అరుదైన పూలను రక్షించేందుకు ఉద్యమం


Mon,February 25, 2019 01:15 AM

గ్లోబల్ వార్మింగ్ వల్ల కనుమరుగయ్యే పూల మొక్కలను సంరక్షించేందుకు అసోంలో ప్రత్యేక ఉద్యమాన్ని చేపట్టారు. మహిళలు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు అందరూ అరుదైన పూల మొక్కలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
assom-flowers
అరుదైన పూల జాతులను సంరక్షించేందుకు వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓ సంఘంగా ఏర్పడ్డారు. తోచినకాడికి ఆయా జాతుల మొక్కలను పెంచుతున్నారు. అసోంకు చెందిన కియోన్‌జీత్ గొగోయ్, అంకుర్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి రాష్ట్రంలో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అంతరించిపోతున్న పూలమొక్కలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. అరుదైన మొక్కలు అంతరించేపోతే కలిగే నష్టాలను గురించి జనాలకు తెలియజేస్తున్నారు. మొదటగా అసోంలో మొక్కలను సంరక్షించడానికి ప్రత్యేకంగా ఓ ఫేస్‌బుక్ ఖాతాతోపాటు, వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఆయా గ్రూపులలో విద్యావంతుల దగ్గర నుంచి నిరక్షరాస్యుల వరకూ అందరినీ ఏకం చేశారు. పూల మొక్కల గురించి సమచారం అందిస్తూ విషయాన్ని అందరికీ చేరవేశారు. పూల మొక్కలను పెంచేందుకు అందరినీ భాగస్వామ్యం చేశారు.

రాష్ట్రంలో గతంలో విరివిగా లభించే పూలు, ప్రస్తుతం అంతరించే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పూలలో అసోం రాష్ట్ర చిహ్నమైన కొపొ పువ్వు కూడా ఉంది. దీంతో తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో కియోన్‌జీత్ గొగోయ్, అంకుర్‌లు ఎంతో శ్రమిస్తున్నారు. అసోంలో రాష్ట్ర వ్యాప్తంగా అరుదైన పూల జాతులకు చెందిన మొక్కలను పెంచుతున్న వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు, ఎప్పటికప్పుడూ ఆయా మొక్కల పెరుగుదలకు సంబంధించిన ఫొటోలు సేకరిస్తూ సంరక్షిస్తున్నారు. ఇటువంటి పూల మొక్కలుండడం వల్ల సహజసిద్ధమైన ప్రకృతిని రూపొందించడమే కాకుండా ఆరోగ్యకరమైన గాలిని అందించవచ్చని కియోన్‌జీత్ గొగోయ్, అంకుర్‌లు చెబుతున్నారు.

680
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles