అల్పాహారం అవసరమే!


Mon,April 13, 2015 01:46 AM

discription

అల్పాహారమే కదా అని మనం తరచు నిర్లక్ష్యం చేస్తుంటాం. సమయం లేకపోవడం సాకుగా చూపుతూ చాలామంది ఉదయం పూట ఏమీ తినకుండా హడావిడిగా పనిలో పడుతుంటారు. రాత్రి నుంచి ఉపవాసం ఉంటూ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు దాదాపు 15 గంటలకు పైగా కడుపు మాడ్చేస్తుంటారు. కొన్ని రోజులకు ఊరికే అలసిపోతుంటారు. మరికొన్ని రోజులకు రక్తహీనత. ఇలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. కారణం.. శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడం. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట ఆహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో వెల్లడైంది.

శక్తి అందాలంటే...


మన శరీరం రోజువారీ పనులు చేయాలంటే అందుకు తగినంత శక్తి కావాలి. ఆ శక్తిని అందించేది ఆహారం. మనం తీసుకున్న ఆహారం నాలుగు గంటల్లోగా జీర్ణం అయిపోతుంది. కాబట్టి మనం ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి అంటారు. ఆరుగంటల సమయం గడిచిపోయినా మనం ఎటువంటి ఆహారమూ తీసుకోకపోతే శరీరానికి అవసరమైన శక్తి అందదు. సాధారణంగా మనం రాత్రిపూట ఆరుగంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోతాం. ఆ తరువాత మనం లేచి రెడీ అయ్యేసరికి మరో గంట, రెండు గంటల సమయం పడుతుంది. అప్పుడు కూడా ఏమీ తినకుండా మధ్యాహ్న భోజనం వరకు వేచివుండడమంటే పొట్టలో మంట పెట్టడమే అవుతుంది. దానివల్ల రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.

Breakfast-family

అందుకే ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత మనం తీసుకునే మొట్టమొదటి ఆహారం అల్పాహారం. దీన్నే బ్రేక్‌ఫాస్ట్ అంటాం. అంటే ఉపవాసాన్ని విడవడం. రాత్రి సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోం కాబట్టి అది ఒకరకంగా అది ఉపవాసం లాంటిదే కదా. అందుకే అల్పాహారం బ్రేక్‌ఫాస్ట్ అయింది. సుదీర్ఘ సమయం పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో లోపించిన కీలకమైన పోషకపదార్థాలను ఈ అల్పాహారమే భర్తీ చేయాల్సి ఉంటుంది.

మెదడుకు మేత


ఈ అల్పాహారం ఎంత ముఖ్యమైనదో మనం గుర్తించడం లేదు. పిల్లలు, కౌమారంలో ఉన్నవాళ్లు ఇంకా పెరిగేదశలో ఉంటారు. వీరి పెరుగుదల చక్కగా ఉండాలంటే ఉదయం పూట తీసుకునే అల్పాహారం అత్యవసరం. అది కూడా మంచి పోషక పదార్థాలు కలిగి ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. టీనేజ్‌లో ఉన్న పిల్లల్లో బరువు, ఎత్తు ఒక దశలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది సక్రమంగా జరగాలంటే అల్పాహారం కీలకమైనది.

పిల్లలు శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఇదే పునాది. మెదడు చురుగ్గా ఉండాలంటే ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆకలితో స్కూల్‌కి వెళ్లే పిల్లలు చదువుపై ధ్యాస పెట్టలేరు. మనం అవసరమైనంత ఆహారం తీసుకోకపోతే అది మన ఆలోచనా సామర్థ్యం పైన ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ అధ్యయనంలో భాగంగా పిల్లల మెదడు చురుకుదనానికి పెట్టే పరీక్షల్లో ఉదయంపూట అల్పాహారం తీసుకోని పిల్లలు ఎక్కువ తప్పులు చేయగా, అలవాటుగా అల్పాహారం తీసుకునేవాళ్లు అందులో బాగా రాణించారు. పిల్లల ఆలోచనాశక్తి, గ్రహణశక్తి లాంటివి పెరగాలంటే అల్పాహారం తప్పనిసరి.

8475
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles