అమర్‌సింగ్ తండాలో అద్భుతం


Tue,December 30, 2014 01:29 AM

tribe


వీరు అక్షరాస్యతకు ఆమడదూరంగా ఉన్నారు. వ్యవసాయం చేసీ చేసీ అప్పుల పాలయ్యారు. అందరిలాగే వాణిజ్య పంటల మీదే ఆధారపడితే ఇక ఆత్మహత్యే శరణ్యం అని అర్థమైంది. అందుకే ఇప్పుడు రూటు మార్చారు. సమష్టిగా కూరగాయల సాగు చేస్తూ ఏజెన్సీలో ఓ విప్లవం మొదలెట్టారు. అద్భుతం సాధించారు. ఇప్పుడు ప్రతి ఇంటా కూరగాయల పంట పులకరిస్తోంది. అమర్‌సింగ్ తండాలో
జరిగిన ఈ అద్భుతం వెనుక ఉన్నది ఈ మహిళలే.

ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం అమర్‌సింగ్ నాయక్ తండా. మారుమూల ఏజెన్సీ ప్రాంతం. అక్కడ 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాలకు మించి భూమి లేదు. కొన్ని సంవత్సరాలుగా పత్తి, పప్పుధాన్యాలు, మిర్చి పంటలు వేసేవారు. కాలమంతా శ్రమించినా ఫలితం దక్కలేదు. అప్పులు పెరగడం, కుటుంబ పోషణ భారమవ్వడం గిరిజనులు గుర్తించారు. ప్రత్యామ్నాయం ఆలోచించారు. ఉన్న కొద్ది భూమిలో ఏదైనా కలిసొచ్చేది సాగు చేయాలని ఆలోచన చేశారు. కూరగాయలు సాగు చేస్తే ఏడాదంతా ఆదాయం వస్తుందని తెలుసుకున్నారు.

van


అప్పుల ఊబిలో కూరుకుపోయినా సాహసం చేశారు. అందరూ తమ భూములలో వ్యవసాయ బోర్లను వేసుకున్నారు. అందరినీ గంగమ్మ కరుణించింది. దీంతో 2005 నుంచి కూరగాయల సాగు మొదలెట్టారు. ఇక అక్కడ ఒక హరిత విప్లవమే ప్రారంభమైంది. గిరిజనులందరూ ఇతర పంటలను మర్చిపోయారు. పూర్తిగా కూరగాయల సాగు మీదనే దృష్టి పెట్టారు. ఏడాదికి మూడు పంటలు ఇచ్చే కూరగాయల సాగు చేశారు. లాభాలు మొదలయ్యాయి. అప్పులు తీరడం ఆరంభమైంది. ఇది గమనించిన ఉద్యానవనశాఖ ఆ గ్రామాన్ని సందర్శించింది. అధికారులు గిరిజనుల పట్టుదల, కృషిని చూసి అభినందించక తప్పలేదు.

సొసైటీగా ఏర్పడిన మహిళలు..


అమర్‌సింగ్ తండాను ఉద్యానవనశాఖ ప్రోత్సహించింది. గిరిజనులకు రాయితీలు కల్పించింది. దీంతో గిరిజన మహిళలందరూ కలిసికట్టుగా సాగులో ముందుకెళ్లాలనుకున్నారు. అప్పుడే శ్రీవినాయక వెజిటేబుల్ గోవెర్స్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. కూరగాయల సాగులో గ్రామాన్ని తిరుగులేని శక్తిగా తయారు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఉద్యానవనశాఖ నుంచి కాకర, వంగ, టమాట, గోరుచిక్కుడు, దోసకాయ, సొరకాయ, కీర, బెండకాయ, పందిరి బీరకాయలాంటి రకరకాల విత్తనాలు తీసుకొచ్చి సాగు మొదలెట్టారు. ప్రతి ఏడాది మూడు పంటలు వేసి శ్రమించారు. ఊహించని విధంగా లాభాల పంటను సొంతం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా అందరినీ అభినందించారు.

ప్రత్యేక రాయితీ..


2013లో రైతులంతా పందిరి బీరను ఉద్యానవనశాఖ ద్వారా సాగు చేశారు. ఊహించని విధంగా పంట పరవశించింది. దీంతో ఎకరా పంటకు 60 వేల రూపాయలు ఉద్యానవన శాఖ సబ్సిడీ కూడా కల్పించింది. ఆ ఏటా రైతులకు పంట పసిడి అయింది. పందిరి బీరకే కాకుండా మిగతా కూరగాయల సాగుకు కూడా ఉద్యానవనశాఖ రాయితీని కల్పించింది. ఈ విషయాన్ని అప్పటి ఖమ్మం కలెక్టర్ సిద్ధార్దజైన్ దృష్టికి ఉద్యానవనశాఖ తీసుకెళ్లింది. అప్పుడు ఆయన ప్రత్యేకంగా అమర్‌సింగ్ తండాను సందర్శించి కూరగాయల సాగును పరిశీలించారు. 2013 ఆగస్టు 15న ఆ గ్రామానికి చెందిన లింగ్యాను ఉత్తమ కూరగాయల రైతుగా గుర్తించి అవార్డును ప్రదానం చేశారు.

అంతేకాకుండా రవాణ సౌకర్యం కోసం ఒక వాహనాన్ని కూడా సబ్సిడీ కింద ఏర్పాటు చేశాడు. కంపోస్టు ఎరువులను కూడా సబ్సిడీపై ఉద్యానవనశాఖ ఇవ్వడం ప్రారంభించింది. దాన్ని ఆసరా చేసుకున్న గ్రామస్తులు సాగుకు మరింత పదును పెట్టారు. ఒకప్పుడు గరీబ్ గిరిజన పల్లెగా ఉన్న అమర్‌సింగ్ తండా.. నేడు ఊహకందని విధంగా అభివృద్ధి చెందింది. గిరిజనులంతా ఏకతాటిపై నిలిచి ప్రస్తుతం రెండు సొసైటీల ద్వారా సాగు చేస్తున్నారు. మారుమూల తండాలో ప్రారంభమైన ఈ కూరగాయల విప్లవం ఇప్పుడు యావత్ తెలంగాణకే ఆదర్శంగా మారింది.

గంగమ్మను మరువలేం..


గ్రామం చుట్టుపక్కల ఎక్కడ బోరు తవ్వినా పాతాళ గంగ ఉట్టిపడుతుంది. ఈ రోజు కూరగాయలు సాగుచేస్తున్నామంటే గంగమ్మతల్లి పుణ్యమే. గంగమ్మ మా గిరిజనులకు ఆసరా అయ్యింది. కూరగాయల సాగుకే ప్రాధాన్యతనిస్తున్నాం. అందరం కలిసి కూరగాయలు సాగు చేసుకుంటూ సొసైటీగా ఏర్పడ్డాం. అందరికీ మంచి లాభాలు వస్తున్నాయి.

రోజంతా తోటలోనే..


పంటను చూస్తే పరవశించి పోతాం. కూరగాయల సాగు అంటే మాకు మక్కువ. ఉదయం ఇంట్లో పనులు ముగించుకుని ఇంటి పక్కనే ఉన్న తోటకు వెళ్తాం. ఇక అక్కడే సాయంత్రం వరకు కూరగాయల సాగు చేస్తుంటాం. ప్రతి రెండు రోజులకు ఎన్ని క్వింటాళ్ల కూరగాయలు ఖమ్మం పంపిస్తాం. పెట్టిన పెట్టుబడి కొద్ది రోజుల్లోనే తీరిపోతుంది. ఎప్పటి రూపాయి అప్పుడు కనబడుతోంది.

అందరికీ సంతోషం


కూరగాయల సాగుతో కుటుంబమంతా సంతోషంగా బతుకుతున్నాం. ఇది వరకు అప్పుల బారిన పడి బతుకులు ఈడ్చేవాళ్లం. ఇప్పుడు చేసిన అప్పులన్నింటినీ తీర్చి ఒక ఒడ్డుకు చేరుతున్నాం. పొద్దంతా కష్టపడ్డ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఇతర సాగులను ఆశ్రయిస్తే ఏడాదికి ఒకసారే ఫలితం ఉంటుంది. కూరగాయల సాగు అలా కాదు.. ఏడాది పొడవునా ఆదాయం లభిస్తుంది.

1320
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles