం చేరుకోవడానికి వారికి ఎలాంటి అడ్డు లేకుండా ఆమె పనిచేస్తుంది. అదే ఆమె పరుగెత్తాలంటే ఎన్నో అడ్డంకులను ఈ సమాజం సృష్టిస్తుంది.


ఆమె కూడా తనకు తానుగా తెలియని ఆ ఛట్రంలో ఇరుక్కుపోయి లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయాన్ని ఎక్కువ తీసుకుంటుంది. గమ్యం ఒక్కటే కానీ దాన్ని చేరాలంటే మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎన్నో అడ్డంకులను దాటి రావాలి అంటున్నది. అయితే పని విషయంలో ఆడవారు, మగవాళ్లు సమానమే అన్న విషయం మహిళలూ గుర్తుంచుకోవాలి. పని విషయానికొచ్చేసరికి మేము ఆడవాళ్లం అని వెనుకడుగు వేయకూడదంటారామె. పని విషయంలో ఏమైనా కొరతలుంటే డిమాండ్‌చేసే అధికారాన్ని వినియోగించుకోండి. చేసే పనిపట్ల అవగాహన కలిగి ఉండాలి. తన బాధ్యతలను పూర్తి చేయడానికి ఇతరుల మీద ఆధారపడకూడదు. అవసరమైతే ఇంకొకరికి చెప్పేలా తయారవ్వాలి. పదిమందికి మీరే ఆదర్శం కావాలంటున్నది అంజలి హజారికా.

anjali-hazarika3

అమ్మే ఆదర్శం..

ఏ దేశంలోనైనా అమ్మాయిలు ఈ పనిచేయలేరు. కొన్ని పనులకే పరిమితం చేయాలనే భావన నాటుకుపోయింది. మహిళలు ప్రొఫెషనల్‌గా ఎదుగలేరు. వారికి ఈ ప్రొఫెషన్ సూట్ కాదని ముందే నిర్ణయిస్తుంటారు. ఈ భావజాలంలో మార్పు రావాలని కోరుకుంటున్నది అంజలి. అమెరికాలాంటి అగ్రదేశాలు కూడా ఇలాంటి అపోహల్లో బతుకడం ఎంతో శోచనీయమంటున్నది. కొందరు మహిళలు కూడా ఈ భావజాలంలో ఇరుక్కుపోయి ఉన్నారు. వారిలో మార్పు కోరుకుంటున్నది. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి భావాలను ఎక్కించకూడదని విజ్ఞప్తి చేస్తున్నది. తన తల్లి చిన్నప్పుడు తన భావాలను చెబుతూ పెంచింది. నీ కారణంగా ఎవరూ బాధపడకూడదు. అలానే నీ సహాయం ఇతరులకు అవసరమైనప్పుడు వెనుకడుగు వేయకు. అందరినీ ముందుండి నడిపించు అని చెప్పిందట. ఆ మాటలే ఇప్పటికీ గుర్తుంచుకుంది. అమ్మాయిలు పెళ్లి విషయానికి వచ్చేసరికి తప్పటడుగులు వేస్తున్నారు. యువత ఇప్పటికైనా మేలుకోవాలి. ఆస్థి, అంతస్తులు కాకుండా మంచి మనసుతో పాటు, అభిప్రాయలను గౌరవించే వరుడ్ని ఎంచుకోండని చెబుతున్నది అంజలి.


anjali-hazarika2

మహిళా సంక్షేమం కోసం..

అంజలి హజారికా పుట్టింది మహారాష్ట్రలోని పుణెలో. సైకాలజీ, సోషల్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. దీంతో పాటు మేనేజ్‌మెంట్‌లో డాక్టరేట్ చేసింది. భారతదేశంలోని పెట్రోలియం, గ్యాస్ కంపెనీలతో పనిచేసింది. ఉద్యోగుల సంక్షేమం, రక్షణ కోసం ఆయా కంపెనీలకు దిశానిర్దేశం చేసింది. ఆమె సేవలకు భారత పెట్రోలియం మంత్రిత్వశాఖ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. అమెరికాలోని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ద సొసైటీ ఆఫ్ డ్రీమ్స్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్. అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్‌లో పని చేస్తున్న మహిళల కోసం వేదికను నెలకొల్పడంలో అంజలి సేవలందించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకుల సదస్సుకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించింది అంజలి హజారికా. డేరింగ్ టూ డ్రీమ్, వాక్ ద టాక్ ఉమెన్, వర్క్, ఈక్విటీ, ఎఫెక్టివ్‌నెస్ అనే పుస్తకాలు రాసింది.
-వనజ వనిపెంట

1132
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles