అమ్మలాంటి ఆలోచన!


Wed,April 17, 2019 02:01 AM

అన్నార్థులు, అనాథలుండని సమాజం కోసం ఎంతోమంది కలలుగన్నారు. అందుకోసం కొందరు తమకు చేతనైన సహాయం చేస్తుంటే.. ఇంకొందరు ఉద్యోగాలను సైతం వదిలి సమాజ సేవ చేస్తున్నారు. ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూసేవారికి.. జానెడు కడుపు నింపుకోవడానికి చేయి చాచే వారికి భరోసా ఇస్తున్నారు. ఇలాంటి వారిలో ఒకరు నీలిమా ఆర్య. నేడు హైదరాబాద్ నగరంలో పబ్లిక్ రిఫ్రిజిరేటర్లు విజయవంతంగా అన్నార్థుల ఆకలి తీర్చుతున్నాయంటే.. అందుకు నీలిమ కృషి ఎంతో ఉన్నది. నెలల తరబడి ఆమె చేసిన పోరాటం, అధ్యయనం ఉన్నాయి. ఆ సంఘర్షణల సమాహారాన్ని జిందగీతో పంచుకున్నారు నీలిమ.
Dr-Neelima-arya
హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్.. వచ్చిపోయే వారు, రోగుల బంధువులతో రద్దీగా ఉన్న సందర్భమది.రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌పై పబ్లిక్ రిఫ్రిజిరేటర్ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఎవరో రోగి బంధువు. రెండుసార్లు అటూ.. ఇటూ తచ్చాడాడు. బాగా ఆకలి వేస్తుందనుకుంటా.. అతని బాధ గమనించిన ఓ వ్యక్తి.. ఓ బాబు.. ఆకలేస్తే అందులో ఉంటుంది తిను అన్నాడు. ఇదంతా గమనిస్తున్నది ఓ మహిళ.

అతను రిఫ్రిజిరేటర్ ఓపెన్ చేసి అందులో ఏవేం ఉన్నాయో చూశాడు. ఓ ర్యాక్‌లో అన్నం ఉంది. మరో ర్యాక్‌లో కూరలున్నాయి. కింది ర్యాకుల్లో వాటర్ బాటిల్స్.. పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. ఆకలి తీరడానికి ఏమేం కావాలో తీసుకున్నాడతను. ఆ రిఫ్రిజిరేటర్ పక్కనే కూర్చొని కడుపునిండా అన్నం తిన్నాడు. తర్వాత పండ్లు తిని నీళ్లుతాగి.. సంతోషంగా వెళ్లిపోయాడు. అతన్నే గమనిస్తున్న ఆ మహిళకు ఆత్మ సంతృప్తి కలిగింది. తనకూ కడుపునిండినంత సంబురపడింది. ఎందుకంటే.. ఆ రిఫ్రిజిరేటర్ అక్కడికి రావడానికి, అకలితో అలమటించేవారి కడుపు నింపడానికి ఆమె ఎంతో కష్టపడింది. నెలల తరబడి పోరాడింది. చివరకు అధికారులను ఒప్పించి అన్నార్థుల పాలిట అమ్మగా మారింది. ఆమే.. నీలిమా ఆర్య. సమాజానికి కొంతైనా తిరిగివ్వాలని అమ్మలాంటి ఆలోచన చేసింది.

ఆరు నెలల అధ్యయనం..!

చాలామంది ఆహారాన్ని వృథా చేస్తుంటారు. అది ఇంట్లో కావొచ్చు.. ఆఫీస్.. పార్టీలు.. ఫంక్షన్లు అవ్వొచ్చు. మిగిలిపోయిన అన్నాన్ని పారేస్తుంటారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో చూశారు నీలిమా. మరోవైపు అన్నం కోసం అలమటించే వారినీ గమనించారు. ఈ క్రమంలో వృథా అయ్యే ఆహారాన్ని అన్నార్థులకు అందివ్వాలని మంచి ఆలోచన చేశారు నీలిమా. ఇందుకు ఆహారం పాడవ్వకుండా రిఫ్రిజిరేటర్లు ఉంటే ఇంకా బాగుంటుందనీ, ఆహారం నిల్వ ఉంటుందని భావించారు. ఇదేవిధంగా చెన్నై, బెంగళూరు నగరాల్లో ఏర్పాటయిన పబ్లిక్ ఫ్రిజ్ ప్రాజెక్టు గురించి చదివారు. కమ్యూనిటీ వాళ్లు ఏర్పాటు చేసిన ఆ ఫ్రిజ్‌లు నిర్వహణ లోపంతో ఫెయిల్ అయ్యాయి. అందుకు అక్కడి ప్రభుత్వ సహకారం లేకపోవడం కూడా కారణమే. ఇలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు ఆర్నెళ్లపాటు అధ్యయనం చేశారు నీలిమ.

జీహెచ్‌ఎంసీని ఒప్పించింది..

తనకు నూతన జీవితాన్ని ఇచ్చిన హైదరాబాద్‌లో ఇలాంటి పబ్లిక్ ప్రిజ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు నీలిమ. ఇందుకు రెండు నెలలు హైదరాబాద్ అంతా తిరిగారు. పబ్లిక్ ఫ్రిజ్ ఉంచేందుకు అనువైన 100 ప్రదేశాలను గుర్తించారు. ఉదయం 6 గంటలకు వెళ్లి రాత్రి పదకొండు వరకూ రెస్టారెంట్లు, హోటల్ యజమానులతో మాట్లాడేవారు. తన ప్రాజెక్టు గురించి వివరించేవారు. వారు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో.. పట్టు విడువకుండా జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్‌ను కలిసి తన ప్రాజెక్ట్ వివరాలు చెప్పారు. ఆ ఆలోచన నచ్చిన ఆయన.. వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందనకు ఆ పని అప్పగించారు. మొదటి స్టాండింగ్ కమిటీలో ఇది అన్నపూర్ణ పథకం లాగానే ఉంది అని రిజెక్ట్ చేశారు. అయినా నిరాశ చెందకుండా ఇరవై రోజులు మేయర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు నీలిమ. నాలుగో స్టాండింగ్ కమిటీలో ఈ ప్రాజెక్ట్‌కు అంతా ఆమోదం తెలిపారు. ట్రయల్ రన్‌లో భాగంగా రెండు పబ్లిక్ ఫ్రిజ్‌ల ఏర్పాటుకు ఈ ఏడాది జనవరి 10న అనుమతి వచ్చింది. ఫ్రిజ్ పెట్టేందుకు చిన్న స్థలం, విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ ముందుకొచ్చింది.

ఆపిల్ హోమ్స్ లక్ష్యం అదే..

నీలిమ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల. వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. నాన్న ఆర్పీఎఫ్‌లో సీఐగా రిటైరయ్యారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి 2001లో ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ పూర్తిచేశారు నీలిమ. హైదరాబాద్ దూరదర్శన్‌లో ప్రభాత దర్శిని కార్యక్రమ నిర్వహకురాలిగా, ఢిల్లీ ఎడిషన్‌లో కూడా పనిచేశారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇంగ్లీష్ పాఠాలు, టోఫెల్ క్లాసులు చేప్పేవారు. 2011 నుంచి సౌదీ అరేబియాలోని దమామ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆరేళ్లు పనిచేశారు. 2016లో ఒక తెలుగు న్యూస్ చానల్‌లో క్రియేటివ్ హెడ్‌గా పనిచేశారు. అందులో నగిషీ ప్రోగ్రామ్ ఆమెకు బాగా పేరు తెచ్చింది. మరో తెలుగు న్యూస్ చానెల్‌కు సీఈఓగా పనిచేశారు. ఈ క్రమంలో గివ్ బ్యాక్ టు సొసైటీ నినాదంతో ఆపిల్ హోమ్స్ ఆర్గనైజేషన్‌ను రిజస్టర్ చేశారు. ఇందులో భాగంగా ఫీడ్ ద నీడ్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లారు నీలిమ. మే 12 మదర్స్ డే సందర్భంగా ఆపిల్ హోమ్ ఆర్ఫిన్ కిడ్స్ నుంచి రన్ ఫర్ ఆర్ఫన్ అనే ఈవెంట్‌ని నిర్వహించారు.
Dr-Neelima-arya1

20 మంది ఆకలి తీర్చడమే లక్ష్యం

పబ్లిక్ ఫ్రిజ్‌లతో ఒక్కో యూనిట్ ద్వారా రోజుకు 20 నుంచి 50 మంది ఆకలి తీర్చాలన్నదే నా లక్ష్యం. ఇందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకూ సొంతంగా రూ. 7 లక్షలు ఖర్చు చేశా. అయితే నేనొక్కదాన్ని అన్ని ఫ్రిజ్‌లు కొనడం సాధ్యంకాని పని. దాతలు ఎవరైనా ఫ్రిజ్ డొనేట్ చేస్తే వారి పేరు, ఫొటో, వివరాలు ముద్రిస్తాం. గత నవంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా ఈ ప్రాజెక్ట్ మీదనే పనిచేస్తున్నా. ఈ పబ్లిక్ ఫ్రిజ్‌లలో వెజ్, నాన్ వెజ్ ఆహార పదార్థాలు ఉంచేందుకు విడివిడిగా ర్యాకులు ఉన్నాయి. ఏ ఆహారం ఎక్కడ పెట్టాలో సూచనలున్నాయి. ఫీడ్ ద నీడ్ పేరుతో మొబైల్ యాప్, మొబైల్ వ్యాన్ ప్రారంభించే ఆలోచనల్లో జీహెచ్‌ఎంసీ ఉంది. పబ్లిక్ ఫ్రీజర్స్‌లో ఆహారం ఉంచాలనుకుంటున్న హోటళ్లు, సంస్థలు, వ్యక్తులందరికీ ఈ యాప్ కామన్ ఫ్లాట్‌ఫామ్.

సొంతంగా సిబ్బందిని నియమించి..

ఫీడ్ ది నీడ్ ప్రాజెక్టు జనవరి 31న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శిల్పారామం, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, నిమ్స్ ఆస్పత్రి సమీపంలో పబ్లిక్ ప్రిజ్‌లను ఏర్పాటు చేశారు నీలిమ. వీటి దగ్గర సొంత ఖర్చుతో సిబ్బందిని నియమించారు. ప్రతి యూనిట్ వద్ద ఒక పర్యవేక్షకుడు ఉంటాడు. అతనికి నెలకు రూ. ఆరువేల జీతం. ఆకలిగా ఉన్నవారికి ఆహారం అందించడం, వండిన ఆహారం నాణ్యంగా ఉందా? ప్యాకింగ్ సరిగ్గా ఉందా? లేదా? అనేది వారు గమనిస్తారు. హైదరాబాద్‌లో ప్రతీ 10 కిలోమీటర్లకు ఒకటి చొప్పున వంద పబ్లిక్ ఫ్రిజ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు నీలిమ. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఐదు చోట్ల పబ్లిక్ ఫ్రిజ్‌లు ఏర్పాటు చేశారు. ఈ నెల చివరికల్లా మరో 11 ఫ్రిజ్‌లను ఏర్పాటు చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

- వనజ వనిపెంట
- చిన్నయాదగిరి గౌడ్

505
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles