అరిచేతులపై ఆ మచ్చలేమిటి?


Wed,December 2, 2015 12:36 AM

నాలుగడుగులే వేయలేని స్థితిలో ఎవరైనా ఉద్యోగ, వ్యాపారాలేం చేస్తారు? అరిచేతుల నిండా సొనలు కారుతూ జిగట జిగటగా ఉంటే ఏ పనీ చేయలేరు. అన్నీ ఉన్న అంగవైకల్యం లాంటి పరిస్థితి ఇది. ఏ వ్యాధి అయినా కొన్ని మాసాల వ్యవధిలో పూర్తిగా నయమైపోవాలి. అలా కాకుండా, ఏళ్లకు ఏళ్లే గడిచిపోతున్నా ఏ ప్రయోజనమూ లేకపోతే అదేదో శాపమే అనుకుంటారు. ముఖ్యంగా ఇలా అరికాళ్లు, అరిచేతుల్లో సొనలు కారుతూ ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోతే మూఢనమ్మకాల్లో ఉండిపోతారు. వాస్తవానికి ఇది ఒంట్లో పుట్టిన వ్యాధే తప్ప శాపమూ కాదు.. దురదృష్టమూ కాదు. సాధరాణంగా ఏ చర్మవ్యాధి అయినా శరీరంలోని ఏదో ఒక భాగానికే పరిమితమై ఉండదు. క్రమంగానే అయినా అది మొత్తం శరీరానికి వ్యాపిస్తుంది. కాని వైపాదిక (పామోప్లాంటర్) సొరియాసిస్ మాత్రం ఏళ్ల పర్యంతంగా ఉన్నా అరిచేతులకూ, అరికాళ్లకే పరిమితమై ఉంటుంది. అరుదుగా ఏ 5 శాతం మందిలోనో శరీరమంతా పాకినా మిగతా 95 శాతం మందిలో అలా పాకదు. అరికాళ్లూ, అరిచేతులు శరీరంలో చివరి భాగాన ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాంశాలు వాటిలోకి సహజంగానే ఎక్కువగా వచ్చి చేరుతుంటాయి. దీనికి తోడు శరీరంలో ఎప్పుడు వాతం ప్రకోపితమైనా అది పిత్తాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. పిత్తాన్ని శరీరంలోని అడుగు భాగానికి నెట్టివేస్తుంది. పైగా అరిచేతులు, అరికాళ్లలో చెమట గ్రంథులు తక్కువగా ఉంటాయి. ఉన్నవి కూడా దాదాపు మూసుకునే ఉంటాయి. అందుకే వీటిని నాన్‌యాక్టివ్ స్వెట్‌గ్లాండ్స్ అంటారు. అలా అవి మూసుకుప్యో ఉండడం వల్ల అక్కడికి చేరుకున్న వ్యర్థ పదార్థాలు అంటే ఆమం బయటికి వెళ్లే మార్గం లేక అక్కడే ఉండిపోతుంది. ఇదే వైపాదిక సొరియాసిస్‌కు కారణమవుతుంది.

వాతం పెరిగితే..


వాతం సమతుల్యత కోల్పోయినప్పుడు అది పిత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే రక్త ధాతువును దెబ్బతీస్తుంది. దీనికి రక్తధాతువునే కాకుండా మాంస ధాతువును కూడా దెబ్బతీసే గుణం ఉంది. అందుకే అరిచేతులు, అరికాళ్లలో ఉండే పొర జిడ్డు లేకుండా మందంగా, గరుకుగా మారుతుంది. ఆ భాగాలు పగుళ్లు బారతాయి. ఒక దశలో అరికాళ్లు, అరిచేతుల నుంచి వ్యాధి వేళ్ల మధ్యలోకి కూడా పాకుతుంది. వైపాదిక సొరియాసిస్ బారినపడిన వారిలో అరికాళ్లు, అరిచేతులు పొడిబారి ఉంటాయి. ఈ భాగాలు ఎక్కువగా ఎరుపు రంగులో ఉంటాయి. వ్యాధి ముదిరేకొద్దీ తెలుపు రంగులోకి మారతాయి. మచ్చలు తెలుపు రంగులోకి మారాయంటే సమస్య మరింత సంక్లిష్టంగా మారిందని అర్థం. మరికొంత కాలానికి మచ్చలు రాగి రంగులోకి మారతాయి.

ఆక్రోపస్టులోసిస్


వైపాదిక సొరియాసిస్ రెండు రకాలు. అందులో ఆక్రోపస్టులోసిస్ ఒకటి. ఇది వేళ్ల చివరి భాగాల్లోనే వస్తుంది. ఆ భాగాల్లో అవసరానికి మించి కణజాలం ఉత్పన్నమై పొట్టులా మారుతుంది. ఆ తరువాత పగుళ్లు మొదలవుతాయి. క్రమంగా చీము గుల్లలు తలెత్తుతాయి. ఇక కాళ్లలో మడమ చుట్టూ ఈ పగుళ్లు, చీము గుల్లలూ ఏర్పడుతాయి.

పామోప్లాంటర్ పస్టులోసిస్


ఈ వ్యాధిలో అరిచేతులు, అరిపాదాల్లో పొట్టు లాంటి మచ్చలు, ఒకలాంటి పొర ఏర్పడతాయి. వీటివల్ల ఏమాత్రం కదల్లేని స్థితి ఏర్పడుతుంది. అరిచేతుల్లో ఏర్పడిన సమస్యతో ఏ చిన్న వస్తువునూ పట్టుకోలేరు. ఆ పొట్టు పగులుబారడంతో విపరీతమైన దురద మొదలవుతుంది. అందుకే రోగి ఆ పొరను బలవంతంగా తీసివేసే ప్రయత్నాలు చేస్తాడు. దీనివల్ల రక్తస్రావం కావొచ్చు. అదే సమయంలో దుమ్మూధూళి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్లు మొదలుకావొచ్చు. దీనివల్ల దైనందిన జీవిత కార్యక్రమాలన్నీ కుంటుపడతాయి. ఈ వ్యాధికి గురయ్యే వారిలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ. వాళ్లు తరచూ ఉపయోగించే డిటర్జెంట్లు ఇందుకు కారణం. ఈ వాయధిలో గోళ్లు, కీళ్లుదెబ్బతినడమే కాకుండా స్టెర్నో క్లావికులార్ ఆస్టియైటిస్ అనే మరో వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఏ కారణాలు సొరియాసిస్ రావడానికి దారితీస్తాయో, అవే కారణాలు పామోప్లాంటర్ రావడానికి కూడా దోహదపడతాయి. అంటే శరీరంలో ఆమం పెరిగిపోవడం ఒక ప్రధాన కారణం. జన్యుపరమైన కారణాలతో పాటు మేనరికపు వివాహాలు కూడా ఇందుకు దోహదపడతాయి.

ఆయుర్వేద విశిష్టత


ravikumar


వైపాదిక లేదా పామోప్లాంటర్ వ్యాధి రావడానికి కారణమైన ఆమాన్ని అంటే శరీరంలోని విష-వ్యర్థ పదార్థాలను తొలగించడం ఈ వ్యాధి చికిత్సలో కీలకమవుతుంది. అందుకు పంచకర్మ చికిత్సలే ఏకైక మార్గమవుతాయి. శరీరంలో పెరిగిపోయిన ఇన్‌ఫెక్షన్లను తగ్గించడానికి కొన్ని ప్రత్యేక కషాయాలను ఇస్తాం. వీటిని రోజూ క్రమం తప్పకుండా వాడాలి. అరిచేతులకు వాడే మందు ఎంతో కొంత నోటిలోకి వెళ్లినా ప్రమాదం ఏమీ ఉండదు. వాస్తవానికి అది కడుపులోకి ఇచ్చే ఔషధ మూలికల కషాయమే. అందువల్ల ఈ తైలాలను ఎవరైనా నిశ్చింతగా వాడుకోవచ్చు. చికిత్సలన్నీ సక్రమంగా తీసుకుంటే వైపాదిక సొరియాసిస్ తగ్గడానికి నెలరోజుల కన్నా ఎక్కువ సమయం పట్టదు. కాకపోతే డాక్టర్ సూచించిన నియమావళిని అక్షరాల పాటించడం ద్వారా రోగి డాక్టర్‌కు తోడ్పడాలి. అలా సహకరిస్తే ఈ వ్యాధిని సంపూర్ణంగా తొలగించే అవకాశాలుంటాయి.

1927
Tags

More News

VIRAL NEWS