అపోహలు తొలిగిపోవాలి


Sun,March 17, 2019 12:27 AM

కొత్తదారుల్లో వెళ్తున్నప్పుడు అవరోధాలు అడ్డొస్తాయి. ఓటములు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తూ సాధించిన విజయం అపురూపంగా ఉంటుంది. ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఉపేంద్ర సినీ ప్రయాణం అందుకు ఓ నిదర్శనం. ట్రెండ్, వాణిజ్య సూత్రాలతో సంబంధం లేకుండా విభిన్నమైన ఇతివృత్తాలతో సినిమాలు చేస్తూ దక్షిణాది చిత్రసీమలో వైవిధ్యమైన కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారాయన. జయాపజయాలకు అతీతంగా ముప్పైయేండ్ల సినీ ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నారు.
రాజకీయాల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. తన సినీ జీవితం, రాజకీయ ప్రయాణం గురించి ఉపేంద్ర జిందగీతో పంచుకున్న ముచ్చట్లివి..

heroUpendraRao

మీ ముప్పై యేండ్ల సినీ ప్రయాణం గురించి చెప్పండి?

-ముప్పైయేండ్లు అలా ఫ్లాష్‌లా గడిచిపోయాయి. రజినీకాంత్ చెప్పినట్లు పగటి కలలా అందంగా నా సినీప్రయాణం కూడా అలా సాగింది. నటుడిగా ఇప్పటివరకు చేసింది చాలా తక్కువ. చేయాల్సింది ఎంతో ఉంది. నా గురువు కాశీనాథ్ దర్శకత్వంలో రూపొందిన అనంతన అవంతారా సినిమాతో నా కెరీర్ మొదలైంది. ఆ సినిమా కోసం క్లాప్ బాయ్‌గా, నటుడిగా, గేయ రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అన్ని పనులు చేశాను.

రెండేండ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నట్టున్నారు?

-రాజకీయాల్లోకి వచ్చాను కదా! కొంచెం బిజీ అయ్యాను. ఉత్తమ ప్రజాకీయ పేరుతో సొంత పార్టీని స్థాపించాను. పార్టీ కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో సినిమాలకు దూరమయ్యాను.

రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?

-ఇప్పుడున్న నాయకుల్లో జవాబుదారీతనం లోపించింది. పారదర్శకత లేదు. ప్రజలకు బాధ్యత గల నాయకులు అవసరం. వారిని నా పార్టీ ద్వారా ప్రజలకు అందించాలని ప్రస్తుతమున్న పార్టీలకు భిన్నమైన ఆలోచన విధానాలు, విలువలతో ప్రజాకీయ పార్టీ స్థాపించాను. నా పార్టీకి ప్రత్యేకమైన స్ట్రక్చర్ ఉండదు. సమాజంలోని అవినీతిని నిర్మూలించడమే మా పార్టీ ఆశయం. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రభుత్వ నిధుల్లో ప్రతీ రూపాయి ఏ విధంగా సద్వినియోగం అవుతుంది, ఎలా దుర్వినియోగం అవుతుందో ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తాం.

డబ్బులు, పదవుల మీద వ్యామోహంతోనే పార్టీ పెట్టారని వస్తున్న విమర్శలకు మీ సమాధానం?

-కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగినవాళ్లు, పేరుప్రఖ్యాతులు ఉన్నవాళు ్ల రాజకీయాల్లోకి వస్తే ఓట్లు వేస్తారు. మిగతావారు రాజకీయాల్లో రాణించలేరు అనే విశ్వాసం బలంగా నాటుకుపోయింది. ఆ అపోహలు తొలిగిపోవాలి. ఆ ఆలోచనతోనే క్యాష్‌లెస్ పార్టీ స్థాపించాను. పార్టీ స్థాపించడం కోసం వేల కోట్ల రూపాయలు అవసరం లేదు. ఫండ్‌ల రూపంలో పార్ట్టీ కోసం డబ్బులు తీసుకోను. ఎవరికీ ఇవ్వను కూడా. ప్రజాప్రభుత్వంలో జీతాలు తీసుకుంటూ నిజాయితీగా ప్రజలకు మంచి చేసే నాయకుల్ని తయారు చేయాలన్నదే నా లక్ష్యం. తప్పకుండా అది నెరవేరుతుందనే నమ్మకం ఉంది.

నటుడిగా, దర్శకుడిగా మీరు గమనించినంత వరకు అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఇండస్ట్రీ ఎలా ఉందనుకుంటున్నారు?

heroUpendraRao2
ముప్పై యేండ్ల క్రితం సినీ పరిశ్రమ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. సాంకేతిక పరంగా మార్పులు వచ్చాయే తప్పితే కథలు, పాత్రలు, వాటి తాలూకు ఎమోషన్స్,ఫీల్ అలాగే ఉన్నాయి. కాలంతో వాటికి సంబంధం ఉండదని నా అభిప్రాయం.

మీ పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడానికి అభ్యర్థులు కావాలని సోషల్ మీడియాలో ప్రకటించారు. మీ పార్టీలో అభ్యర్థులు లేరా?

-నాయకుడు ప్రజల్లోంచి రావాలి. అందుకే అలా ఆహ్వానించాను. జీవితాంతం పార్టీ కోసం పనిచేస్తాను. కానీ, ఎన్నికల్లో పోటీ మాత్రం చేయను. నా పార్టీ తరుపున నిలబడే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఓ పరీక్ష నిర్వహించాను. వారిని ప్రత్యక్షంగా ఇంటర్యూ చేశాను. పార్టీ సిద్ధాంతాల ప్రకారం పారదర్శకతతో పనిచేయాలని చెప్పాను. పనితీరు నచ్చకపోతే ప్రజాభిప్రాయ సేకరణ చేసి పార్టీతో పాటు పదవి నుంచి కూడా తొలగిస్తానని అన్నాను. అవన్నీ అంగీకరించిన వారికే టికెట్ ఇస్తాను.

రజినీకాంత్, కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్, పవన్‌కల్యాణ్, మీరు ఇలా చాలామంది సినీనటులు రాజకీయాల్లోకి వస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం?

-రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. వృత్తితో సంబంధం ఉండదు. ఏ రంగం నుంచి వస్తున్నారనే దానికంటే వారి ఐడియాలజీ ఏంటి? ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? అనేదే ముఖ్యం. సినిమా గ్లామర్‌ను నమ్ముకొని రాజకీయాల్లోకి చాలామంది నటులు వస్తున్నారనే ఆలోచనను బ్రేక్ చేయాలి. సినిమా వాళ్లకు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉండకూడదా? హీరో అనే ఆలోచనతోనో, నాకున్న పేరు ప్రఖ్యాతులు చూసి కాకుండా నా ఆలోచన విధానాల్ని, సిద్ధ్దాంతాలపై నమ్మకం ఉంటేనే ఓటు వేయమని, పార్టీలో చేరమని అడుగుతున్నాను.

రాజకీయాలు, సినిమాలు రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు?

-సినిమా నా వృత్తి. దానికి దూరమైతే జీవితం గడవదు. అవినీతికి తావులేకుండా నిజాయితీగా పనిచేయడానికి కొంతైనా డబ్బు కావాలి. అందుకోసం సినిమాలు చేస్తాను. దీంతోపాటే.. రాజకీయాల్లో కూడా ఉంటాను. సినిమాల ద్వారా వచ్చిన డబ్బులను పార్టీ నిర్వహణ కోసం ఖర్చు చేద్దామనుకుంటున్నా.

మీ ముప్పై యేండ్ల ప్రస్థానంలో దర్శకుడిగా కేవలం పది సినిమాలే చేశారు? ఎందుకు?

-నటన, రాజకీయాలు, కుటుంబ బాధ్యతల కారణంగా దర్శకత్వంపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. హీరోగా నా 50వ సినిమాను స్వీయ దర్శకత్వంలో చేయాలన్నది నా కల. ఎన్నికల తర్వాత ఆ సినిమాను ప్రకటిస్తాను. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఆ సినిమా విడుదల చేస్తాం.

సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగు సినిమాలకు విరామం తీసుకున్నారు కారణం ఏంటి?

-కన్నడ, తెలుగు.. ఒకేసారి రెండు భాషల్లో సినిమాలు చేయడం కష్టంగా ఉంది. అందువల్లే గ్యాప్ తీసుకున్నాను. మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నేను కీలక పాత్రను చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అందులో వాస్తవం లేదు. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అదే సమయంలో కర్ణాటక విధానసభ ఎన్నికలు రావడంతో ఆ అవకాశం చేజారింది.

రియల్‌లైఫ్‌లో ఉపేంద్ర ఎలా ఉంటారు?

heroUpendraRao1
స్టార్ అనే భావనను నా మనసులోకి రానివ్వను. వీలైనంత వరకు సాధారణ జీవితాన్ని గడుపుతాను. అలా ఉండడమే ఇష్టం. నా ఆలోచనల్ని, భావాలను వ్యక్తీకరించడానికి సినిమాను ఓ వేదికగా మాత్రమే ఉపయోగించుకుంటాను. నా ప్రతీ సినిమా ద్వారా ప్రజలకు మంచి చెప్పడానికి ప్రయత్నిస్తాను.

కేజీఎఫ్, బాహుబలి తరహాలో మీరు సినిమాలు చేస్తారా?

-అలాంటి సినిమా నేను చేయలేను. నా శైలి విభిన్నంగా ఉంటుంది. సినిమా మాధ్యమానికి భాషాభేదాలుండవు. 1999లో ఉపేంద్ర సినిమా చేశాను. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఆ చిత్రం అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ కన్నడంతో పాటు తెలుగులో పెద్ద విజయాన్ని సాధించింది. భాష కంటే కథ ముఖ్యం. కథ బాగుంటే ఏ భాషలోనైనా సినిమా ఆడుతుంది.

కమర్షియల్ విలువలకు కట్టుబడకుండా ప్రయోగాలకు ప్రాధాన్యంఇస్తూ ప్రతిసారీ సినిమాలు చేయడానికి కారణం?

-జీరోతో నా జీవితం మొదలైంది. నా దగ్గర ఏం లేదు. కాబట్టే తొలినాళ్లలో ఓం, ఏ, రా అంటూ విభిన్నమైన టైటిల్స్‌తో ప్రయోగాత్మకంగా సినిమాలు చేశాను. అవరోధాలకు భయపడకుండా ప్రతిసారీ కొత్తదారుల్లో ప్రయాణించడానికి ప్రయత్నించాను కాబట్టే విజయాల్ని అందుకోగలిగాను. ప్రయోగాలు చేశాను కాబట్టే సక్సెస్ అయ్యాను. అందుకే ప్రయోగాలకే ప్రాధాన్యం ఇస్తాను.


-నరేష్ నెల్కి
-సిఎం. ప్రవీణ్

490
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles