అద్భుత జీవామృతం.. శివశక్తి తత్వసారం


Thu,February 28, 2019 11:01 PM

మహానుగ్రహానికి వేళ ఇదే!
ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్ అన్న సూక్తి ఈశ్వరార్చనలోని గొప్పతనాన్ని వెల్లడిస్తుంది. అటు మృత్యుర్భయాన్ని, ఇటు ఐశ్యర్యానందాన్ని ఏకకాలంలో అందించే అద్భుత జీవామృతం శివ-శక్తి తత్వసారమని వేదశాస్ర్తాలు ఉద్బోధిస్తున్నాయి. ఆ మహానుగ్రహానికి మహాశివరాత్రి పర్వదినాన్ని మించిన గొప్ప వేళా విశేషం మరొకటి ఉండదు.
Parvadinam
హైందవ దేవతామూర్తులందరిలోకీ అత్యంత నిరాడంబర భక్తవత్సలుడు శంకరుడు. మహావిష్ణువు అలంకార ప్రియుడైతే, మహాశివుడు అభిషేక ప్రియుడు. ఆదిపరాశక్తి తర్వాత ఆమె అంశను పుణికిపుచ్చుకొన్న అంతటి మహాశక్తి సంపన్నుడు కనుకే ఆదిదేవుడైనాడు. సాక్షాత్తు జగజ్జనని అయిన పరాశక్తిని తోడుగా చేసుకొన్న లయకారుడు. కాబట్టే, ఆయన ఆజ్ఞ లేకుండా సృష్టిలోని చీమలైనా చైతన్యవంతం కాలేవు. మనిషి శరీరంలో నిక్షిప్తమై వున్న జీవాత్మను అంటి పెట్టుకొని వుండే అసాధారణ కుండలినీ శక్తికి మూలం కూడా ఆయనేనని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. ఈ శివశక్తి తత్వాన్ని బోధపరచు కోగలిగితే పరమేశ్వరుని మహానుగ్రహం పొందడం ఇక తేలికవుతుంది. మరి, ఆ శివజ్ఞానం మనకు అందేదెలా?


శివుడంటే ఆదిభిక్షువని, బూడిద తప్ప వేరే ఆస్తిపాస్తులేవీ లేనివాడని చాలామంది అనుకొంటారు. కానీ, నిజానికి అసలైన ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదించేది ఈశ్వరుడేనని శివస్తోత్రాలు చెబుతున్నాయి. ఐశ్వర్యం ఈశ్వరదిచ్ఛేత్ సూక్తి ప్రకారం ఈశ్వరుని ఐశ్వర్యంలోకి భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు వంటివీ వస్తాయని వేదపండితులు అంటారు. నిజానికి లౌకికంగా ఐశ్వర్యమంటే ధనకనక వస్తువాహనాలుగా చెప్తారు. కానీ, నిజమైన ఐశ్వర్యం పైన పేర్కొన్న ఈశ్వరీయాలేనని వారంటారు. ఇంకా ఈశ్వరుడంటేనే ఐశ్వర్యమనీ వారు అంటారు.


శంకరుడు ఎంత భోళాదైవమో అంత స్థితప్రజ్ఞుడు. ఎంత నిరాడంబరుడో అంత సుసంపన్నుడు. ఆయనది ఎంత మహారౌద్ర రూపమో అంతటి ప్రశాంత చిత్తం. ఏమీ లేని వాడేకాదు, ఎంతో ఉన్నవాడు కూడా. పేదభక్తుల హృదయ నివాసి. వెలుగుచీకట్ల పట్ల భేదభావాలు లేనివాడు. తన భక్తులైన సురాసురుల పట్ల సమానత్వాన్ని పాటించిన వాడు. చాలా పౌరాణికాలలో ఎందరో ఈశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందిన వారే ఎక్కువగా కనిపిస్తారు. తనను ప్రగాఢంగా ఆరాధించిన భక్తుల్ని ఈశ్వరుడు ఎంతగా ప్రేమిస్తాడంటే, తనకున్నదంతా ఇచ్చేయడానికైనా వెనుకాడనంతగా. భస్మాసురునికి ఇచ్చిన వరం, తర్వాతి పర్యవసానమే ఇందుకు ఒక నిలువెత్తు ఉదాహరణ.


ఈశ్వరుడు లయకారుడు కాబట్టే మృత్యుభయాన్ని పోగొట్టే అద్భుతశక్తి ఆయనది. మార్కండేయుని వంటి మహాభక్తులకు ప్రాణం పోసిన జగద్రక్షకుడాయన. శివుని మనసు వెన్నపూస. హృదయం పాలకడలి. అసాధారణమైన అమ్మ క్షమాగుణాన్ని, అనితర సాధ్యమైన కరుణను తనను నమ్మిన భక్తులపై కురిపించే ఏకైక, మహోన్నత పురుష-అర్ధనారీశ్వర తత్వం ఆయన సొంతం. ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఏడాదికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి మానవ మాత్రులకు ఒక అద్భుత అవకాశం. శివపంచాక్షరి (నమశ్శివాయ) మంత్రానికున్న శక్తి అనంతం. ఆది-అంతాలు లేని పరిమాణంలో మహామహోన్నతంగా జగత్తునంతా వ్యాపించగల లింగరూపుని శక్తి ఎవరి కొలమానాలకూ అందేదీ కాదు. ఓం నమశ్శివాయ అంటూ తనను కొలిచిన వారిని ఆర్తిగా అక్కున చేర్చుకోవడమే ఆయనకు తెలుసు. ఋగ్వేదం (7-59-12)లోని మహామృత్యుంజయ మంత్రమే (ఓం త్య్రంబకం యజామహే..) మనందరికీ తిరుగులేని రక్ష. ఎంతో పుణ్యాత్ములకు తప్ప అన్యులకు లభించని ఆ శివసాయుజ్యం జన్మజన్మల పుణ్యఫలం.


-దోర్బల బాలశేఖరశర్మ

666
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles