అరుదైన ఘనతతో ఆదర్శమయింది!


Wed,May 15, 2019 01:17 AM

మహిళలకు సరైన ప్రోత్సాహమివ్వాలే గానీ, ఎటువంటి రంగంలోనైనా విజయాన్ని సాధించగలుగుతారు. బెంగళూరుకు చెందిన మమత సనత్ కుమార్ అనే మహిళ ఓ బిడ్డకు తైల్లెన తర్వాత బాడీబిల్డర్‌గా అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నది.
bengaluru-muscle-mom
ఏదైనా సాధించాలంటే పెండ్లికి ముందే అనుకుంటుంటారు ఆడవాళ్లు. పెండ్లి తర్వాత ఏమీ సాధించలేమనుకునే వారికి మమత మార్గదర్శకురాలయింది. బెంగళూరుకు చెందిన కండల రాణి ఈ మమత సనత్‌కుమార్. పట్టుదల, అంకితభావం, నిరంతర శ్రమ ఉంటే చాలు ఎటువంటి విజయాన్నైనా అవలీలగా అందుకోవచ్చని ఆమె నిరూపించింది. కర్ణాటకలోని మారుమూల గ్రామయిన బసవపురలో పుట్టిన మమత చిన్నప్పటి నుంచి సమాజంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. మమతకు పిజ్జా, బర్గర్, కూల్‌డ్రింక్స్ అంటే చాలా ఇష్టం. ఇష్టంతో జంకుఫుడ్‌ను తీసుకోవడం వల్ల, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె 90కిలోల వరకూ బరువు పెరిగింది. బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లాలని నిర్ణయించుకొని, వ్యాయామం చేయడం ప్రారంభించింది. ఆ క్రమంలో తన బిడ్డకు దూరమవ్వాల్సి వచ్చింది. కూతురు అపూర్వను స్కూల్‌కు పంపి, ప్రతి రోజూ ఆఫీస్‌కు వెళ్లేవాడు మమత భర్త. కొన్నాళ్లకు ఆమె భర్తకు ఉద్యోగం పోవడం వల్ల నిరాశపడింది. ఇల్లు గడవడానికి చాలా ఇబ్బంది పడింది. ఆ సమయంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా, ఆత్మవిశ్వాసంతో తన ఫిట్‌నెస్ శిక్షణను పూర్తి చేసింది. శిక్షణ పూర్తయిన తర్వాత ఇల్లు గడవడానికి ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తూనే తన గమ్యం వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. ఫిట్‌నెస్ శిక్షణలో గురువు లేకుండానే, ఆమె స్వయంగా పలు మెళకువలు తెలుసుకొని, ప్రతి రోజూ 10గంటలు శ్రమించి తన శరీర దృఢత్వాన్ని పెంచుకున్నది. అలా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమయింది. ఆ సమయంలో చాలామంది తనను విమర్శించారు. మొదట్లో కుటుంబ సభ్యులు కూడా మమతను వ్యతిరేకించారు. ఆమె వారిని ఒప్పించడంతో అండగా నిలిచారు. తైల్లెయిన తర్వాత విజయాలు సాధించినవారిని ఆదర్శంగా తీసుకున్నది. మహిళల శరీరంపై కనిపించే చారలు, పులి చర్మంపై కనిపించే చారలు ఒకటేనని, విజయం సాధించడానికి అవి ఏమాత్రం అడ్డుకావని మమత నిరూపించింది. ఐదేండ్ల పాటు అహర్నిశలూ శ్రమించి లక్ష్యాన్ని చేరుకున్నది. మిస్ అండ్ మిస్టర్ గ్లోబ్ ఇండియా పోటీల్లో మమత విజేతగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నది.

167
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles