అవి పూర్తిగా పోతాయా?


Thu,April 18, 2019 01:35 AM

నా వయస్సు 27సంవత్సరాలు. తలనొప్పితో రెండేళ్ళ పైబడి నుంచి బాధపడుతున్నాను. హాస్పిటల్‌లో చూపించుకుంటే టెస్ట్ చేసి మెదడులో ట్యూమర్ ఉందని చెప్పారు. బ్రెయిన్ ట్యూమర్లకు సర్జరీ చేయించుకున్నా పూర్తిగా పోవని విన్నాను. నిజమేనా? వీటితో ప్రాణాపాయముందా? ప్రాణం పోకుండా ఈ గడ్డలను నిర్మూలించడం సాధ్యం కాదా? దయచేసి వివరంగా తెలియజేయండి.
-కె. నాగేందర్, రాంపల్లి.

brain-tumor
మీరు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ గురించి ఎక్కువ ఆందోళన చెందకండి. అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలతో బ్రెయిన్ ట్యూమర్స్ శస్త్ర చికిత్స ఇప్పుడు సురక్షితమే. రిస్క్ కూడా తక్కువ. ట్యూమర్ వచ్చిన ప్రదేశాన్ని బట్టి, సైజ్ ను బట్టి రిస్క్, ప్రాణాపాయం ఉంటాయి. మెదడులో ట్యూమర్లు రెండు రకాలుంటాయి.. బెనిగ్న్ ప్రైమరీ ట్యూమర్లు, మెలిగ్నెంట్ ప్రైమరీ ట్యూమర్లు. ఇవి కేంద్రనాడీ మండలం(సి.ఎన్.ఎస్.)లోని పలురకాల కణాల నుంచి ఏర్పడతాయి. మెదడు గడ్డల్లో బెనిగ్న్ ప్రైమరీ ట్యూమర్లు మెదడులో లోతుగా పాతుకుని ఉండవు. ఈ రకమైన ట్యూమర్లు కాన్సర్ కారకమైనవి కావు. అందువల్ల బ్రెనిగ్న్ టూమర్లు ఉన్న ప్రాంతంలో శస్త్రచికిత్స చేయడానికి వీలయితే వీటిని తేలికగా తొలిగించి వేయొచ్చు. అయితే ఒకసారి సర్జరీ చేసి తీసివేసినా ఇవి తిరిగి పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది.

బ్రెయిన్ సర్జరీలలో విప్లవాన్ని తీసుకువచ్చిన ఇంట్రాఆపరేటివ్ 3టి ఎం.ఆర్.ఐ. ఇటీవల మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంట్రా ఆపరేటివ్ ఎం.ఆర్.ఐ. సాయంతో సర్జన్లు కేంద్రనాడీ మండలం(సి.ఎన్.ఎస్.)లో ఏర్పడే గడ్డలను మూలాల వరకూ గుర్తించి కూకటి వేళ్లతో తొలిగించి వేయడానికి వీలవుతుంది. ఈ ఎం.ఆర్.ఐని ఉపయోగించి న్యూరోసర్జన్లు విజయవంతంగా ఎన్నో సంక్లిష్టమైన మెదడు గడ్డల ఆపరేషన్లు చేసి మెదడులో గడ్డలను పూర్తిగా తీసివేయగలిగారు. ఇంట్రాఆపరేటివ్ ఎం.ఆర్.ఐ. మెదడులో ఉన్న గడ్డలు, పార్కిన్సన్స్ డిసీజ్, వణుకుడు (ఎసెన్షియల్ టెర్మర్స్) వ్యాధులకు సంబంధించి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలానికి ఎంతమాత్రం నష్టం జరగకుండా నిర్వహించేందుకు వీలు కలిగించింది. అందువల్ల ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా మీ బ్రెయిన్ ట్యూమర్ కి సర్జరీ చేయించుకోండి. మెదడులో గడ్డల సమూల నిర్మూలన ఇప్పుడు సాధ్యమే.

-డాక్టర్. బి. జె. రాజేశ్
-సీనియర్ న్యూరోసర్జన్
-యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

846
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles